Share News

రానున్నది కథల ఋతువు!

ABN , Publish Date - Nov 18 , 2024 | 05:55 AM

ప్రేమ గొప్పదని చిన్నప్పటి నుంచీ చదువుతూ వింటూ పెరిగి, తీరా ఇదే సమాజంలో కులాంతర వివాహాలు చెల్లకపోవడం, పరువుహత్యల పేరుతో వేలమంది దళిత యువకులు హేయమైన రీతుల్లో చంపబడుతున్నా పెద్దగా మార్పు రాకపోవడం...

రానున్నది  కథల ఋతువు!

దళిత ప్రేమ కథలు

42-Vi.jpg

సంపాదకత్వం: మానస ఎండ్లూరి, అరుణ గోగులమండ

ప్రేమ గొప్పదని చిన్నప్పటి నుంచీ చదువుతూ వింటూ పెరిగి, తీరా ఇదే సమాజంలో కులాంతర వివాహాలు చెల్లకపోవడం, పరువుహత్యల పేరుతో వేలమంది దళిత యువకులు హేయమైన రీతుల్లో చంపబడుతున్నా పెద్దగా మార్పు రాకపోవడం... ఇలా ఎన్నో నిర్ఘాంతపరిచే సంఘటనలను, మారని వ్యవస్థలను చూస్తూ– మేము ఈ దళిత ప్రేమకథల సంకలనానికి నడుం బిగించాం.

ఎక్కువగా ఆధిపత్య కులాల నుంచి, శరీరపు రంగులు చూసి, కలుపుకునే సంబంధాలకు ప్రేమ అనే పేరు పెట్టి అందంగా రాసిన రచనలనే విరివిగా అందరం చదివాం. ప్రేమల పేరిట వధించబడ్డ, అణచివేయబడ్డ అంటరాని కులాల యువత గురించీ, సమాజాన్ని ఎదిరించి కులాంతర వివాహాలు చేసుకొని ఇంటా బైటా నెగ్గుకు రాగలిగిన జంటల గురించీ, దళితులు ఇతర కులాలవారిని ప్రేమించి చేసుకున్న తర్వాత ఆ పెళ్ళిలో ఏ మాత్రం ప్రేమ మిగిలింది అన్న ప్రశ్నల గురించీ, క్యాస్ట్ అండ్‌ జెండర్ కోణాల గురించీ... పరిష్కారం దిశగా కాకపోయినా ఓ ముఖ్యమైన చర్చ జరగాలని ఈ దళిత ప్రేమకథల అంశాన్ని ఎంపిక చేశాం. ఎక్కువగా వర్ధమాన రచయితలు ఈ సంకలనానికి కథలు ఇవ్వడం సంతోషంగా ఉంది. ఈ ప్రేమ కథలలో ఇతివృత్తం, నేపథ్యం ఏదైనా కావచ్చు కానీ ప్రేమజంటల పాత్రల్లో కనీసం ఒకరు దళితులు అయ్యుండాలన్న నియమం పెట్టాం. రచయితలు ఏ కులమత వర్గ ప్రాంతీయ జెండర్ వారైనా కావచ్చు.‍


అస్తిత్వ సాహిత్య పుస్తకాలు పెద్దగా ఆస్తులు కూడపెట్టకపోవచ్చు కానీ అస్తిత్వమే ఆస్తిగా బతుకుతున్న రచయి తలుగా మేము సంపాదకులుగా కొత్త పాత్రలోకి వెళ్ళినప్పుడు మా రచయితలకు రూ.1000 గౌరవార్థం ఇస్తూ, ఐదు ప్రతులను బహూకరించాం. సంకలనాలు వేసిన సంపాదకులు రచయితల కథలతో సొమ్ము చేసుకుంటారనీ, కథా రచయిత లకు ఒక పుస్తక ప్రతిని ఇవ్వడానికి కూడా పెద్ద మనసు ఉండదని నిందలు మోస్తూనే ఉంటారు. ఇవన్నీ చూస్తున్న వారిగా మా రచయితలకు మేము ఇచ్చిన చిరుసత్కారం ఇది.

ఆంధ్రలో అస్తిత్వవాద రచ యిత్రులు పలుచబడిన ఈ కాలంలో ఆంధ్రా దళిత స్త్రీవాద రచయిత్రులుగా మేం దళిత ప్రేమకథలను సంకలనంగా తీసుకురావడం ఒక ప్రత్యేకమైన సందర్భం అని గట్టిగా చెప్పగలం. సమాజంలో ఇంతవరకూ పెద్దగా మాట్లాడని, మాట్లాడటానికి జంకిన, ప్రచురణ వరకూ రావడానికి అవకాశం లేకపోయిన ఎన్నో ప్రేమకథలకు జీవం పోస్తుందన్న ఆశతో ఈ ఈ సంకలనాన్ని మీ ముందుకు తెస్తున్నాం.


అపురూప – చింతన కథలు

43-Vi.jpg

సంపాదకత్వం: బి. అజయ్‌ ప్రసాద్‌

ఉదయిని అంతర్జాల పత్రిక కోసం నేను ‘అపురూప కథ’ పేరుతో శీర్షిక నడుపుతున్నాను. దాని కోసం గతంలో వచ్చిన ఆణిముత్యాల వంటి కథలను ఎంపిక చేసి వేస్తు న్నాను. ఆ పనిలో భాగంగా గత పాతికేళ్ల కాలంలో నాకు బాగా గుర్తుండిపోయిన కథల జాబితా తయారు చేసుకు న్నాను. అప్పుడే ఇలాంటి కథలతో ఒక సంకలనం తెస్తే బాగుంటుంది అన్న ఆలోచన కలిగింది. మధురాంతకం నరేంద్ర సంపాదకత్వంలో 2002లో ‘తాత్త్విక కథలు’ పేరిట ఒక కథా సంకలనం వచ్చింది. ఆ తరవాత గత ఇరవై ఏళ్ళ కాలంలో అటువంటి సంకలనం మరలా తెలుగులో రాలేదు. వచ్చిన సంకలనాలన్నీ చాలా వరకు నిర్దిష్ట భావజాల పరంపరలో వచ్చినవే. వార్షిక కథల సంకలనాలలో కూడా అటువంటి భావజాలానిదే పైచేయి. ఈ కారణంగా గత పాతికేళ్ల కాలంలో చెప్పుకోదగ్గ ఎన్నో కథలు వెలుగు లోకి రాకుండా పోయాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి కథల సంకలనం వస్తే బాగుంటుంది అన్న ఆలోచన కలిగింది.


కథల ఎంపికలో నేను ఎటువంటి భావజాలాన్నీ పరిగణన లోకి తీసుకోలేదు. తెలుగునాట వచ్చిన అన్నిరకాల సామాజిక ఉద్యమాల మీద నాకు గౌరవం ఉంది. కానీ సాహిత్యం, కళలు విషయాలకి వస్తే నా ఆసక్తి వేరు. ఈ కథలన్నీ ఒక దగ్గర పెట్టి చూసుకున్నప్పుడు దాదాపు అన్ని కథలు అంతరంగ విశ్లేషణ, ఆత్మాన్వేషణ, జీవిత వాస్తవం, చిత్త భ్రాంతి, వర్తమానానికి ఉండే విలువ మొదలైన అంశాల మీద నడిచాయి. ఇతరత్రా అస్తిత్వ ఉద్యమ కథలు రాసే రచయితల కథలు కూడా ఇందులో చోటు చేసుకున్నాయి. కాబట్టి ఇందులో ముందుగా ఎంచుకున్న ప్రాతిపదిక అంటూ ఏదీ లేదు. ఈ సారాంశం కూడా ఎంపిక జరిగిన తరవాత గ్రహించినదే. ఇలాంటి కథల కోసం ఎదురు చూసే కొత్త తరం పాఠకులకు, అలాగే ఒక రకమైన కొత్త తరం రచయితలు పుట్టడానికి ఈ సంకలనం ఉపకరిస్తుందని నా నమ్మిక. ఏ పాతికేళ్ళకో ఇలాంటి అరుదైన కథల సంకలనం ఒకటి వస్తుంది. అది నా చేతులతో తేగలగడం గౌరవంగా భావిస్తున్నాను.


ఈ కాలపు తెలుగు కథ

44-Vi.jpg

సంపాదకత్వం: కుమార్‌ కూనపరాజు

రెండు ప్రత్యేక సందర్భాలు నన్ను ఈ సంకలనం తేవడానికి పురికొల్పాయి. ఒకటేమింటే– అమెరికాలో నివసించే ఒకాయన అక్కడ ఇటీవల జరిగిన తెలుగు సభల్లో తెలుగు కథ అధోగతి వైపు ప్రయాణం చేస్తోందని ఓ తీవ్ర విమర్శ చేసాడు. ఇది తప్పని తెలియచెప్పడానికి, ఈ కాలపు తెలుగు కథలను సేకరించాను. అన్ని వర్గాలు, ప్రాంతాలు, వాదాల నుండి ప్రాతినిధ్యం వుండేలా చూసుకు న్నాను. రెండో సందర్భం– ఒక ప్రఖ్యాత తమిళ రచయిత, తెలుగు నుంచి తమిళ బాషకు అనువదింపబడిన కథా సంపుటి గురించి వ్యాఖ్యానిస్తూ, తమిళంలో తెలుగు కథలు అందుబాటులో పెద్దగా లేవని అన్నారు. ఇది నిజమే అనిపించింది. సాహిత్య అకాడమీ ద్వారా మాత్రమే కొన్ని అనువాదమై ఇతర భాషల్లోకి వెళ్ళాయి. మంచి తెలుగు సమ కాలీన కథను వీలైనన్ని భారతీయ భాషలలో తీసుకు వెళ్లాలన్న కోరిక కలిగింది. ఇందు కోసం కూడా ఈ సంకలనం చేసాం. ఈ సంకలనం లోని కథల ఎంపికకి ప్రాతిపదికగా– కథకులు వారి ప్రాంత, వర్గ, వర్ణ, జెండర్ అణచివేతలను ప్రభావ వంతంగా చూపించిన కథా అంశా లనూ, కొన్ని తెలుగు జనరల్ అంశా లనూ పరిశీలించాము. ఆధునిక కాలం లోనూ కొనసాగుతున్న వివక్షనూ, అమానవీయ విషయాలనూ, మానవ హృదయ వేదననూ ఈ కథలు ఎత్తి చూపుతాయి.


ఉత్తమ రష్యన్‌ కథలు

45-Vi.jpg

సంపాదకత్వం: అనిల్ బత్తుల

మొదటగా నేను ‘రాదుగ’ పుస్తకాల అభిమానిని. గత ఇరవై యేళ్లుగా ‘రాదుగ’, ‘ప్రగతి’ ప్రచురణ సంస్థలు ప్రచురించిన ఎన్నో రష్యన్ తెలుగు అనువాద పుస్తకాలను సేకరిస్తూ వచ్చాను. వాటిలో అజరామరమైన నవలలు, నవలికలు, కథలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ వీలున్నప్పుడల్లా మళ్ళీ మళ్ళీ చదువుతుంటాను. రష్యన్‌ అనువాద కథల్లో నాకు నచ్చిన కథలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ ఒకచోట పెట్టి సంక లనంగా తెస్తే తెలుగు పాఠకులకు వెసులుబాటుగా ఉందని పించింది. ఈ ఆలోచనే ఈ పుస్తకానికి నాంది. ఈ కథలన్నీ ఇప్పటికే కాలానికి నిలబడిన కథలు. అదే నేను ఎంచుకున్న ప్రామాణికత. ఇందులో పెద్ద కథలు, నవలికలంత నిడివి వున్న కథలు కూడా ఉన్నాయి. ఈ కథలన్నీ సుమారు నూట యాభైఏళ్ళ క్రితం రష్యాలో ప్రచురించబడి నవే. రచయితలంతా టాల్‌స్టాయ్, చెఖోవ్, గోర్కీ వంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవారు. ఈ రచ యితలకు ఎంత పేరుందో వాళ్ళ రచనలకూ అంతే పేరుంది. ఈ పుస్తకం ప్రత్యేకత– ప్రఖ్యాతి గాంచిన రష్యన్ కథలు ఒకేచోట ఉండటం. రాచమల్లు రామచంద్రారెడ్డి, ఆర్వీయార్, నిడమర్తి ఉమా రాజేశ్వరరావు, గిడుతూరి సూర్యం వంటి లబ్ధప్రతిష్టులైన అనువాదకులు అనువదించిన కథలన్నీ ఒకే సంకలనంలో చేర్చడం. అరుణా ప్రసాద్ వంటి వర్తమాన అనువాదకుల కథలు కూడా ఇందులో వున్నా యి. శాశ్వతంగా మనసు పొరలపై ముద్ర వేసే కథల సంకలనం ఇది.


ఆధునిక తెలుగు కథ: 2000-2024

41-Vi.jpg

సంపాదకత్వం: అరిపిరాల సత్యప్రసాద్‌,

వెంకట్‌ శిద్దారెడ్డి, మహి బెజవాడ

తెలుగులో ఉత్తమ కథల కోసం వెతికే సాహితీ ప్రియులకు అందే మొదటి పది సజెషన్స్‌లో ఏడెనిమిది కథలు యాభై అరవై ఏళ్లకు ముందు రాసినవి అయ్యుంటాయి. అలాగే పుస్తకాల షాపుల్లోనూ, పుస్తక ప్రదర్శనలోనూ అడుగుపెట్టగానే మొదట కనపడే పది తెలుగు పుస్తకాల్లో ఏడెనిమిది పుస్తకాల రచయితలు గతించి పోయి దశాబ్దాలు దాటి ఉంటుంది. పూర్వపు రచయితల గొప్పద నాన్ని తక్కువ చెయ్యటం కాదు కానీ, వర్తమానంలో వస్తున్న కథలలో ఆ పాత కథలకు ఏ మాత్రం తీసిపోని కథలు ఉన్నాయి అన్నది మా గమనింపు. ఈ ఆలోచనే ఈ ‘ఆధునిక తెలుగు కథ’ పుస్తకానికి బీజం వేసింది. ఇతర భాషలలో వచ్చే ఉత్తమ సాహిత్యాన్ని కళ్లకద్దుకునే మనం, తెలుగులో వస్తున్న రచనలను కనీసం గుర్తించడానికి కూడా వెనుకాడటం మరో కారణం. అందువల్ల 2000 సంవత్సరం తరువాత రాయడం మొదలు పెట్టిన రచయితల కథలను సేకరించి, వాటిలో నుంచి ఎంచుకున్న ఉత్తమ కథలతో ఈ పుస్తకాన్ని రూపొందించాం.


ఈ కథలను ఇతర భాషల పాఠకులకి అందించే ఉద్దేశం కూడా ఉంది కాబట్టి అనువా దానికి అనువైన కథలను ఎంచుకునేందుకు ప్రయత్నించాం. తూకం వేసి కథలను ఎంపిక చేయక పోయినప్పటికీ, ఇందులో అన్ని రకాల కథలకూ ప్రాతినిధ్యం కలిగిందనే నమ్మకం ఉంది. ఈ కథలన్నీ ఒక పుస్తకంగా చూసినప్పుడు వర్తమాన తెలుగు రచయితలలో ఆధునిక శైలీ శిల్పాలతోపాటు ప్రగతిశీల దృష్టి, సామాజిక చైతన్యం కూడా ఉన్నాయని నిరూపణ అయ్యింది. అదే ఈ పుస్తకం విలువని పెంచిందని అనుకుంటున్నాం. తెలుగు పాఠకులకి ఆధునిక తెలుగు కథ సుసంపన్నంగా ఉంది అని చెప్పడంతోపాటు, ఈ వైభవాన్ని తెలుగేతర పాఠకులకి చూపించేందుకు ఈ పుస్తకం అద్దంలా పనిచేస్తుందని మా విశ్వాసం.

Updated Date - Nov 18 , 2024 | 06:05 AM