JEE Main 2025: జేఈఈ మెయిన్ పరీక్షల్లో కీలక మార్పులు.. ఆ సెక్షన్లో ఛాయిస్‌ల ఎత్తివేత
ABN , Publish Date - Oct 18 , 2024 | 04:04 PM
జేఈఈ మెయిన్స్(JEE Main 2025) పరీక్షల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గత మూడేళ్ల నుంచి సెక్షన్ బి లో కొనసాగుతున్న ఛాయిస్‌ను ఎన్టీఏ ఎత్తేసింది.
ఇంటర్నెట్ డెస్క్: జేఈఈ మెయిన్స్(JEE Main 2025) పరీక్షల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గత మూడేళ్ల నుంచి సెక్షన్ బి లో కొనసాగుతున్న ఛాయిస్‌ను ఎన్టీఏ ఎత్తేసింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అక్టోబర్ 17 నోటిఫికేషన్ విడుదల చేసింది. జేఈఈ మెయిన్ ర్యాంకుల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 32 ఎన్‌ఐటీల్లో బీటెక్ సీట్లు భర్తీ చేస్తారు. జేఈఈ మెయిన్‌లో 75 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు ప్రశ్నపత్రం ఇచ్చేవారు. గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం నుంచి 25 చొప్పున ప్రశ్నలు ఉండేవి.
కొవిడ్‌తో స్వల్ప వెసులుబాటు..
కరోనా నేపథ్యంలో విద్యార్థులకు వెసులుబాటు కల్పించే క్రమంలో ప్రతి సబ్జెక్టులో ఛాయిస్ ప్రశ్నలు ఇచ్చారు. జేఈఈ మెయిన్ 2021 నుంచి ఒక్కో సబ్జెక్టులో 30 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఇస్తూ వచ్చారు. ప్రతి సబ్జెక్టులో ఎ, బి సెక్షన్లు ఉండేవి. సెక్షన్ ఎ లో 20 ప్రశ్నలకు మొత్తం జవాబులు రాయాలి. సెక్షన్ బి లో 10 ప్రశ్నలకు అయిదింటికి సమాధానాలు గుర్తించేలా ఛాయిస్ ఇచ్చేవారు. ఇక రాబోయే రోజుల్లో ఆ ఛాయిస్‌ను తీసివేస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది.
జేఈఈ మెయిన్ 2024 పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించడానికి.. మెయిన్‌లో సాధించిన ఉత్తీర్ణతనే పరిగణనలోకి తీసుకుంటారు. మెయిన్ పేపర్ 1 ఉత్తీర్ణత ఆధారంగా నిట్, ట్రిపుల్ ఐటీ, ఇతర కేంద్ర విద్యా సంస్థల్లో బీఈ లేదా బీటెక్ కోర్సుల్లో అడ్మిషన్ లభిస్తుంది. మెయిన్ నోటిఫికేషన్ తో పాటు పరీక్ష సిలబస్ ను కూడా ఎన్టీఏ ప్రకటిస్తుంది. సిలబస్‌లో మార్పులు ఏమైనా ఉంటే తెలియజేస్తుంది. జేఈఈ మెయిన్ పరీక్షలో మొదటి రోజు బీఆర్క్, బీ ప్లానింగ్‌లో ప్రవేశించేందుకు పేపర్-2, మిగిలిన రోజుల్లో బీటెక్ సీట్ల భర్తీకి పేపర్-1 పరీక్ష జరుపుతారు. పేపర్-1 పరీక్ష 300, పేపర్-2 పరీక్ష 400 మార్కులకు ఉంటుంది. ఈ ఏడాది తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ సహా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు.
జేఈఈ మెయిన్ అధికారిక వెబ్సైట్ ను తరచూ చెక్ చేస్తూ ఉండాలని సరైన సమయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎన్టీఏ తెలిపింది.
దరఖాస్తులు ఎప్పుడంటే..
జేఈఈ మెయిన్(2025-26) పరీక్ష షెడ్యూల్‌ను నవంబర్‌లో ప్రకటించే అవకాశం ఉందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. గతంలోలానే జనవరి 24 నుంచే పరీక్షలు ప్రారంభం కావచ్చని తెలుస్తోంది.