Share News

వరదలకు నేపాల్‌ అతలాకుతలం

ABN , Publish Date - Sep 30 , 2024 | 05:21 AM

నేపాల్‌లో వరద బీభత్సం కొనసాగుతోంది. భారీ వరదల ధాటికి ఇప్పటి వరకు 170 మంది ప్రాణాలు కోల్పోయారు. 101 మంది గాయపడ్డారు. 56 మంది ఆచూకీ దొరకడంలేదని ఆదివారం అధికారులు తెలిపారు.

వరదలకు నేపాల్‌ అతలాకుతలం

  • 170కి పెరిగిన మృతుల సంఖ్య

  • 101 మందికి గాయాలు.. 56 మంది గల్లంతు

  • ధాడింగ్‌ జిల్లాలో బస్సుపై కొండచరియలు పడి 19 మంది మృత్యువాత

  • మరో చోట ఆరుగురు ఫుట్‌బాల్‌ ఆటగాళ్ల మృతి

కఠ్మాండూ, సెప్టెంబరు 29: నేపాల్‌లో వరద బీభత్సం కొనసాగుతోంది. భారీ వరదల ధాటికి ఇప్పటి వరకు 170 మంది ప్రాణాలు కోల్పోయారు. 101 మంది గాయపడ్డారు. 56 మంది ఆచూకీ దొరకడంలేదని ఆదివారం అధికారులు తెలిపారు. గురువారం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్‌, కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. ఆస్తి, ప్రాణ నష్టం భారీగా సంభవిస్తోంది. భీకర వానలకు కఠ్మాండూ లోయ తీవ్రంగా ప్రభావితమైంది. వర్షాలకు భాగమతి నది అత్యంత ప్రమాదకర స్థాయిలో పొంగిపొర్లుతోంది.

ఇక్కడ కొండచరియలు విరిగిపడి 43 మంది చనిపోయారని, 322 ఇళ్లు, 16 బ్రిడ్జిలు నేలమట్టమైనట్లు అధికారులు తెలిపారు. కఠ్మాండూలో ఈ స్థాయి వరదలు రావడం 45 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ధాడింగ్‌ జిల్లాలో బస్సుపై కొండచరియలు విరిగిపడి కనీసం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. భత్కపుర్‌లో ఓ ఇల్లు నేలమట్టం కావడంతో ఐదుగురు సజీవసమాధి అయ్యారు. మక్వంపుర్‌లోని ఫుట్‌బాల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో కొండచరియలు విరిగిపడి ఆరుగురు ఆటగాళ్లు మృత్యువాత పడ్డారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసు, ఆర్మీ సిబ్బంది మూడు వేలకు పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వరదల కారణంగా దేశంలో చాలా వరకు జాతీయ రహదారులను మూసివేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 20వేల మందితో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోందని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు నేపాల్‌ అధికార ప్రతినిధి బిస్వో అధికారి మీడియాకు తెలిపారు. కాగా, ఇప్పటికే దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Updated Date - Sep 30 , 2024 | 05:21 AM