సభకు వెళ్లని వారికి పదవులెందుకు ?
ABN , Publish Date - Nov 15 , 2024 | 02:25 AM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు. ఇప్పుడు ఆయన ఆరవ పర్యాయం అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1996లో ఓ దఫా లోక్‌సభకు కూడా...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు. ఇప్పుడు ఆయన ఆరవ పర్యాయం అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1996లో ఓ దఫా లోక్‌సభకు కూడా ఎన్నికయ్యారు. రాజకీయంగా విశేష అనుభవం గడించిన చింతకాయల అయ్యన్న పాత్రుడికి అసెంబ్లీ వ్యవహారాలను ఎలా నిర్వహించాలో బాగా తెలుసు. సభా సంప్రదాయాలను, అసెంబ్లీ ఔన్నత్యాన్ని తిరిగి ఇనుమడింప జేయాలన్న దృఢ సంకల్పం స్పీకర్ అయ్యన్న పాత్రుడి మాటల్లో వ్యక్తమవుతోంది. అందుకు తగిన అవకాశం ఆయనకు ఇదే. సభా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల సంపూర్ణ విశ్వాసం ఉంది కనుక స్పీకర్ అయ్యన్న పాత్రుడికి సభానాయకుడైన ముఖ్యమంత్రి నుంచి తగిన సహకారం లభిస్తుంది. ఈ క్రమం లోనే రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు సభకు సెలవు ప్రకటించి, ఆ రోజున కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులకు, ఆసక్తి ఉన్న మిగతా సభ్యులకు బడ్జెట్ అంశాలపై అవగాహన సదస్సులను నిర్వహించారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చట్టసభలకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. కోట్లాదిమంది ప్రజలు నేరుగా చట్టసభలకు వెళ్లలేరు కనుక వారు తమ ప్రతినిధులను ఎన్నుకొని చట్టసభలకు పంపిస్తారు. చట్టసభలలో జరిగే చర్చలలో పాల్గొని ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలకు మేలు చేసేవిగా ప్రభావితం చేయడం ఎన్నికైన ప్రజాప్రతినిధుల రాజ్యాంగ బాధ్యత. ఫలితంగానే ప్రజాస్వామ్య దేశాలలో చట్టసభలకు, అక్కడ జరిగే చర్చలకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. ప్రజాస్వామ్య సౌధాలుగా చట్టసభలను పేర్కొనడానికి గల కారణం కూడా అదే. చట్టసభల అస్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని వాటికి ప్రాతినిధ్యం వహించే సభ్యులు, సభా నాయకుడు, ప్రతిపక్షనేత, స్పీకర్... ఇలా అందరూ ఉమ్మడిగా పెంపొందించడానికి కృషి చేయాలి. ‘‘చర్చల ద్వారా ప్రభుత్వ పాలన సాగించడమే ప్రజాస్వామ్యం’’ అని అన్నారు ప్రఖ్యాత రాజనీతి శాస్త్రజ్ఞుడు స్టూవర్ట్ మిల్. వాడిగా వేడిగా చర్చలు జరిగినపుడు సభలో వాయిదాలు, వాకౌట్లు వంటివి జరగడం సహజమే. ప్రతిపక్ష సభ్యులు కొన్ని సందర్భాలలో నిరసన తెలపడం కూడా ప్రజాస్వామ్యంలో ఓ భాగమే. నిరసనను అధికారికంగా తెలియజేయడం కూడా శాసనసభ కార్యకలాపాల ప్రక్రియలో ఓ భాగం. కానీ, ఆ నిరసన హుందాగా ఉండాలి, తగిన కారణాల వల్ల నిరసన తెలియజేశారనే వాస్తవం ప్రజలు గ్రహించాలి. అది ప్రజలలో ఆలోచన రేకెత్తించేదిగా ఉండాలి.
దురదృష్టవశాత్తూ, దేశంలో కొన్ని రాజకీయ పార్టీల ‘ఎకో సిస్టమ్’ పూర్తిగా మారిపోయింది. కొన్ని రాజకీయ పార్టీలకు వార్ రూమ్‌లు, సోషల్ మీడియా వింగ్‌లు, రాజకీయ వ్యూహకర్తలు పని చేయడం కీలకంగా మారింది. గతంలో మాదిరిగా సిద్ధాంత భావజాలం, ప్రజాస్వామ్య పంథా, సానుకూల వైఖరి మొదలైన విధానాలు కొన్ని పార్టీలకు కాలం చెల్లినవిగా మారిపోయాయి. కులాలు, మతాలు, ప్రాంతీయ సెంటిమెంట్లను వాడుకోవడం, ప్రత్యర్థి రాజకీయ నాయకుల వ్యక్తిత్వహననానికి సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను దుర్వినియోగం చేయడం ఎక్కువైంది. ఒకవిధంగా చెప్పాలంటే– కొన్ని రాజకీయ పార్టీలకు ఇవే పూర్తిస్థాయి రాజకీయ కార్యకలాపాలుగా మారిపోయాయి. ఆ పార్టీలకు ఈ హంగులన్నీ ఎందుకంటే– ఏదో ఒక విధంగా అధికారంలోకి రావడానికే. ఒకప్పుడు పాజిటివ్ ఓట్ ద్వారా అధికారంలో ఉన్న వారు తిరిగి అధికారంలోకి రావాలనుకొనేవారు. కానీ, ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసి అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అందుకోసం సోషల్ మీడియాను పూర్తిగా దుర్వినియోగపరుస్తున్నారు.
అధికారంలోకి వచ్చాక ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు చట్టసభల్ని రాజకీయ వేదికలుగా మార్చేస్తున్నారు. సభలో ఒకర్నొకరు విమర్శించుకునే స్థాయి దాటిపోయి బూతులు తిట్టుకునే దశకు చట్టసభల్ని దిగజార్చారు. ఘోరం ఏమిటంటే– నిష్పక్షపాతంగా ఉండాల్సిన స్పీకర్ సైతం అధికార పార్టీకి కీలుబొమ్మగా మారి– ప్రతిపక్షం గొంతు నొక్కడం; ప్రతిపక్ష నాయకుణ్ణి, ఇతర సభ్యులను అధికార పార్టీ నేతలు వ్యక్తిగతంగా దూషిస్తుంటే, ఏమాత్రం జోక్యం చేసుకోకపోగా, చిద్విలాసంగా నవ్వులు చిందించడం మొదలైన జుగుప్సాకర దృశ్యాలు, వికృత రాజకీయ క్రీడలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2019–-2024 మధ్య యథేచ్ఛగా సాగిపోయాయి. ఆనాడు శాసనసభ ఔన్నత్యాన్ని పాతాళానికి తొక్కేశారు. సభా సంప్రదాయాలను కాలరాశారు. రాజకీయ విలువలకు పాతర వేశారు. స్పీకర్ చిద్విలాసంగా చూస్తుండగా, సభానాయకుడు ముసిముసిగా నవ్వుతుండగా నాటి ప్రధాన ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుణ్ణి కొందరు మంత్రులు, అధికార పార్టీ శాసనసభ్యులు అత్యంత దారుణంగా అవమానించారు. నాటి కౌరవ సభలో ద్రౌపదిని కౌరవ మూకలు పరాభవించినట్లుగానే! అందుకే నాడు చంద్రబాబునాయుడు తనకు జరిగిన అవమానాన్ని దిగమింగుకుంటూ ‘‘ఈ కౌరవ సభలో ఉండలేను, మళ్లీ గౌరవసభ అయిన తర్వాతనే, తిరిగి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ సభలో కాలు పెడతాను’’ అని చెప్పి నిష్క్రమించారు.
అయితే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న సోషల్ మీడియా దుష్ప్రచారం, ప్రతిపక్ష నేతలపై బనాయించిన అక్రమ కేసుల వల్ల ప్రతికూల ఫలితాలే లభించడం ప్రజాస్వామ్యవాదులెవ్వర్నీ ఆశ్చర్యపర్చలేదు. ప్రజాతీర్పుతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఓ సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలలో అనేక అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా, ఐదేళ్లపాటు రాష్ట్రంలో రాజ్యమేలిన బూతు సంస్కృతికి చరమగీతం పాడాలని, చట్టసభల ఔన్నత్యం పెరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కానీ, ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరించడానికి ఏమాత్రం సిద్ధంగా లేకపోవడం ఆశ్చర్యం. ఓటమి తర్వాత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో కించిత్తు మార్పు రాలేదు. ప్రజలు తనను ఎందుకు ఓడించారో జగన్ ఆత్మవిమర్శ చేసుకున్నట్లు కనపడదు. తన పాలనలో తప్పులు జరిగాయని, ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఒప్పుకొనే ఔదార్యం జగన్‌లో ఏ కోశానా లేదు.
పైగా, శాసనసభలో తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జగన్ దురహంకారానికి పరాకాష్ఠ. శాసనసభలో తనకు మైకు ఇవ్వరని తనే ఊహించుకొని అందువల్ల తాను శాసనసభకు వెళ్లడం లేదని చెప్పుకోవడం జగన్‌కే చెల్లింది. పులివెందుల ప్రజలు ఆయనను గెలిపించి శాసనసభకు పంపారు. అంటే, ఐదేళ్ల పాటు జగన్ పులివెందుల నియోజకవర్గ ప్రజలకు శాసనసభలో ప్రతినిధి. జగన్ శాసనసభకు వెళ్లకపోవడం అంటే తనకున్న రాజ్యాంగ బాధ్యతను విస్మరించడమేకాక, తనను ఎన్నుకొన్న పులివెందుల ప్రజలకు అన్యాయం చేసినట్లే అవుతుంది. సభకు వెళ్లనప్పుడు పదవిని అంటిపెట్టుకోవాల్సిన అగత్యం ఏముంది?
కొన్ని ప్రజాస్వామ్య దేశాల్లో సభకు హాజరుకాని ప్రజాప్రతినిధులను దండించే విశిష్టాధికారాలు ఉభయ సభలకు ఉన్నాయి. అమెరికాలోనైతే చట్ట సభ్యులకంటే చట్టసభ ఉన్నతమని అక్కడి రాజ్యాంగం స్పష్టం చేస్తుంది. గైర్హాజరు అయిన సెనేటర్లను అరెస్ట్ చేసి సభలో ప్రవేశపెట్టడానికి అవసరమైన అధికారాన్ని ‘హౌస్’ అధికారులకు అప్పగించిన సంఘటనలు గతంలో జరిగాయి. అయితే, బాధ్యత గలిగిన ప్రజాప్రతినిధులు సభాసమావేశాలకు హాజరు కారని మన దేశ రాజ్యాంగకర్తలు ముందుగా ఊహించలేకపోయారు. చట్టసభలకు హాజరు కాకపోయినా తమకొచ్చే నష్టమేదీ లేదనే భరోసాతో అనేక మంది ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పిఆర్‌ఎస్ అనే సంస్థ వెల్లడించిన వివరాలను చూస్తే– దేశంలో అనేక రాష్ట్రాల అసెంబ్లీల పనిదినాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. మెజారిటీ రాష్ట్రాల శాసనసభలు ఏడాదికి సగటున 19 పని దినాలు మాత్రమే పని చేస్తున్నాయి. పని గంటల విషయం నానాటికీ తీసికట్టుగా ఉంది. అనేక కీలక బిల్లులు ఎటువంటి చర్చ లేకుండానే చట్టాలుగా మారిపోతున్నాయి. పద్దులన్నీ చర్చకు నోచుకోకుండానే, వివిధ పార్టీల అభిప్రాయాలు నమోదు కాకుండానే గిలెటెన్ అవుతున్నాయి. దీనివల్ల చర్చల్లో పాల్గొనాలని ఆరాటపడే ఉత్సాహవంతులైన సభ్యులు నిరాశకు గురవుతున్నారు. శాసనసభా సమావేశాలు మొక్కుబడిగా సాగడంతో సభ్యులు సభలో కాకుండా క్యాంటీన్లలో, లాబీల్లో కాలక్షేపం చేయడం ఎక్కువైంది.
దేశంలోని వివిధ రాష్ట్రాల శాసనసభల పనితీరు ఏవిధంగా ఉన్నప్పటికీ– ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం శాసనసభ, శాసనమండళ్ల పనితీరు మెరుగుపడాలి, మరింత క్రియాశీలంగా మారాలి. రాజ్యాంగం ప్రకారం, సంప్రదాయాల ప్రకారం – ఉభయ సభలు సజావుగా జరగాలి. అవసరమైతే ‘నో వర్క్.. నో పే’ అనే విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలి. కారణాలు లేకుండా సభాకార్యకలాపాలకు దూరంగా ఉంటున్న సభ్యులకు అందించే రాయితీలను ఉపసంహరించాలి. ఇటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రస్తుత స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుకు తగిన సమర్థత, నిబద్ధత ఉన్నాయి. కొన్ని రోజుల వ్యవధి లోనే తన వ్యవహార శైలిని ఆయన చెప్పకనే చెబుతున్నారు. శాసనసభ ఔన్నత్యాన్ని పెంచాలన్న సదుద్దేశం ఆయన మాటల్లో వ్యక్తమవుతోంది. అయితే, ముందుగా చట్టసభల అస్తిత్వాన్ని సవాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పలుచన చేస్తున్న వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి ముకుతాడు వేయాల్సిన గురుతర బాధ్యత స్పీకర్‌పైన, సభానాయకుడిపైన ఉంది. అప్పుడే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పూర్వవైభవం లభిస్తుంది.
సి. రామచంద్రయ్య
శాసనమండలి సభ్యులు