Share News

శ్వేతసౌధ విజేత ఎవరు?

ABN , Publish Date - Nov 06 , 2024 | 01:51 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో సాధారణంగా స్ధానిక ఆంశాల ప్రాతిపదికన కాకుండా అంతర్జాతీయ అంశాల ఆధారంగా తమ అధినేతను ఎన్నుకోవడానికి ఓటర్లు ప్రాధాన్యత ఇవ్వడం పరిపాటి. ఈ కారణంగా...

శ్వేతసౌధ విజేత ఎవరు?

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో సాధారణంగా స్ధానిక ఆంశాల ప్రాతిపదికన కాకుండా అంతర్జాతీయ అంశాల ఆధారంగా తమ అధినేతను ఎన్నుకోవడానికి ఓటర్లు ప్రాధాన్యత ఇవ్వడం పరిపాటి. ఈ కారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విదేశాంగ విధానం సహజంగా ముఖ్య భూమిక వహిస్తుంది.

అమెరికాకు అత్యంత సన్నిహిత దేశం ఇజ్రాయెల్. ఈ యూదు దేశానికి చేసినంతగా ఆర్ధిక, సైనిక సహాయం అమెరికా ఇప్పటివరకు ఏ ఇతర దేశానికీ చేయలేదు. అమెరికా విదేశాంగ విధానంలో ఇజ్రాయెల్ అరబ్బు, ఇరాన్ ఉద్రిక్తతలకు అగ్ర ప్రాధాన్యం వహిస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్‌ నుంచి ఫలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్‌ అమానుష సైనిక దాడులు చేస్తోంది. అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో పెల్లుబుకుతున్న నిరసనల నేపథ్యంలో అమెరికా ఓటర్లు తమ తీర్పును వెలువరిస్తున్నారు.


అధ్యక్ష పదవీ పోటిలో ఉన్న ఇద్దరు అభ్యర్ధులు – డోనాల్డ్ ట్రంప్, కమలా హరిస్ – కూడ ఇజ్రాయెల్‌కు అనుకూలురే. ఇరువురిలో ఎవరు విజేతగా నిలిచినా ఇజ్రాయెల్‌ను నివారించడం లేదా దానికి సైనిక సహాయాన్ని స్తంభింపచేసే అవకాశాలు అంతగా లేవు. అయినా మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు అమెరికా ఎన్నికలలో ఒక కీలక అంశం కావడం విచిత్రం. అక్రమిత గాజా, లెబనాన్‌లపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల ప్రకంపనలు అమెరికా అనుకూల అరబ్బు దేశాల ప్రజానీకంలో అగ్రహావేశాలకు కారణం కాకూడదని ఆయా దేశాల ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి. అందుకే అవి అమెరికా ద్వారా ఇజ్రాయెల్‌ను నిలువరించేందుకు విఫలయత్నాలు చేశాయి. అమెరికా చరిత్రలో జో బైడెన్ ఇజ్రాయెల్‌కు అత్యంత సన్నిహిత అధ్యక్షుడుగా పేరుపొందగా అదే రాజనీతిని కమలా హరిస్ కూడ కొనసాగించే ఆవకాశాలు ఉన్నాయని అరబ్బు మేధావులు అభిప్రాయపడుతున్నారు. అయితే డెమొక్రాట్లలో వ్యవస్ధీకృతమైన దౌత్యవిధానం ఉంటుందని, అందులో అరబ్బులకు కూడ కొంత వరకు స్ధానం ఉంటుందని కూడా అరబ్బు మేధావులు విశ్వసిస్తున్నారు. ఈ నాటకీయ దౌత్య విధానం తమకు కొంత వరకు ఉపశమనం చేకూర్చగలదని అరబ్‌ ప్రభుత్వాల ఆశ.


ఇజ్రాయెల్‌తో సరిహద్దులు ఉన్న జోర్డాన్, ఈజిప్టులు ఆ యూదు దేశంతో దౌత్య సంబంధాలు కలిగి ఉండడమే కాకుండా అమెరికా కారణాన ఫలస్తీనాపై దాడులకు జోర్డాన్‌ పరోక్షంగా ఇజ్రాయెల్‌కు సహకరిస్తుందనే అరోపణలు కూడ ఉన్నాయి.

డోనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష హాయంలో అబ్రహం ఒడంబడికకు శ్రీకారం చుట్టడం ద్వారా మధ్యప్రాచ్య అరబ్బు దేశాలలో ఒక సాహసోపేత దౌత్య విధానానికి నాంది పలికారు. ఈ ఒడంబడిక ద్వారా ఇజ్రాయెల్‌తో సంపన్న అరబ్బు దేశాలు మైత్రి చేసుకొనే అవకాశం కల్పించారు. గల్ఫ్‌లోని యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్, బహ్రెయిన్‌లతో పాటు సుడాన్, మోరకో దేశాలు ఇజ్రాయెల్‌ను గుర్తిస్తూ వాటితో దౌత్యసంబంధాలను నెలకొల్పుకున్నాయి. దుబాయి అయితే ఇజ్రాయెల్ దోస్తానా విషయమై మిగతా గల్ఫ్‌ రాజ్యాల కంటే ముందంజలో ఉన్నది. ఫలస్తీనాను కూడ ఒక ప్రత్యేక దేశంగా గుర్తించే నిబంధనలతో కీలకమైన సౌదీ అరేబియా సైతం అబ్రహం ఒడంబడికలో చేరుతుందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్‌ 7న ఇరాన్ ప్రొద్భలంతో హమాస్ ఇజ్రాయిల్‌పై క్షిపణి దాడులు చేసింది. అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ పాల్పడుతున్న మారణకాండతో అరబ్బులలో అగ్రహావేశాలు పెరిగిపోయాయి. దీంతో ఏ ఒక్క అరబ్బు దేశం కూడ అబ్రహం ఒడంబడిక లేదా మరే ఇతర నూతన ఒప్పందాల ద్వారా ఇజ్రాయెల్‌తో బాహాటంగా మైత్రి చేసేందుకు మొగ్గు చూపకపోవచ్చు.


అబ్రహం ఒడంబడిక ద్వార భారత్‌ నుంచి కీలక గల్ఫ్ అరబ్బు దేశాలతో పాటు ఇజ్రాయెల్ మీదుగా ఐరోపాకు నౌకా రవాణా మార్గాన్ని సుగమం చేసే దిశగా కూడ అడుగులు పడుతున్నాయి. ఈ యురేసియా మార్గం ద్వారా భారత్ నిజంగా తాను విశ్వగురు అని నిరూపించుకునె అవకాశం ఉంది. గుజరాత్‌లోని ముంద్రా రేవు నుండి ఇజ్రాయ్‌ల్‌లోని హైఫా రేవు మీదుగా ఐరోపాకు సరుకులు రవాణా చేయడానికి ఉద్దేశించిన ఈ బృహత్తర పథకాన్ని అమలుపరిచేందుకు ప్రధాని మోదీ పూర్తి స్ధాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. గుజరాత్‌లోని ముంద్రా నౌకాశ్రయం, అటు చివర ఇజ్రాయిల్‌లోని హైఫా నౌకాశ్రయ నిర్వహణ రెండు కూడ అదానీ గ్రూప్‌ యాజమాన్యంలో ఉన్నాయనేది మరో విషయం. ఈ మార్గం గురించి అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, భారతీయ అధికారులు కసరత్తు చేస్తున్నా అనూహ్యంగా గాజా దాడుల నేపథ్యంలో దీనిపై పురోగతి కొరవడింది. ఈ పథకం ముందుకు సాగడానికి అబ్రహం ఒడంబడిక కర్త అయిన డోనాల్డ్ ట్రంప్ మరో సారి శ్వేత సౌధంలో ఉండడం భారత్‌కు చాలా అవసరం కూడా.


డోనాల్డ్ ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షునిగా ఎన్నికయిన తర్వాత తన విదేశీ పర్యటనను సౌదీ అరేబియా నుంచి ప్రారంభించారు. తద్వారా మధ్య ప్రాచ్య అరబ్బు ప్రాంతం పట్ల తనకున్న ప్రాధాన్యతను చాటారు. జెరుసాలం మూమ్మాటికి ఇజ్రాయ్‌ల్‌కు చెందాలని చెప్పిన డోనాల్డ్ ట్రంప్‌కు కీలక అరబ్బు పాలకులందరితో పాటు ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమీన్ నెతన్యహుతో కూడ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ పరిస్ధితులలో అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల ఫలితాల పట్ల ఇటు భారత్ నుంచి అటు అరబ్బు, ఇజ్రాయెల్ వరకు ఆసక్తి నెలకొని ఉన్నది.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - Nov 06 , 2024 | 01:51 AM