Living Organ Donation: మనిషి జీవించి ఉండగానే ఏయే అవయవాలను దానం చేయొచ్చో తెలుసా?
ABN , Publish Date - Nov 24 , 2024 | 07:57 PM
సాధారణంగా మృతి చెందిన వారి అవయవాలను కుటుంబసభ్యులు దానం చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే, జీవించి ఉన్న వారు కూడా తమ అవయవాల్లో కొంత భాగాన్ని రోగులకు ఇచ్చి వారి ప్రాణాలను నిలబెట్టొచ్చు. దీన్ని వైద్య పరిభాషలో లివింగ్ ఆర్గాన్ డొనేషన్ అని అంటారు. ఇలా ఏయే అవయవాలను దానం చేసే వీలుందో తెలుసుకోదలిచిన వారి కోసమే ఈ కథనం!
ఇంటర్నెట్ డెస్క్: అవయవ దానం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చావుబతుకుల మధ్య ఉన్న వారికి అవయవదానం కొత్త జీవితాన్ని ఇస్తుంది. సాధారణంగా మృతి చెందిన వారి అవయవాలను కుటుంబసభ్యులు దానం చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే, జీవించి ఉన్న వారు కూడా తమ అవయవాల్లో కొంత భాగాన్ని రోగులకు ఇచ్చి వారి ప్రాణాలను నిలబెట్టొచ్చు. దీన్ని వైద్య పరిభాషలో లివింగ్ ఆర్గాన్ డొనేషన్ అని అంటారు. అయితే, ఇలా ఏయే అవయవాలను దానం చేసే వీలుందో తెలుసుకోదలిచిన వారి కోసమే ఈ కథనం (Health)!
Hair Dye - Greying: హెయిర్ డై వాడితే జుట్టు నెరిసిపోతుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..
కిడ్నీ డొనేషన్
అత్యధికులు జీవించి ఉండగా దానం చేసే అవయవం కిడ్నీ. శరీరంలోని మలినాలను తొలగించేందుకు ఒక కిడ్నీ సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ఒక్క కిడ్నీతో జీవితాంతం ఆరోగ్యం ఉండొచ్చని భరోసా ఇస్తున్నారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ల విజయవంతమయ్యే అవకాశాలు చాలా ఎక్కువని కూడా చెబుతున్నారు. శరీరం నుంచి తొలగించాక కిడ్నీలు పాడయ్యే అవకాశాలు తక్కువ కావడంతో ఈ శస్త్రచికిత్సల సక్సెస్ రేటు ఎక్కువని వైద్యులు వివరిస్తున్నారు.
కాలేయ దానం
జీవించి ఉన్న వారు తమ కాలేయంలో కొంత భాగాన్ని డొనేట్ చేయొచ్చు. కోల్పోయిన భాగాన్ని తిరిగి నిర్మించుకునే శక్తి లివర్‌కు ఉన్న కారణంగా లివర్ దానం సాధ్యమని వైద్యులు చెబుతున్నారు. అవయవాల కొరత కారణంగా సాధారణ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం ఎక్కువ కాలం వేచి చూడాల్సిన వారికి లివింగ్ ఆర్గన్ డొనేషన్ మంచి ప్రత్యామ్నాయం అని చెబుతున్నారు. తొలగించిన భాగం.. నెలల వ్యవధిలోనే మళ్లీ పూర్తిస్థాయిలో పునరుద్ధరణకు గురవుతుందని చెబుతున్నారు.
Hairloss: జుట్టూడిపోతోందా? ఈ లిమిట్ దాటనంత వరకూ టెన్షన్ వద్దు!
ఊపిరితిత్తులు
లివర్‌లా ఊపిరితిత్తులకు కోల్పోయిన భాగాన్ని పునర్మించుకునే శక్తి లేకపోయినప్పటికీ వీటిల్లో కూడా కొంత భాగాన్ని డొనేట్ చేయొచ్చని వైద్యులు అంటున్నారు. డొనేషన్ తరువాత ఊపిరితిత్తిలో మిగిలిన ఒక భాగంతో ఆరోగ్యంగా జీవించొచ్చని భరోసా ఇస్తున్నారు. అత్యవసర సందర్భాలు తలెత్తినప్పుడు చిన్న పిల్లల విషయంలో ఈ తరహా డొనేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటామని వైద్యులు చెబుతున్నారు.
పాంక్రియాస్
సాధారణంగా పాంక్రియాస్‌లో చివరి భాగాన్ని (టెయిల్) వైద్యులు జీవించి ఉన్న వారిని నుంచి సేకరించి రోగులకు అమరుస్తారు. అయితే, ఇది చాలా అరుదైన ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియ. టైప్ - 1 డయాబెటీస్ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఈ తరహా అవయవ మార్పిడిని వైద్యులు సూచిస్తారట. పాంక్రియాస్‌లో తోక భాగాన్ని తొలగించినా మిగిలిన అవయవం గ్లూకోస్ స్థాయిలను సమర్థవంతంగా నియంత్రిస్తుందట.
Red Wine - Cancer: రెడ్ వైన్ క్యాన్సర్‌ను అడ్డుకుంటుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
స్మాల్ ఇంటెస్టైన్ డొనేషన్
జీవించి ఉన్న వారి చిన్న పేగులోని కొంత భాగాన్ని కూడా డొనేట్ చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇది కూడా చిన్న పిల్లల విషయంలో అనుసరించే శస్త్రచికిత్స. అయితే, ఈ ఆపరేషన్ చాలా సంక్లిష్టమైనదని, ప్రమాదావకాశాలు ఎక్కువని చెబుతున్నారు. కాబట్టి, రోగిని కాపాడేందుకు చివరి ప్రయత్నంగా ఈ తరహా అవయవ మార్పిడి చికిత్సను వైద్యులు సూచిస్తారు.
లివింగ్ ఆర్గాన్ డొనేషన్ ప్రయోజనాలు, ప్రమాదావకాశాలు
రోగి ఆరోగ్యానికి అత్యంత అనుకూలమైన సమయాన్ని ఎంచుకుని ఆపరేషన్ చేసే అవకాశం లివింగ్ ఆర్గాన్ డొనేషన్ కల్పిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో, రోగి కోలుకునే అవకాశాలు పెరుగుతాయని అన్నారు. దాతల నుంచి అవయవాలను అప్పటికప్పుడు సేకరించే అవకాశం ఉండటంతో పూర్తి ఆరోగ్యకర అవయావన్ని రోగికి అమర్చవచ్చని వివరించారు. అయితే, అవయవాన్ని సేకరించేందుకు ఉద్దేశించిన శస్త్రచికిత్సలు సంక్లిష్టమైనవని, ఆపరేషన్ సమయంలో అధిక రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు, ఇతర దీర్ఘకాలిక సమస్యలకు అవకాశం ఉందని చెబుతున్నారు. అన్ని అంశాలూ పరిశీలించాకే ఈ విషయాల్లో తాము ఓ నిర్ణయానికి వస్తామని వైద్యులు చెబుతున్నారు. కాగా, లివింగ్ ఆర్గాన్ డొనేషన్ చేసిన వారు ఆ తరువాత సుదీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించినట్టు ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చాయి.