Contact Lens: కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నప్పుడు ఈ తప్పు మాత్రం చేయొద్దు! చాలా డేంజర్!
ABN , Publish Date - Aug 30 , 2024 | 08:25 AM
కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుని స్నానం చేస్తే కంటిలోకి సూక్ష్మక్రిములు ప్రవేశించి ఇన్‌ఫెక్షన్ కలగజేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: దృష్టిలోపం ఉండి కళ్లద్దాలు పెట్టుకోవడం ఇష్టం లేకపోవడం లేదా ఇతరత్రా సమస్యలు ఉన్న వారికి కాంటాక్ట్ లెన్స్ మంచి ప్రత్యా్మ్నాయం. కోట్ల మంది వినియోగిస్తున్న కాంటాక్ట్ లెన్స్ సురక్షితమే (Health) అయినా తెలియక చేసే కొన్ని పొరపాట్ల కారణంగా ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా కంటి ఇన్ఫెక్షన్లు గనక సోకితే చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇటీవల ఓ మహిళ కాంటాక్ట్ లెన్స్ ధరించి స్నానం చేసింది. ఆ తరువాత కంటికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకి చూపుకోల్పోయింది. ఆ తరువాత కార్నియా ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేశాకే పోయిన చూపు తిరిగొచ్చింది. ఈ విషయాల్ని మహిళ స్వయంగా ఇన్‌స్టాలో పంచుకుంది.
Happy Hormornes: రోజూ ఇలా చేస్తే శరీరంలో సంతోషకర హార్మోన్ల విడుదల! లైఫంతా ఫుల్ ఖుష్!
నీరు, మట్టిలో ఉండే అమీబా అనే సూక్ష్మజీవి కారణంగా కంటికి అకాంతమీబా కెరాటైటిస్ ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకినప్పుడు కార్నియాలో ఇన్‌ఫెక్షన్ వచ్చి చూపును కూడా కోల్పోతారు. సూక్ష్మక్రియి కార్నియాలోకి చొరబడినప్పుడు ఈ సమస్య వస్తుందని అంటున్నారు. సాధారణంగా ఇళ్లకు సప్లై అయ్యే మంచినీటిలోనూ ఈ అమీబా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుని స్నానం చేసిన సందర్భాల్లో తేమ కారణంగా లెన్స్ కంటికి అంటుకుపోయి ఒరిపిడి కలగజేస్తాయి. ఫలితంగా కంటికి అయ్యే గాయం ద్వారా అమీబా లోపలికి ప్రవేశించి వ్యాధి కలుగజేస్తుందని అంటున్నారు. బ్యాక్టీరియాతో పాటు, వైరస్, ఫంగస్‌తో కూడా ఈ సమస్య వస్తుందని అంటున్నారు (Why you should not shower wearing contact lens).
కెరాటైటిస్ వ్యాధి లక్షణాలు..
ఈ వ్యాధి సోకినప్పుడు కంటిలో మంట, ఇరిటేషన్, కంట్లో ఏదో నలుసుపడ్డట్టు భావన, కళ్లు ఎర్రగా మారడం, కంట్లో నీరు ఆగకుండా కారడం, వెలుతురు చూడలేకపోవడం, కంటి చూపు మందగించడం తదితర సమస్యలు వేధిస్తాయి. కాబట్టి, ఇన్‌ఫెక్షన్ సోకిన వెంటనే కాంటాక్ట్ లెన్స్‌ను తొలగించాలి. కళ్లద్దాలు వాడటం ప్రారంభించాలి. వైద్యుడిని సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి.
కాంటాక్ట్ లెన్స్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుని ఈత కొట్టడం లేదా స్నానం వంటి చేయకూడదు
ఈ లెన్స్ ధరించి నిద్రపోకూడదు.
నల్లా నీరుతో లెన్స్‌ను ఎట్టిపరిస్థితుల్లో శుభ్రం చేయకూడదు. లెన్స్‌తో పాటు ఇచ్చే క్లీనింగ్ ద్రావణంతోనే శుభ్రపరచాలి.
కంటికి సరిగా అమరని లెన్స్‌ను, పాత లెన్స్‌ను అస్సలు వాడకూడదు.
చేతులు శుభ్రం చేసుకున్నాకే కాంటాక్ట్ లెన్స్‌ను తాకాలి.