Share News

Diabetes: స్వీట్స్ ఎక్కువగా తింటే షుగర్ వ్యాధి వస్తుందా?

ABN , Publish Date - Sep 08 , 2024 | 07:17 AM

స్వీట్లు ఎక్కువగా తినడం, డయాబెటిస్ ప్రమాదానికి మధ్య సంబంధం సంక్లిష్టమైనదని వైద్యులు చెబుతున్నారు. మరి స్వీట్స్ అధికంగా తింటే షుగర్ వ్యాధి వస్తుందో లేదో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

Diabetes: స్వీట్స్ ఎక్కువగా తింటే షుగర్ వ్యాధి వస్తుందా?

ఇంటర్నెట్ డెస్క్: స్వీట్లు ఇష్టపడని వారు దాదాపుగా ఉండరనే చెప్పాలి. అయితే, ఇటీవల కాలంలో చిన్నపిల్లల్లోనూ డయాబెటిస్ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో స్వీ్ట్స్ ఎక్కువగా తింటే ఈ వ్యాధి వస్తుందా అన్న సందేహం అనేక మందిలో ఉంది. ఈ ప్రశ్నకు వైద్యులు (Health) సవివరమైన సమాధానమే చెబుతున్నారు.

స్వీట్లు ఎక్కువగా తింటే నేరుగా షుగర్ వ్యాధి వస్తుందా? అనేది చాలా మందికి కలిగే ప్రశ్న. అయితే, దీనికి సమాధానం అవును లేదా కాదు అని ఒక్కముక్కలో చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. స్వీట్లకు షుగర్ వ్యాధికి మధ్య సంబంధం సంక్లిష్టమైనదని వ్యాఖ్యానిస్తున్నారు (Does eating too many sweets increase the chances of diabetes).

ఉదయం.. రాత్రి.. పాలు తాగేందుకు సరైన సమయం ఏదంటే..


అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం, టైప్ 1 డయాబెటిస్ ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి. ఇందులో రోగనిరోధక వ్యవస్థ ఇన్సూలీన్ ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేస్తుంది. దీంతో ఇన్సులీన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా, కణాలు చక్కెరను సరిగా వినియోగించుకోలేవు. ఈ క్రమంలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి డయాబెటిస్ బారిన పడతారు.

ఇక టైప్ 2 వ్యాధి మాత్రం జీవన శైలికి సంబంధించిన అంశాలతో ముడిపడి ఉంది. చక్కెరలు అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే ఊబకాయం వస్తుంది. దీంతో, శరీరంలోని కీలక అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుంటుంది. దీన్ని శాస్త్రపరిభాషలో విసెరల్ ఫ్యాట్ అని అంటారు. దీంతో, ఇన్సులీన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. అంటే, ఇన్సులీన్ ప్రభావం శరీరంపై తగ్గుతుంది. దీంతో, రక్తంలో చక్కెరలు పెరిగి షుగర్ వ్యాధికి దారి తీస్తుంది.


చక్కెరలు అధికంగా ఉంటే పానీయాలను తరచూ తాగే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ముప్పు పెరుగుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు రుజువు చేశాయి. రోజుకు ఒకటి లేదా రెండు చక్కెర పానీయాలు తాగినా షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలు 26 శాతం మేర పెరుగుతాయట. షుగర్ డ్రింక్స్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. సుదీర్ఘకాలం ఇదే పరిస్థితి కొనసాగితే ఇన్సులీన్ రెసిస్టెన్స్ వస్తుంది. శరీరంలోని కణాలు ఇన్సులీన్‌కు స్పందించకపోవడాన్నే ఇన్సులీన్ రెసిస్టెన్స్ అని అంటారు. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి షుగర్ వ్యాధి బారిన పడతారు.

అయితే, మార్కెట్లో లభించే పానీయాల్లో రిఫైన్డ్ చక్కెరలు జత చేస్తారని వీటితోనే ఇన్సులీన్ రెసిస్టెన్స్ పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. పండ్లు వంటి పదార్థాల్లో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయని, వీటితో ఎటువంటి అపాయం ఉండదని చెబుతున్నారు.

Read Health and Telugu News

Updated Date - Sep 08 , 2024 | 07:22 AM