Share News

కార్మికుల పెన్షన్‌ కార్పొరేట్ల పరం!

ABN , Publish Date - Dec 03 , 2024 | 06:13 AM

ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమలో పనిచేసి నెలకు ఏభై వేల రూపాయలకు పైగా జీతం పొందిన ఒక కార్మికుడు పదవీ విరమణ తర్వాత కేవలం రెండువేల రూపాయల లోపు మాత్రమే పెన్షన్‌ పొందడం...

కార్మికుల పెన్షన్‌ కార్పొరేట్ల పరం!

ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమలో పనిచేసి నెలకు ఏభై వేల రూపాయలకు పైగా జీతం పొందిన ఒక కార్మికుడు పదవీ విరమణ తర్వాత కేవలం రెండువేల రూపాయల లోపు మాత్రమే పెన్షన్‌ పొందడం నమ్మశక్యం కాని విషయం. కానీ ఇది వాస్తవం. ఇపిఎస్‌–95 పేరుతో దేశంలో ప్రవేశపెట్టిన పెన్షన్‌ పథకం కార్మికుల పొదుపు సొమ్మును హరించి కార్పొరేట్లకు ధారాదత్తం చేసే విధాన ఫలితం.

మన దేశంలో కార్మికులకు ఉన్న హక్కులను ఒకటొకటిగా హరిస్తున్న వేళ విచిత్రంగా కేంద్ర ప్రభుత్వం కార్మికులు కోరకుండానే వారికి ఒక పెన్షన్‌ పథకాన్ని చాలా ఉదారంగా ప్రవేశపెట్టింది. కార్మికులు వద్దన్నా వినలేదు. కనీసం ఇందులో చేరాలా వద్దా అనే ఆప్షన్‌ ఇమ్మన్నా ఇవ్వలేదు. కార్మికులపై ఎందుకింత ప్రేమ అని కొద్దిగా పరిశీలిస్తే 1991 నుంచి దేశంలో అమలవుతున్న నయా ఉదారవాద విధానాలలో భాగమే ఈ పెన్షన్‌ పథకం అని సులువుగానే అర్థమవుతుంది.

1995లో నాటి పివి నరసింహారావు ప్రభుత్వం అప్పటివరకు అమలులో ఉన్న ఉద్యోగుల భవిష్య నిధి (పిఎఫ్‌) చట్టం 1952ను సవరించి, ఉద్యోగుల పెన్షన్‌ స్కీమ్‌ ఇపిఎస్‌–95 పేరున ఒక కొత్త చట్టాన్ని చేసింది. ఈ పెన్షన్‌ చట్టం ప్రకారం అప్పటివరకు కార్మికుల భవిష్యనిధిలో ఉన్న యాజమాన్యం వాటా భాగం 8.33శాతం, ప్రభుత్వ వాటా 1.16 శాతం ఈ పెన్షన్‌ నిధికి మళ్ళించబడుతుంది. ఈ నిధి నుండి ప్రతినెల పిఎఫ్‌ డిపార్టుమెంట్‌ పెన్షన్లు చెల్లిస్తుంది.


ఈ పథకం వల్ల కార్మికులకు వచ్చే సంక్షేమం కంటే కార్మికులు పొదుపు సొమ్మును కోల్పోవడమే అధికంగా ఉంటుందని ఆనాడే కొన్ని కార్మిక సంఘాలు ముఖ్యంగా సిఐటియు వంటి కేంద్ర సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. కొన్ని యూనియన్లు దీనిపై దేశంలోని వివిధ రాష్ట్ర హైకోర్టులలో కేసులు కూడా వేశాయి. ఈ కేసులపై కొన్ని హైకోర్టులు ఈ పథకం అమలుపై స్టే ఉత్తర్వులు కూడా ఇచ్చాయి. ఈ కేసులన్నీ చివరకు సుప్రీంకోర్టుకు చేరాయి. దీనిని తరచూ సమీక్షిస్తూ ఉంటామని, పథకాన్ని మరింత పటిష్టపరుస్తామనే అనేక హామీలు ప్రభుత్వం ఇవ్వడంతో సుప్రీంకోర్టు ఈ పథకం అమలుకు అనుమతించింది. ఈ విధంగా కార్మికుల ఆమోదం లేకపోయినా, వివిధ యూనియన్లు ప్రతిఘటించినా ఈ పథకం 1995 నుండి అమలులోకి వచ్చింది.

ఈ పెన్షన్‌ పథకం ప్రత్యేకత ఏమిటంటే దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఎల్‌ఐసి, బ్యాంకు ఉద్యోగులకు, ఇతర సంస్థలలో ఉన్న పెన్షన్‌ పథకాలలోని ఒక్క అనుకూల అంశం కూడా ఇందులో లేకపోవడమే. వీటికి భిన్నంగా ప్రతికూలంగా ఉండే అనేక అంశాలు ఈ పథకంలో ఉన్నాయి.


ఉదాహరణకు మిగిలిన అన్ని పెన్షన్‌ పథకాలలో పెరిగిన ధరలకు అనుగుణంగా కరువు భత్యం ఉండగా ఈ పథకంలో అది లేదు. అన్ని పెన్షన్‌ పథకాల్లోనూ పదవీ విరమణ సమయంలో పెన్షన్‌లోని కొంత మొత్తాన్ని కమ్యూట్‌ చేసుకుని, ఒకేసారి పెద్ద మొత్తాన్ని తీసుకునే అవకాశం ఉండగా, ఈ పెన్షన్‌ పథకంలో మాత్రం ఆ సదుపాయం లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆఖరి నెల జీతం ఆధారంగా పెన్షన్‌ లెక్కిస్తే, ఈ పథకంలో మాత్రం కార్మికుని ఆఖరి అరవై నెలల జీతం సగటు తీసుకుని దాని ఆధారంగా పెన్షన్‌ లెక్కిస్తారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 20 సంవత్సరాల సర్వీసు పూర్తయితే పూర్తి పెన్షన్‌ పొందడానికి అర్హత రాగా, ఇక్కడ మాత్రం 33 సంవత్సరాల సర్వీసుకు గాని ఆ అర్హత రాదు. ఇలాంటి అనేక లోపాల వల్ల పెన్షన్‌ చాలా తక్కువగా ఉంటోంది.

పెన్షన్‌ పొందే జీతం పరిమితిని కూడా మొదట రూ.6,500గా నిర్ణయించారు. తరువాత దానిని రూ.15,000కు పెంచారు. పూర్తి జీతంపై హయ్యర్‌ పెన్షన్‌ అనుమతించాలని, సుప్రీంకోర్టు 2022 నవంబరులో తీర్పు ఇచ్చి రెండేళ్లు గడిచినా నేటికీ అమలు కాలేదు సరికదా ఈ పేరున పదిహేడున్నర లక్షల మంది పెన్షనర్ల నుండి రూ.1,86,920 కోట్లు వసూలు చేసి, ఆ సొమ్మును ప్రభుత్వం తొక్కిపెట్టింది. ఇది పచ్చి దగా.


విచిత్రమేమిటంటే అనేక మందికి 100, 150, 200 రూపాయలు పెన్షన్‌ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో చివరకు ప్రభుత్వం కనీస పెన్షన్‌ను వెయ్యి రూపాయలకు 2017లో పెంచింది. దీనివల్ల 36.4 లక్షల మంది లాభపడ్డారని ఘనంగా ప్రకటించుకుంది. కానీ దీన్ని బట్టే తెలుస్తున్నదేమిటంటే అంత మందికి అప్పటి వరకు వెయ్యి రూపాయల లోపే పెన్షన్‌ ఉందని. దీనికి ప్రభుత్వం సిగ్గు పడవలసింది పోయి, తిరిగి గొప్పలు చెప్పుకోవడం విడ్డూరమే. ఇప్పటికీ వెయ్యి రూపాయల లోపు పెన్షన్‌ వస్తున్నవారు కూడా ఉన్నారు. అత్యధికమందికి వచ్చే పెన్షన్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్‌ కంటే కూడా తక్కువగా ఉంటోంది.

2024లో ఈ పథకం ద్వారా 78.5 లక్షల మందికి పెన్షన్‌ చెల్లించారు. ఇందులో 46.6 శాతం మందికి వెయ్యి, అంతకంటే తక్కువ; 85 శాతం మందికి రూ.2,500 లోపు మాత్రమే పెన్షన్‌ వస్తోందని వీరి గణాంకాలు తెలుపుతున్నాయి. ఐదు వేల రూపాయలకు పైగా పెన్షన్‌ పొందుతున్నవారు కేవలం 29,608 మంది; అంటే మొత్తం పెన్షన్‌ దారులలో కేవలం 0.37శాతం మంది. సగటు పెన్షన్‌ కేవలం రూ.1578 మాత్రమే. ఫలితంగా అనేకమంది పెన్షనర్లు కడు పేదరికంలో మగ్గుతున్నారు.


అందువల్లే దీని కార్పస్‌ ఫండ్‌ 2018లో 4లక్షల 37వేల కోట్ల రూపాయల నుంచి 2024 నాటికి 8లక్షల 88వేల కోట్లకు అంటే ఆరేళ్ల కాలంలో ఏకంగా రెట్టింపుకు పైగా పెరిగింది. ఈ సొమ్మును ప్రభుత్వం మిగిలిన పిఎఫ్‌ నిధులతో పాటు, వివిధ సంస్థలలో పెట్టుబడులుగా పెడుతోంది. ఇలా కార్మికుల పొదుపు కార్పొరేట్ల పాలవుతోంది. కార్మికుల ఖాతా నుంచి ఈ పెన్షన్‌ నిధికి మళ్లిస్తున్న సొమ్ము ఎంత, దానిపై వచ్చే వడ్డీ ఎంత, కార్మికునికి పదవీ విరమణ తర్వాత ప్రభుత్వం చెల్లిస్తున్న పెన్షన్‌ ఎంత, అనే ఈ మూడు అంశాలను పరిశీలిస్తే చాలా ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.

ఇప్పుడు ఈ పెన్షన్‌ పొందే జీతం యొక్క గరిష్ఠ పరిమితి రూ.15వేలుగా ఉంది. అంటే కార్మికునికి రూ.15వేల జీతం నుండి ప్రతినెల 8.33శాతం చొప్పున పెన్షన్‌ ఫండ్‌కు అయ్యే జమ, ప్రభుత్వ వాటా 1.16శాతం కలిస్తే, ప్రతి నెల రూ.1420 చొప్పున 25 ఏళ్ల సర్వీసులో మొత్తం రూ.4,26,000. దీనిపై ప్రస్తుతం పిఎఫ్‌పై ఉన్న వడ్డీ రేటు 8.25 శాతం ఆధారంగా 25 ఏళ్ల చివరకు వచ్చే వడ్డీ రూ.10,25,725. అంటే– అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.14,51,725 అవుతుంది. దీనిపై ఇప్పుడు సీనియర్‌ సిటిజన్లకు బ్యాంకులలో ఉన్న వడ్డీ రేటు 8.4 శాతం రేటు చొప్పున నెలకు రూ.10,162 వడ్డీ వస్తుంది. కానీ నేడు ఇదే కార్మికుడికి ఈ పథకం ద్వారా వచ్చే గరిష్ఠ పెన్షన్‌ నెలకు కేవలం రూ.5,785 మాత్రమే. దీనర్థం ఏమిటంటే కార్మికుని పొదుపు సొమ్ముపై వచ్చే వడ్డీ కంటే కూడా తక్కువగా పెన్షన్‌ ఉంది. మరి అసలు పొదుపు సొమ్ము అంతా స్వాహా అవడం కాదా ఇది. దీనితో పాటు నాడు సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీలు కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదు. సరికదా నాడున్న సౌకర్యాలనే కొన్నిటిని ఎత్తివేశారు. అందువల్ల దీన్ని కార్మికుల సంక్షేమం అనడం కంటే, కార్పొరేట్ల సంక్షేమ పథకం అనడం సబబుగా ఉంటుంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ పెద్దలు దీనిని సవరిస్తామని హామీ అయితే ఇచ్చారు కానీ, మూడోసారి అధికారం లోనికి వచ్చినా, ఇంకా నేటికీ కార్యరూపం దాల్చలేదు.


ప్రభుత్వం కార్మికులకు ఉచితంగా దయాధర్మంగా ఏమీ పెన్షన్‌ ఇవ్వనవసరం లేదు. కార్మికుల పొదుపు సొమ్ము అయిన పెన్షన్‌ నిధి నుండే, అది కూడా దానిపై వచ్చే వడ్డీ నుండే వివిధ కార్మిక, పెన్షనర్ల సంఘాలు కోరుతున్నట్లుగా కనీస పెన్షన్‌ తొమ్మిది వేల రూపాయలకు పెంచడం, కరువు భత్యం చెల్లించడం, కమ్యూట్‌ చేసుకునే అవకాశం, ఐదేళ్లకు ఒకసారి పెన్షన్‌ సవరించడం వంటివి నిక్షేపంగా చేయవచ్చు. అయితే దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టే నయా ఉదారవాద విధానాలను మరింత స్పీడుగా అమలు చేస్తున్న మోదీ ప్రభుత్వం అలా చేస్తుందా అన్నదే అసలు ప్రశ్న. దేశానికి అనేక విధాలుగా సేవలందించిన, ఈ సీనియర్‌ సిటిజన్ల పొదుపును దోచుకోవడమే కాక, వారి న్యాయమైన డిమాండ్లను సైతం నిర్లక్ష్యం చేయడం క్షంతవ్యం కాదు. ఈ పని చేయకుండా సీనియర్‌ సిటిజన్లకు ఏదో చేసేశామని గొప్పలు చెప్పుకోవడం సభ్యత అంతకంటే కాదు.

-ఎ. అజ శర్మ

ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక

Updated Date - Dec 03 , 2024 | 06:13 AM