Share News

ఈ విజన్‌తో ఉజ్వలభవితకు భరోసా!

ABN , Publish Date - Dec 19 , 2024 | 02:47 AM

ఒక కుటుంబ పెద్ద తన ఇంటిని కనిపెడుతూ, ఆ ఇంటిసభ్యుల అవసరాలను తీరుస్తూ, కుటుంబాన్ని ఏ విధంగా నడిపిస్తుంటాడో– అదే విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ను నారా చంద్రబాబు నాయుడు...

ఈ విజన్‌తో ఉజ్వలభవితకు భరోసా!

ఒక కుటుంబ పెద్ద తన ఇంటిని కనిపెడుతూ, ఆ ఇంటిసభ్యుల అవసరాలను తీరుస్తూ, కుటుంబాన్ని ఏ విధంగా నడిపిస్తుంటాడో– అదే విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ను నారా చంద్రబాబు నాయుడు ముందుకు నడిపిస్తున్నారు. ఎన్నో రంగాల్లో దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. అభివృద్ధి పట్ల చంద్రబాబుకు ఉన్న విజన్‌ అనతికాలంలోనే రాష్ట్రాన్ని ప్రగతిపథంలో దూసుకుపోయేలా చేస్తున్నది.

నిత్యం ప్రజల కోసం, భావితరాల కోసం ఓ యోధుడిలా పని చేయడం చంద్రబాబు విధానం. అయిదేళ్ల పదవి కాలంలో ఏమి చేస్తాంలే అన్నట్టు అప్పటి ముఖ్యమంత్రుల విధానాలు ఉండేవి. కానీ చంద్రబాబు మాత్రం 20 ఏళ్ల కాలానికి దర్శనికత చూపారు. 1998లో విజన్ 2020 అంటే అప్పటి ప్రతిపక్ష నాయకులు హేళన చేశారు. కానీ దాని ఫలితాలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలూ అనుభవిస్తున్నారు. దేశంలో విజన్ కార్యక్రమాలకు నాంది పలికింది చంద్రబాబు. జగన్ అయిదేళ్లపాటు అరాచకాలతో, అక్రమాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తే, గాడి తప్పిన రాష్ట్రానికి ఊపిరి పోయడానికి సీఎం చంద్రబాబు విజన్‌ -2047ని తీసుకొచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలో దళితులు, వెనకబడిన కులాలకు ఉపయోగపడే విధంగా విజన్ 2047ను రూపొందించారు. దీని ముఖ్య ఉద్దేశం పేదరికాన్ని నిర్మూలించి అభివృద్ధిపథంలో నడపడం. 2047 నాటికి రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందరూ పేదరికం నుంచి భయటపడి సంపన్నులు కావాలనేది విజన్ 2047లోని మొదటి అంశం. -ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంతో అట్టడుగు వర్గాల వారిని ఆర్థికంగా బలోపేతం చేయటం దీని ఉద్దేశం. ప్రతి కుటుంబంలోనూ ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న దానికి అనుగుణంగా కార్యాచరణ త్వరలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో ప్రస్తుతం కుటుంబం తలసరి ఆదాయం రూ.2.70 లక్షలు ఉంటే 2047 నాటికి రూ.36 లక్షలకు పెరుగుతుంది.


రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు తక్కువయ్యాయి. జగన్ అయిదేళ్ల పాలనలో ఉద్యోగా లిస్తామని నమ్మబలికి విద్యార్థులను మోసం చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వం ప్రతి విద్యార్థికీ ఉద్యోగం కల్పించాలని సంకల్పించింది. దాని కోసం ప్రత్యేక స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. 2014లో టీడీపీ హయాంలో హెచ్‌సీఎల్‌, గన్నవరం ఐటీ పార్కులో ఉద్యోగాలు కల్పించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత టీసీఎస్‌, గూగుల్‌ వంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను నిరుద్యోగులు లేని రాష్ట్రంగా తీర్చద్దిదాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు.

విజన్ 2020లో భాగంగా గోదావరి, కృష్ణా నదులు అనుసంధానం చేసి వేలాది ఎకరాలకు నీరు అందిస్తున్నారు. ఇప్పుడు ఈ విజన్ 2047తో త్వరలో రాయలసీమ వరకు నదులు అనుసంధానం చేసి నీటి కొరతను తీర్చడాన్ని ధ్యేయంగా పెట్టుకున్నారు. ఇప్పటికీ మన రాష్ట్రంలో నీరు అందని గ్రామాలు చాలా ఉన్నాయి. 2047 నాటికి ప్రతి గ్రామానికీ నీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. విజన్ 2020లో డ్రిప్‌ పద్ధతిని పరిచయం చేసినప్పుడు అందరూ ఏంటో అనుకున్నారు. ఇప్పుడు ఆ డ్రిప్ పద్ధతి లేనిదే ప్రధాన పంటలు సాగు కావడం లేదు. విజన్‌ 2047లో కూడా అలాంటి అధునాతన సాంకేతికత పద్ధతులను రైతులకు పరిచయం చేసి లాభసాటిగా మార్చాలని నిర్ణయించారు. పంటకోత అనంతరం నష్టాలు తగ్గించేందుకు ఏఐ, ఐఓటీ, రోబోటిక్స్, డ్రోన్ల వినియోగం పెరగాలని విజన్ 2047 సూచించింది. చిన్న రైతులకు డిజిటల్ సేవలు, మైక్రో క్రెడిట్ సౌకర్యాలు, పంటల బీమా, రియల్ టైమ్ రాయితీలను అందించనున్నారు. దీంతో రైతు లాభదాయకంగా మారడానికి అవకాశాలు ఉంటాయి. రానున్న కాలంలో దేశ రవాణా మొత్తం లాజిస్టిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ రంగంలో యువతకు ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.


పారిశ్రామిక రంగంలో చంద్రబాబు వాగ్దానాలను ఒక్కొక్కటే నెరవేరుస్తూ వస్తున్నారు. పరిశ్రమల స్థాపనలో పాలనాపరమైన అడ్డంకులను అధిగమించి కేవలం 15 రోజుల్లో కొత్త పరిశ్రమలకు అనుమతులు లభించేలా చట్టాన్ని తెచ్చారు. ఈ విషయంలో దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచారు. ప్రస్తుత దేశ జీడీపీలో 14 శాతం రవాణాకే ఖర్చవుతున్నది. దీనిని తగ్గించి, రహదారులు నిర్మించి, జలరవాణాను ఉపయోగించుకొని, తద్వారా రవాణ వ్యయం తగ్గించి ప్రపంచస్థాయి లాజిస్టిక్స్‌లో ఏపీకి ప్రత్యేక స్థానాన్ని కల్పించనున్నారు. విజన్ 2020 ప్రవేశపెట్టక ముందు రాష్ట్రంలో కరెంట్ కష్టాలు ఎక్కువగా ఉండేవి. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఏపీలో 5 వేల మెగావాట్లు విద్యుత్తు ఉత్పత్తి అయితే చంద్రబాబు 2004 పదవి అయిపోయే నాటికి 10వేల మెగావాట్లు విద్యుత్తును ఉత్పత్తి చేశారు. దీంతో రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వగలిగారు. ప్రస్తుత విద్యుత్తు కొనుగోలు ధర యూనిట్‌కు రూ.5.19 ఉండగా, ఈ ఏడాది దానిని రూ. 4.80 తగ్గించారు. రానున్న కాలంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా రాష్ట్రాన్ని నిలిపేందుకు కృషి చేస్తారు. దానికి కావలసిన ఇంధన వనరులు అన్నీ ఉపయోగిస్తారు.


ఒకప్పుడు మన గురించిన సమాచారం నాలుగైదు రకాల పత్రాలలో ఉండేది. కానీ ఇప్పుడు ఒకే క్లిక్‌తో మన సమాచారం మొత్తం అందుబాటులోకి వచ్చేలా రూపకల్పన చేస్తున్నారు. మన భవిష్యత్తుకు డేటా చాలా అవసరం. వివిధ రకాలు సేవలను ఇందులో అనుసంధానం చేయనున్నారు. విజన్ 2020 ద్వారా విద్యా విప్లవం వచ్చింది. ప్రతి కిలోమీటరుకూ ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్లకొక ఉన్నత పాఠశాల, గ్రామానికి ఒక జడ్పీ పాఠశాల, మండలానికి ఒక జూనియర్ కళాశాల, జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ, వందలాది ఇంజినీరింగ్ కాలేజీలు చంద్రబాబు ప్రవేశపెట్టారు. ఇప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు ఏపీకి వస్తున్నాయి. విశాఖ, తిరుపతి, అమరావతిల్లో నాలెడ్జ్ హబ్‌లు ఏర్పాటు చేస్తారు. నైపుణ్యం శిక్షణ అందిస్తారు. ఇవి విజన్ 2047 ముఖ్య ఉద్దేశాలు. ఇవి సాకారం అయితే మన రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగి, ఒక పారిశ్రామికవేత్త ఉంటారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్థానంలో స్వర్ణాంధ్ర–2047 విజన్ కొత్త చరిత్రకు నాంది పలుకుతుంది. రాష్ట్ర దశ దిశ మార్చే స్వర్ణాంధ్ర – 2047 విజన్ తెలుగు జాతిని నెంబర్ వన్‌గా చేసే క్రమంలో పెను మార్పులు తీసుకురాబోతున్నది.

ఏలూరి సాంబశివరావు

పర్చూరు శాసనసభ్యులు

Updated Date - Dec 19 , 2024 | 02:47 AM