Share News

‘యాప్‌’లతో ఉపాధ్యాయులకు తిప్పలు!

ABN , Publish Date - Jul 25 , 2024 | 05:25 AM

విద్యాశాఖ, పాఠశాలలు, ఉపాధ్యాయులు, బోధన– అనుసంధాన అంశాలు. పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు బోధన మీద ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థుల్లో అభ్యసనా సామర్ధ్యాన్ని పెంపొందించాలి....

‘యాప్‌’లతో ఉపాధ్యాయులకు తిప్పలు!

విద్యాశాఖ, పాఠశాలలు, ఉపాధ్యాయులు, బోధన– అనుసంధాన అంశాలు. పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు బోధన మీద ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థుల్లో అభ్యసనా సామర్ధ్యాన్ని పెంపొందించాలి. ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేయాలని అనేక విద్యా కమిషన్లు కూడా చెప్పాయి. దీంతోనే విద్యార్థుల్లో సాధించాల్సిన సామర్థ్యాలు సులభతరమవుతాయని వారి అభిప్రాయం. కానీ గత ప్రభుత్వం ఉపాధ్యాయులకు బోధన కంటే బోధనేతర యాప్‌ల ద్వారా బాధ్యత పెంచింది. దీంతో విద్యా లక్ష్యాలు అడుగంటిపోయాయి. బోధనేతర కార్యక్రమాల నుంచి మినహాయించాలని అనేకసార్లు ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం మారినా పరిస్థితుల్లో మార్పు లేదన్న ఆవేదనలో ఉపాధ్యాయ వర్గం ఉంది.

బోధనేతర పనులకు అనేక యాప్‌ల గోలే కారణం. పాఠశాల ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆన్‌లైన్ బోధనేతర సేవలకు ఉపాధ్యాయులు అంకితం కావలసి వస్తున్నది. ఉదయం 9:30 లోపలే పాఠశాలల్లోని బాత్‌రూమ్‌లను ఉపాధ్యాయులు పరిశీలించి, శుభ్రత అపరిశుభ్రత మీద ఫోటోలు ఐఎంఎంఎస్ యాప్ ద్వారా అప్‌లోడ్ చేయాలి. అపరిశుభ్రంగా ఉంటే శుభ్రం చేయించాలి. తరువాత వెంటనే తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థుల ఆన్‌లైన్ హాజరును స్కూల్ అటెండెన్స్ యాప్ ద్వారా నమోదు చేయాలి. దీంతోపాటు విద్యార్థులకు సరఫరా చేయాల్సిన గుడ్లు, చిక్కీలు, రాగి జావ వివరాలు కూడా నమోదు చేయాలి. అలాగే విద్యార్థి గైర్హాజరుకు కారణాలు కూడా ఆన్‌లైన్‌లో చెప్పాలి.


దీంతో బోధనకు పది నిమిషాలు మేర ఆటంకం కలుగుతోంది. ఒకవేళ యాప్‌ మొరాయిస్తే ఎంతైనా ఆలస్యం అవుతుంది. ‌మధ్యాహ్నం బెల్లు కొట్టిన వెంటనే భోజన విరామ సమయాన్ని కూడా ఉపాధ్యాయులు స్వీయ అవసరాలకు ఉపయోగించుకోలేకపోతున్నారు. విద్యార్థులకు వడ్డించే తినుబండారాలను ఒక్కొక్కటి ఫోటోలు తీసి, శుభ్రతను పరిశీలించి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. తనిఖీ చేసిన ఉపాధ్యాయుని ఫోటో కూడా అప్‌లోడ్ చేయాలి. దీంతోపాటు ఎంతమంది గుడ్లు, చిక్కీలు తీసుకున్నారనే వివరాలను కూడా నమోదు చేయాలి.

ఈ పనులతో పాటు నాడు–నేడు పనుల బాధ్యతలను ఉపాధ్యాయులకే అంటగట్టారు. నిర్మాణపరమైన నిపుణత లేకపోయినా ఉపాధ్యాయులు వీటిని పర్యవేక్షించి సంబంధిత యాప్‌ల ద్వారా అప్‌లోడ్ చేయించాలి. ఇప్పటికీ కూడా నాడు–నేడు పేరు మార్చి స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటూ కొత్త పేరుతో సదరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యా కానుక పేరుతో విద్యార్థులకు ఇచ్చే కిట్లను సైతం మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై పెట్టారు. ఈ కిట్ల వివరాలను యాప్ ద్వారా ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలి. ఇవన్నీ చేయకపోతే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.

బయోమెట్రిక్ అంటూ స్కూల్ అటెండెన్స్ యాప్ ద్వారా ఉపాధ్యాయుల హాజరు ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. అప్పుడప్పుడు ఇవి మొరాయిస్తే కూడా ఉపాధ్యా యులు ఇబ్బంది పడుతున్నారు. కొత్త ప్రభుత్వమైనా ఈ బాధల నుంచి ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించి, వారిని బోధనకు మాత్రమే పరిమితం చేయాలి.


యాప్‌ల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ అసిస్టెంట్‌ను నియమించాలి. బోధనేతర కార్యక్రమాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను మాతృశాఖకు పంపాలి. నాడు-–నేడు పనుల నాణ్యతకు ఉపాధ్యాయులను బాధ్యులను చేయడం సరి కాదు. మధ్యాహ్నం భోజనం నిర్వహణ గ్రామ సచివాలయాలకు అప్పచెప్పాలి. ప్రతి పాఠశాలకు నాన్ టీచింగ్ స్టాఫ్‌ను నియమించాలి. విద్యా వ్యవస్థను పూర్తిస్థాయిలో సంస్కరించాలి. ఉపాధ్యాయులను నాన్ ఒకేషనల్ డిపార్ట్‌మెంట్‌గా గుర్తించాలి.

సివి ప్రసాద్

రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఏపీటీఎఫ్

Updated Date - Jul 25 , 2024 | 05:25 AM