Share News

కళ్లజోడు కాదు.. కంప్యూటర్‌!

ABN , Publish Date - Sep 27 , 2024 | 03:32 AM

రేడియో, టేప్‌రికార్డర్‌, కాలుక్యులేటర్‌.. ఇలా ఎన్నో ఉపకరణాలను కాలగర్భంలో కలిపేసిన స్మార్ట్‌ఫోన్‌ను మరిపించే ‘ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ గ్లాసె్‌స’ను మెటా సీఈవో మార్క్‌ జుకెర్‌బెర్గ్‌ ప్రపంచానికి ప్రదర్శించారు.

కళ్లజోడు కాదు.. కంప్యూటర్‌!

  • బ్రెయిన్‌ సిగ్నల్స్‌తో, కంటిచూపుతో,

  • చేతి కదలికతో నియంత్రించగలిగే

  • ఏఆర్‌ గ్లాసెస్‌ ‘ఓరియన్‌’ను ఆవిష్కరించిన

  • మెటా సీఈవో జుకెర్‌బెర్గ్‌

న్యూయార్క్‌, సెప్టెంబరు 26: రేడియో, టేప్‌రికార్డర్‌, కాలుక్యులేటర్‌.. ఇలా ఎన్నో ఉపకరణాలను కాలగర్భంలో కలిపేసిన స్మార్ట్‌ఫోన్‌ను మరిపించే ‘ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ గ్లాసె్‌స’ను మెటా సీఈవో మార్క్‌ జుకెర్‌బెర్గ్‌ ప్రపంచానికి ప్రదర్శించారు. ‘ఓరియన్‌’ పేరుతో రూపొందించిన ఈ ఏఆర్‌ గ్లాసె్‌సను.. మన మెదడు సంకేతాలతో, కంటిచూపుతో, చేతికదలికలతో నియంత్రించవచ్చు (అలా నియంత్రించడానికి మన చేతి మణికట్టుకు ఒక బ్యాండ్‌ను ధరించాల్సి ఉంటుంది). డిజిటల్‌ కంటెంట్‌ను నిరంతరాయంగా వీక్షించవచ్చు. కంప్యూటర్ల తరహాలోనే.. ఒకేసారి పలు వర్చువల్‌ విండోలు ఓపెన్‌ చేసి.. మల్టీ టాస్కింగ్‌ చేయొచ్చు.

ఆ విండోల్లో మనకు కనిపించేవాటిలో ఒకదాన్ని ఎంచుకోవడానికి.. మన కళ్లే ‘మౌస్‌ పాయింటర్‌’లా పనిచేస్తాయి. దాన్ని క్లిక్‌ చేయడానికి మన చేతి వేళ్ల కదలికలే సంకేతాలవుతాయి. దీంతో వీడియో గేమ్స్‌ ఆడొచ్చు. వీడియో కాల్స్‌ కూడా చేసుకోవచ్చు. వీడియోకాల్‌ చేసినప్పుడు అవతలి వ్యక్తుల లైఫ్‌సైజ్‌ హోలోగ్రామ్‌లను మన ముందు ప్రదర్శిస్తాయి. ఈ కళ్లజోడును ధరించి మన ముందున్న వస్తువులను చూస్తే.. ఇందులో ఉండే ఏఐ వాటిని గుర్తించి, వాటి పేర్లను డిస్‌ప్లే చేస్తుంది. అక్కడున్న పదార్థాలతో ఏ వంటకాన్ని తయారుచేయొచ్చో అడిగితే సలహాలిస్తుంది.


ఒక్కమాటలో చెప్పాలంటే.. కళ్లజోడును కాదు.. ఒక కంప్యూటర్‌ని కళ్లకు ధరించినట్టే ఉంటుందన్నమాట!! ఈ కళ్లజోడు తయారీలో వినియోగించిన అద్దాలు గాజువి కావు. సిలికాన్‌ కార్బైడ్‌ మెటీరియల్‌తో తయారుచేసినవి. ఫ్రేమ్‌ని మెగ్నీషియంతో తయారుచేశారు. ఇందులో ఉండే మైక్రో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్లు.. 70 డిగ్రీల ఫీల్డ్‌ ఆఫ్‌ వ్యూ ఉండే హోలోగ్రాఫిక్‌ డిస్‌ప్లేను మన కళ్ల ముందు ఆవిష్కరిస్తాయి. అందుకే దీన్ని ‘‘ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన కళ్లజోడు’’గా జుకెర్‌బెర్గ్‌ అభివర్ణించారు. నిజానికి మెటా సంస్థ దశాబ్దకాలంగా వీటిపై కృషి చేస్తోంది. మెటాతోపాటు ఇంకా చాలా కంపెనీలు ఈ తరహా ఏఆర్‌ గ్లాసె్‌సను తయారుచేయడంలో బిజీగా ఉన్నాయి.

వాటిలో.. ‘స్నాప్‌’ అనే కంపెనీ ‘స్పెక్టకిల్స్‌ 5’ పేరుతో ఇటీవలే ఒక కళ్లజోడును మార్కెట్లోకి తేనున్నట్టు ప్రకటించింది. దాంతో పోలిస్తే ‘ఓరియన్‌’ గ్లాసెస్‌ చాలా చిన్నగా.. మామూలు కళ్లద్దాల్లా కనిపించడం గమనార్హం. అయితే, ఈ కళ్లజోళ్ల ఉత్పత్తి ఖర్చు ఒక్కొక్కదానికీ 10 వేల డాలర్లు అవుతోంది. అంత ధర పెడితే కొనేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి.. ప్రజలకు అందుబాటు ధరల్లోకి తెచ్చేందుకు మెటా కృషి చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచమంతా వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టా్‌పల ధరకే ఏఆర్‌ గ్లాసెస్‌ కూడా మరికొన్నేళ్లలో ప్రజలకు అందుబాటు ధరల్లోకి వస్తాయని జుకెర్‌బెర్గ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే దీని బరువు 98గ్రాములు. దీన్ని కూడా తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Updated Date - Sep 27 , 2024 | 03:33 AM