Share News

Donald Trump: పడి లేచిన కెరటం.. డొనాల్డ్ ట్రంప్ గురించి ఈ విషయాలు తెలుసా?

ABN , Publish Date - Nov 06 , 2024 | 01:50 PM

ఉత్కంఠ వీడింది. పట్టుదల, గెలిచి తీరాలనే కసి కిరీటాన్ని అందుకున్నాయి. గత ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన ట్రంప్ తాజా ఎన్నికల్లో విజయ భావుటా ఎగురవేశారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 47వ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Donald Trump: పడి లేచిన కెరటం.. డొనాల్డ్ ట్రంప్ గురించి ఈ విషయాలు తెలుసా?
Donald Trump

ఉత్కంఠ వీడింది. పట్టుదల, గెలిచి తీరాలనే కసి కిరీటాన్ని అందుకున్నాయి. గత ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజా ఎన్నికల్లో విజయ భావుటా ఎగురవేశారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 47వ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్‌తో (Kamala Harris) హోరాహోరీగా తలపడి గెలుపు అందుకున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ట్రంప్ ఇంటికే పరిమితమవకుండా మరింత పట్టుదలతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తుపాకీ గుళ్లకు కూడా వెరవకుండా అనుకున్నది సాధించారు (US Elections).


1946 జూన్ 14న న్యూయార్క్ నగరంలోని క్వీన్స్‌లోని జమైకా హాస్పిటల్‌లో ఫ్రెడ్ ట్రంప్, మేరీ అన్నే మాక్లియోడ్‌లకు నాలుగో సంతానంగా ట్రంప్ జన్మించారు. ఆర్థికశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. 1977లో, ట్రంప్ చెక్ మోడల్ ఇవానా జెల్నికోవాను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే నటి మార్లా మాపుల్స్‌తో ట్రంప్ ఎఫైర్ కారణంగా ఈ జంట విడాకులు తీసుకుంది. ఆ తర్వాత 1993లో మాపుల్స్‌ను ట్రంప్ వివాహం చేసుకున్నారు. వీరు 1999లో విడాకులు తీసుకున్నారు. 2005లో స్లోవేనియన్ మోడల్ మెలానియా నాస్‌ను ట్రంప్ వివాహం చేసుకున్నారు. ముగ్గురు భార్యల ద్వారా ట్రంప్‌నకు మొత్తం ఐదుగురు పిల్లలు ఉన్నారు.


చదువు తర్వాత ట్రంప్ తన తండ్రి రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం పొందారు. అనంతరం తన వ్యాపార దక్షతతో అంచెలంచెలుగా ఎదిగారు. దూకుడు, రిస్క్ చేసే తత్వం వ్యాపారంలో ట్రంప్‌నకు బాగా కలిసి వచ్చాయి. మూతబడిన ఎన్నో హోటల్స్, క్యాసినోలను ట్రంప్ తెరిచి వృద్ధిలోకి తీసుకొచ్చారు. తన తండ్రి వ్యాపారం చేతుల్లోకి వచ్చిన తర్వాత దానికి ``ట్రంప్ ఆర్గనైజేషన్`` అని పేరు పెట్టారు. అనేక ఆకాశ హర్మ్యాలు, హోటళ్లు, కాసినోలను నిర్మించడం, పునరుద్ధరించడం చేశారు. అలాగే 2004 నుంచి 2015 వరకు ``ది అప్రెంటిస్`` అనే టెలివిజన్ కార్యక్రమానికి సహ-నిర్మాత, హోస్ట్‌గా వ్యవహరించారు. గొప్ప వ్యాపార దక్షత కలిగిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు.


ప్రభుత్వ కార్యకలాపాలలో అనుభవం లేకుండా, సైన్యంలో పని చేయకుండా నేరుగా 2017లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడ్డారు. స్థానిక అమెరికన్లను ఆకట్టుకునే నినాదాలతో హోరెత్తించి విజయం సాధించారు. సైనిక లేదా ప్రభుత్వ అనుభవం లేని ఏకైక అమెరికా అధ్యక్షుడిగా నిలిచారు. గెలిచిన తర్వాత చైనా వ్యతిరేక కార్యకలాపాలతో వివాదాల్లో నిలిచారు. అతని అనేక వ్యాఖ్యలను, చర్యలను జాతి వివక్ష, జాత్యహంకార, స్త్రీ ద్వేషపూరితంగా చాలా మంది పరిగణించారు. ఇక, 2020లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ సమయంలో ట్రంప్ మద్ధతుదారులు వైట్‌హౌస్‌పై చేసిన దాడి అమెరికా చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయింది.

ఓటమి తర్వాత ట్రంప్ గెలుపు కోసం చాలా శ్రమ పడ్డారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. అయినా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. 78 సంవత్సరాల వయసులోనూ ట్రంప్ అకుంఠిత దీక్ష, పట్టుదల, విజయం కోసం చేసిన పోరాటం అనన్య సామాన్యం అనే చెప్పాలి. కమలా హ్యారిస్ వంటి బలమైన ప్రత్యర్థి ఎదురైనా ఆయన భీకరంగా పోరాడారు. వైవిధ్యంగా, తనకు మాత్రమే సాధ్యమయ్యే రీతిలో ఎన్నికల ప్రచారాన్ని సాగించారు. మరోసారి అమెరికా వైట్‌హౌస్‌లోకి ఎంటర్ కాబోతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 06 , 2024 | 01:50 PM