Benjamin Netanyahu: అలా చేస్తే భారీ మూల్యం తప్పదు.. ఇజ్రాయెల్ ప్రధాని స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Jul 21 , 2024 | 09:10 PM
ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఆదివారం తన శత్రు దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమని ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని, తమ శక్తి సామర్థ్యాలపై అనుమానం పెట్టుకోవాల్సిన..
ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు (Benjamin Netanyahu) ఆదివారం తన శత్రు దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమని ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని, తమ శక్తి సామర్థ్యాలపై అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఉద్ఘాటించారు. ఎవరైనా తమ జోలికి వస్తే.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. శనివారం ఇరాన్ మద్దతు గల హౌతీ స్థావరాలపై ఇజ్రాయెల్ దళాలు దాడి చేసిన అనంతరం ఆయన ఈ వార్నింగ్ ఇచ్చారు. అసలు ఏమైందంటే..
శుక్రవారం ఇజ్రాయెల్‌లోని టెల్ అవివ్ (Tel Aviv) నగరంలో హౌతీలు (ఇరాన్ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు) డ్రోన్ ఎటాక్‌కు పాల్పడ్డారు. హమాస్‌కి (గాజా) మద్దతుగా వాళ్లు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఓ ఇజ్రాయెల్ పౌరుడు మరణించడంతో పాటు కొంతమేర ఆస్తినష్టం జరిగింది. దీంతో ఆ దేశం శనివారం ప్రతీకార దాడులు చేసింది. యెమెన్‌లోని హౌతీ స్థావరాలే లక్ష్యంగా.. హొదైదా నౌకాశ్రయంతో పాటు పలు ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందడంతో పాటు 80 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ఆదివారం నెతన్యాహు స్పందిస్తూ.. ఇజ్రాయెల్ శక్తి సామర్థ్యాలను తక్కువగా చూడొద్దని హెచ్చరించారు.
‘‘ఇజ్రాయెల్ శత్రువులకు నేనొక సందేశం ఇవ్వాలని అనుకుంటున్నా. తనను తాను రక్షించుకునే సామర్థ్యం ఇజ్రాయెల్‌కు ఉందా? లేదా? అనే విషయంలో ఏ ఒక్కరూ అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే.. మాకు హాని తలపెట్టాలని చూస్తే, బారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని నెతన్యాహు చెప్పుకొచ్చారు. హొదైదా నౌకాశ్రయం ద్వారా ఇరాన్ నుంచి హూతీలకు ఆయుధాలు సరఫరా అవుతున్నాయని, వాటి ద్వారానే టెల్ అవివ్‌పై దాడులు చేస్తున్నారని అన్నారు. గత ఎనిమిది నెలల నుంచి ఇజ్రాయెల్‌పైకి వందలాది బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్‌లను హౌతీలు ప్రయోగించారని, వాటిని అడ్డుకోవడం వల్ల ప్రాణనష్టం నివారించగలిగామని తెలిపారు.
తాము చేసిన దాడిలో ఎక్కువగా ప్రాణనష్టం జరగలేదని.. ఇజ్రాయెల్, దాని మిత్రపక్షాలతో కలిసి రక్షణాత్మక చర్యలు తీసుకున్నాకే ఈ దాడి చేశామని నెతన్యాహు వివరణ ఇచ్చారు. కానీ.. శుక్రవారం ఇజ్రాయెల్‌పై జరిగిన డ్రోన్ ఎటాక్ దృష్ట్యా హౌతీలను అడ్డుకోవడం కోసం రక్షణాత్యక చర్యలు అవసరం లేదని తెలుస్తోందని అన్నారు. తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందేనని ఉద్ఘాటించారు. ఇదే సమయంలో.. దూకుడుగా వ్యవహరిస్తున్న ఇరాన్‌కి కూడా వార్నింగ్ ఇచ్చారు. తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. చూస్తుంటే.. ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు.
Read Latest International News and Telugu News