ఇదేనా రాజ్యాంగ నిబద్ధత?
ABN , Publish Date - Dec 13 , 2024 | 05:25 AM
భారత రాజ్యాంగం నవంబర్ 26, 1949లో రాజ్యాంగ సభలో ఆమోదించబడి 26 జనవరి 1950 నుండి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ రూపకల్పన పూర్వాపరాలు అప్పటి నేపథ్యం సమీక్ష చేసుకోవడంలో అలసత్వంగా...
భారత రాజ్యాంగం నవంబర్ 26, 1949లో రాజ్యాంగ సభలో ఆమోదించబడి 26 జనవరి 1950 నుండి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ రూపకల్పన పూర్వాపరాలు అప్పటి నేపథ్యం సమీక్ష చేసుకోవడంలో అలసత్వంగా సాగుతున్నది. డాక్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ సభ ఏర్పాటైనప్పటికీ, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్‌గా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ చొరవ, పరిశీలనతో వాస్తవ సామాజిక ఆర్థిక స్థితిగతులు దృష్టిలో పెట్టుకొని విశాల భారతదేశానికి తలమానికం లాంటి రాజ్యాంగం రూపొందించబడింది. ప్రధానంగా ప్రవేశ పీఠికలో పేర్కొన్న రాజ్యాంగానికి దిశ నిర్దేశించే అంశాలు ఇప్పటికీ ఎప్పటికీ శాశ్వతంగా ఉండేవే, అలాగే 121–అధికరణపై ఎలాంటి రాజీ ఉండదు. నేటి మోదీ ప్రభుత్వం ప్రజలపైన కపట ప్రేమ చూపిస్తూ హిందుత్వ ఎజెండాను అమలు చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే అసలు సమస్య. విభిన్న కులాలు, మతాలు భాషలు భావాలు ప్రాంతాలు ఉన్న దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనేది శాశ్వత పరిష్కారం. కానీ మోదీ ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తూ రాజ్యాంగ మార్పునకు తిరగదోడ ప్రయత్నిస్తున్నది. ఉమ్మడి పౌరస్మృతి, జమ్మూ కశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు లాంటి అంశాలు సజీవంగా చర్చనీయాంశంగా ఉంటాయి. ఈ మధ్య జరిగిన కశ్మీర్ ఎన్నికలలో గెలిచిన ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలలో 370 ఆర్టికల్ పునరుద్ధరించాలంటు నొక్కి వొక్కాణించింది. పౌర హక్కులకు విఘాతం కలిగిస్తూ రాజ ద్రోహం కేసులు, కుట్ర కేసులు లాంటివి పెడుతూ ప్రశ్నించే గొంతుకులను నొక్కడం లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పావులు కదుపుతుంది.
కేంద్ర ప్రభుత్వ పాత్ర, బాధ్యతలను రాజ్యాంగం నిర్ధారించింది. ఫెడరల్ వ్యవస్థగా రూపొందించబడింది. అందుకే సర్కారియా కమిషన్ కేంద్ర రాష్ట్ర సంబంధాలపై చక్కటి రిపోర్టును అందించింది. దానిని అమలు చేయడానికి అంగీకరించడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల ద్వారా ప్రజల కొరకు ఏర్పడేది ప్రజా ప్రభుత్వం. దానికి భిన్నంగా ఎన్నికల కమిషన్ పైన కూడా పెత్తనం లేదా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించడం అంటే ప్రజాస్వామ్య మూల సూత్రాలను పాతరేయడమే. ఎన్నికల కమిషన్ నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పక్కన పెట్టడం అంటే ప్రజాస్వామ్యం ఎంత వరకు అమలవుతుందో విదితమవుతుంది. సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషన్ నియామకం అంశం ప్రస్తావనకు రావడం ప్రధాన న్యాయమూర్తి ఆ పదవి నుండి వైదొలిగారు. కేంద్ర ప్రభుత్వ దుర్బుద్ధికి నిదర్శనం.
పార్టీ ఫిరాయింపుల చట్టం ఉన్నప్పటికీ ఎందుకు ఫిరాయింపులు కొనసాగుతున్నాయి అంటే నాగుపాముకు కోరలు లేకపోతే ఎవరూ భయపడరు. ఫిరాయింపుల చట్టం కోరలు స్వార్థ బుద్ధితో తీసివేయబడినాయి. అందుకే ఎవరికి భయం లేదు. పాలనాదక్షత గురించి మాట్లాడే మోదీ ఎందుకు ఫిరాయింపుల చట్టంలోని లొసుగులను తొలగించడం లేదు? ఏ పార్టీ గుర్తుతో గెలిస్తే ఆ పార్టీలోనే కొనసాగాలి, లేదా ఆ పదవికి రాజీనామా చేయాలి. అలా జరగకపోవడంతో ప్రజలలో రాజకీయ పార్టీల నాయకుల పట్ల చులకన భావం నెలకొంటున్నది. ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా భారత్ ఎదగాలని కలలు కనడం మంచిదే కానీ ప్రపంచ దేశాలలో అదానీ మూలంగా దేశ పరువు ప్రతిష్ట దెబ్బతింటున్నదన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అదాని, అంబానీ, నీరవ్ మోదీ, లలిత్ మోదీ ఆర్థిక మోసాలు అంతా ఇంతా కాదు. బ్యాంకులలో అప్పులు ఎగవేత, సహజ వనరులను కొల్లగొట్టడం లాంటి అనేక అవినీతి కుంభకోణాలకు కారణమైన వారిపైన చర్యలు ఉండవా?
ప్రధాని ఏ దేశం పర్యటించిన దాదాపు అన్ని దేశాల్లో అదాని పెట్టుబడులు పెడుతున్నారు. ఆస్ట్రేలియాలో బొగ్గు గనుల ఏర్పాటుకు మన ఎస్‌బీఐ నుండి అదానికి రుణాలు ఇప్పించారు. అలాగే శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో పవర్ ప్రాజెక్టులు, పోర్టులు ఆ సంస్థ దక్కించుకుంది. ఇదంతా కూడా ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు లేనిదే సాధ్యం కాదని ఎవరికైనా అర్థమవుతుంది. ఏది ఏమైనా ప్రపంచానికి తలమాణికం లాంటి రాజ్యాంగ అమలులో కేంద్ర ప్రభుత్వం వివక్ష కనబరుస్తూ, స్వపక్షం, ప్రతిపక్షం అనే భేదాలకు తావిస్తుంది. నిష్పాక్షిక నిబద్ధతతో కూడిన పాలనను ప్రజలు కోరుకుంటున్నారు. కులమత ప్రాంత లింగ విభేదాలకు తావులేని పారదర్శకతతో కూడిన ప్రజాస్వామ్య పరిరక్షణకై ప్రతి పౌరుడు దీక్షబూనాలి. రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి మేధావులు, బుద్ధిజీవులు, యువకులు, విద్యార్థులు పూనుకోవాలి. దేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతిజ్ఞ తీసుకోవాలి.
చాడ వెంకటరెడ్డి
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు