AC: ఎండలు భరించలేక ఏసి వాడుతున్నారా? మీకు తెలియని నిజాలివీ..!
ABN , First Publish Date - 2024-04-04T12:23:40+05:30 IST
ఎండలెక్కువ ఉన్నాయని ఏసిని ఎక్కువగా వాడితే జరిగేది ఇదే..
వేసవి కాలం మొదలయ్యింది. రోజురోజుకూ ఎండల ప్రతాపం పెరుగుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భరించలేక చాలామంది కూలర్లు, ఏసీలు వాడతారు. ఇవి వేసవి వేడి నుండి ఉపశమనం అందిస్తాయి. అయితే ఏసీని అధికంగా వాడటం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆరోగ్యం మీద ఏసీ చూపించే ప్రభావం ఏంటో తెలుసుకుంటే..
ఎండాకాలంలో ఏసీని ఉపయోగించడం చాలా సౌకర్యంగా ఉంటుంది. అయితే దీన్ని నిరంతరంగా ఎక్కువసేపు ఉపయోగిస్తే, ఇది చర్మం, కళ్ళు, శ్వాసనాళాలకు సంబంధించిన సమస్యలు కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి: ఫేస్ వాష్ ను రోజులో ఏ సమయంలో, ఎన్ని సార్లు ఉపయోగిస్తే బెస్టో తెలుసా?
మరీ ముఖ్యంగా ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ వల్ల అంటు వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. వీటి నిర్వహణ, శుభ్రతతో పాటు, గదిలో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.
వేసవి కాలంలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా అవసరం. తక్కువ నీరు తాగడం వల్ల ఆరగ్య సమస్యలు కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది. ఎయిర్ కండీషనింగ్ గాలిలో తేమను తగ్గిస్తుంది. పైపెచ్చు ఏసీ వాతావరణంలో ఉన్నప్పుడు ఆ చల్లదనం వల్ల నీరు కూడా తక్కువ తాగుతాం. దీని కారణంగా శరీరంలో నీటి శాతం కూడా తగ్గిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సమయం ఏసీ లో గడిపే వ్యక్తులకు డీహైడ్రేషన్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఎయిర్ కండిషనింగ్ లో ఎక్కువ సమయం గడపడం వల్ల కళ్లు, చర్మంపై కూడా దుష్ప్రభావం ఉంటుంది. ఏసీ కారణంగా చర్మం తేమను కోల్పోతుంది. చర్మం పొడిబారుతుంది. ఇక ఏసీలో ఎక్కువసేపు ఉండేవారికి కళ్లు పొడిబారతాయి. దీన్ని పొడి కళ్ల సమస్య అంటారు. గదిలో తక్కువ తేమ కళ్ల ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది.
ఎయిర్ కండీషనింగ్ శ్వాసకోశ సమస్యపై ప్రభావం చూపిస్తుంది. ముందే శ్వాస కోశ సమస్యలున్నవారిలో చల్లని, పొడి గాలి వాయు మార్గాలను చికాకు పెడుతుంది. ఇది దగ్గు, తుమ్ములు, గొంతులో అసౌకర్యం వంటి లక్షణాలను కలిగిస్తుంది. ఉబ్బసం, అలెర్జీ సమస్యతో ఇబ్బంది పడే వ్యక్తులు ఏసీలో గడిపితే సమస్య తీవ్రమవుతుంది.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.