‘పునర్విభజన’ సమ ప్రాతినిధ్యం కల్పించేనా?
ABN , Publish Date - Nov 12 , 2024 | 12:30 AM
వచ్చే ఏడాది జనగణన ప్రక్రియను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పలు అంశాలు తెరపైకి వస్తున్నాయి. అందులో ఒకటి మహిళా రిజర్వేషన్ చట్టం కాగా, రెండోది లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అమలు...
వచ్చే ఏడాది జనగణన ప్రక్రియను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పలు అంశాలు తెరపైకి వస్తున్నాయి. అందులో ఒకటి మహిళా రిజర్వేషన్ చట్టం కాగా, రెండోది లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అమలు. ముఖ్యంగా దక్షిణాది రాష్ర్టాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. సాధారణంగా లోక్‌సభ, శాసనసభల నియోజకవర్గాల సంఖ్య జనాభా ప్రాతిపదికన నిర్ణయిస్తారు. దేశంలో భిన్నత్వాన్ని, ప్రజాస్వామిక స్ఫూర్తిని చాటేలా చట్టసభల్లో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లభించేలా సీట్ల కేటాయింపు ఉంటుంది. దేశ, రాష్ట్ర జనాభాను పరిగణనలోకి తీసుకొని లోక్‌సభ సీట్ల సంఖ్యను నిర్ణయిస్తారు. కొత్తగా లెక్కించే జనాభా ఆధారంగా శాసనసభ, లోక్‌సభ సీట్లు పెరుగుతాయని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. తద్వారా అన్ని ప్రాంతాలు, వర్గాలకు న్యాయబద్ధమైన హక్కుగా తగిన ప్రాతినిధ్యం పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మరి కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలకు మాత్రమే పరిమితమవుతుందా? లేక లోక్‌సభ, శాసనసభల సీట్ల సంఖ్యను కూడా పెంచుతుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ దేశంలో లోక్‌సభ సీట్లను పెంచితే మాత్రం దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోతుంది. అందుకే దేశ ప్రజల దృష్టి 2025లో జరగనున్న జనాభా లెక్కలపై పడింది. ఈ నేపథ్యంలోనే వివిధ వర్గాలు, ప్రాంతాలకు పారదర్శక ప్రాతినిధ్యం లభించే దిశగా రానున్న జనాభా లెక్కలు ఓ మలుపుగా నిలవాల్సిన అవసరమున్నది.
పదేండ్లకోసారి జనగణన చేయడమనేది పాలన, ప్రణాళికలో చాలా ముఖ్యమైన ప్రక్రియ. జనాభా, ప్రజల స్థితిగతులు, అవసరాల ఆధారంగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు, వనరుల పంపిణీకి జనగణన ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నియోజకవర్గాల పునర్విభజనకు కూడా జనాభా లెక్కలే ప్రామాణికంగా నిలుస్తాయి. మన దేశంలో చివరిసారిగా 2011లో జనగణన జరిగింది. మళ్లీ 2021లో జనగణన జరగాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం 2025 మొదటి త్రైమాసికంలో జనగణన ప్రారంభం కానున్నది. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికత, డిజిటల్ గవర్నెన్స్ వల్ల ఏడాదిలోగా ప్రక్రియ సమర్థవంతంగా పూర్తవుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. సకాలంలో జనగణన పూర్తయితే నియోజకవర్గాల పునర్విభజనకు కూడా మార్గం సుగమమవుతుంది.
భారతదేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించేందుకు గాను డీలిమిటేషన్ ప్రక్రియను మొదటిసారిగా తీసుకొచ్చారు. స్వాతంత్య్రానంతరం దేశంలో భిన్న ప్రాంతాల్లో, భిన్న స్థాయిలో జనాభా కలిగి ఉండటం, విభిన్న వర్గాలు ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం కల్పిస్తూ సమతుల్యత పాటించేందుకు వీలుగా ఈ ప్రక్రియను చేపట్టారు. 1951 జనగణన లెక్కల ఆధారంగా మొదటిసారి డీలిమిటేషన్ ప్రక్రియ జరిగింది. దేశంలో ఎన్నికల వ్యవస్థకు స్పష్టమైన రూపం తీసుకొచ్చేందుకుగాను మొదటి విడత కసరత్తు జరిగింది. ఆ తర్వాత 1961 జనగణన లెక్కల ఆధారంగా రెండోసారి డీలిమిటేషన్ ప్రక్రియ జరిగింది. తద్వారా స్వాతంత్య్రానంతరం మొదటి దశాబ్దంలో పెరిగిన జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలకు మరింత కచ్చితమైన రూపం తీసుకొచ్చారు. రెండో విడత నియోజకవర్గాల పునర్విభజన ద్వారా లోక్‌సభ స్థానాలను 494 నుంచి 522కు పెంచారు. అలాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల శాసనసభల స్థానాలను 3,771గా నిర్ణయించారు. ఆ తర్వాత 1971 జనగణన ఆధారంగా 1973లో మూడో విడత నియోజకవర్గాల పునర్విభజన చేపట్టారు. ఈసారి లోక్‌సభ స్థానాలను 522 నుంచి 543కి పెంచి, అసెంబ్లీల స్థానాలను 3771 నుంచి 3,997గా ఖరారు చేశారు. అంతేకాకుండా 2001 వరకు లోక్‌సభ స్థానాలను యథాతథంగా ఉంచాలని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేశారు. మళ్లీ మూడు దశాబ్దాల తర్వాత 2001 జనాభా లెక్కల ఆధారంగా 2002 డీలిమిటేషన్ చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ, లోక్‌సభ స్థానాల సరిహద్దులను మాత్రమే మార్చి, సీట్ల సంఖ్యను మాత్రం యథాతథంగా కొనసాగించారు. అంతేకాదు, 2026 వరకు డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టకూడదని కూడా నిర్ణయించారు. కొత్త రాష్ర్టాలు ఏర్పడినందున అసెంబ్లీ స్థానాలను మాత్రం 4,123కి పెంచారు. అలాగే 1971 జనగణన ఆధారంగా చేపట్టిన పునర్విభజనతో నిర్ణయించిన లోక్‌సభ సీట్ల సంఖ్య 2026 తర్వాత మొదటిసారి జరిగే జనగణన వరకు యథాతథంగా ఉండాలని 84వ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జనాభా నియంత్రణ కార్యక్రమం దక్షిణాది రాష్ర్టాల్లో విజయవంతంగా అమలైంది. అందువల్ల ఉత్తరాదితో పోల్చితే దక్షిణాదిలో జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉన్నది. ఇప్పుడు జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్లు పెంచితే దక్షిణాది రాష్ర్టాల్లో తక్కువ సంఖ్యలో, ఉత్తరాది రాష్ర్టాల్లో ఎక్కువ సంఖ్యలో సీట్లు పెరిగే అవకాశం ఉన్నది. 2026లో జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో ఈ అంశం వివాదాస్పదంగా మారే సూచనలూ కన్పిస్తున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చ జరుగుతున్నది. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన చేస్తే జనాభా నియంత్రణ, ఆర్థికాభివృద్ధిలో చైతన్యం కనబర్చిన రాష్ర్టాలుగా సీట్ల పెంపులో వెనుకబడిపోవడం ద్వారా దక్షిణాది రాష్ర్టాలు మూల్యం చెల్లించుకున్నట్టవుతుందని కొందరు పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే దక్షిణాది రాష్ర్టాలకు చెందిన అనేక మంది రాజకీయ నాయకులు ఈ అంశంపై గళమెత్తుతున్నారు. జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరగకుండా ఉండేందుకు 1973లో జరిగిన పునర్విభజన తరహాలోనే రాష్ర్టాలకు లోక్‌సభ సీట్ల సంఖ్యను కేటాయించాలని వారు వాదిస్తున్నారు. లేకపోతే, జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాదిన సీట్లు భారీగా పెరిగి, లోక్‌సభలో దక్షిణాది రాష్ర్టాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గిపోతుందని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎదురైతే దక్షిణాది రాష్ర్టాలకు ఆర్థిక వనరుల పంపిణీ, సామాజిక అభివృద్ధి, ముఖ్యంగా రాజకీయంగా, పాలనలో అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు విషయంలో జనగణన కీలకం. 2023లో ఈ బిల్లు 106వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టంగా మారింది. సార్వత్రక ఎన్నికల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం జనగణన పూర్తయిన వెంటనే దాన్ని అమల్లోకి తీసుకువస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు చట్టంలో కూడా పొందుపరిచింది. అందుకే, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి రావాలంటే కచ్చితంగా జనగణన జరిగితీరాలి. అప్పుడే మహిళల దశాబ్దాల కల సాకారమవుతుంది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు దక్కుతాయి. అంతేకాదు, నియోజకవర్గాల పునర్విభజన ద్వారా మహిళలకు దక్కాల్సిన సీట్ల సంఖ్య కూడా పెరిగే ఆస్కారమున్నది. మహిళా రిజర్వేషన్ల ద్వారా దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన మహిళలు చట్టసభల్లోకి ప్రవేశించేందుకు ఎదుర్కొంటున్న ఆటంకాలు తొలగిపోతాయి.
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం.. ఏపీ శాసనసభ స్థానాలను 175 నుంచి 225కు, తెలంగాణ అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153కు పెంచాల్సి ఉన్నది. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ విభజన చట్టాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నియోజకవర్గాల పునర్విభజన సమగ్రంగా జరగాలంటే జనాభాతో పాటు అభివృద్ధి సూచికలు, ప్రాంతాల సరిహద్దులను కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. అలాంటి సమగ్ర సమాచారాన్ని విశ్లేషిస్తూ నియోజకవర్గాల పునర్విభజన చేస్తే అన్ని ప్రాంతాలు, వర్గాల అభిప్రాయాలు, భావనలను గౌరవించినట్టు అవుతుంది. ఏండ్ల తరబడి జనాభా వృద్ధిరేటులో స్థిరత్వాన్ని పాటిస్తూ, ఆర్థికాభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు పారదర్శకమైన ప్రాతినిధ్యం లభించే విధంగా 1973లో వివిధ రాష్ర్టాలకు ఏ నిష్పత్తి ప్రకారం సీట్లను కేటాయించారో ఆ విధంగానే ఇప్పుడు కూడా అలాంటి నియమాలు, నిబంధనలను పాటిస్తామనే భరోసా కల్పించాలి. ఒకవేళ లోక్‌సభ సీట్లు పెంచాల్సివచ్చినా అదే నిష్పత్తితో అన్ని రాష్ట్రాలకు సీట్లు కేటాయించాలి. జనగణన పూర్తయిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టాలి. లోక్‌సభ, శాసనసభల సీట్లకు సంబంధించి గ్రామీణ, నగర ప్రాంతాలను దృష్టిలో పెట్టుకోవాలి. సమగ్ర, శాస్త్రీయ దృక్పథంతో నియోజకవర్గాల పునర్విభజన జరిగి, అందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించినప్పుడే భారతదేశ సమాఖ్య, ప్రజాస్వామిక స్ఫూర్తి పరిఢవిల్లుతుంది. రాజ్యాంగంలోని మొదటి అధికరణ నిర్దేశించినట్టు ‘India that is Bharath, shall be a Union of States’ అనే మాటను ప్రతిబింబించే విధంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఉండాలి. అందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలతో సమాలోచనలు జరిపి పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. లేకుంటే ప్రజాస్వామ్యానికి, దేశ సమగ్రతకు తలవంపులు తెచ్చే విధంగా డీలిమిటేషన్ ప్రక్రియ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.
బోయినపల్లి వినోద్‌కుమార్
పార్లమెంట్ మాజీ సభ్యులు