US Election Result: అగ్రరాజ్యం అమెరికాను పాలించే అధ్యక్షుడి జీతం ఎంతో తెలుసా
ABN , Publish Date - Nov 06 , 2024 | 12:23 PM
అమెరికా ప్రెసిడెంట్ జీతం ఎంత ఉంటుంది?. ఎలాంటి ప్రయోజనాలు అందుతాయి? వంటి సందేహాలు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వ్యక్తమవుతున్నాయి. అగ్రరాజ్యాన్ని పరిపాలించే వ్యక్తికి భారీ జీతం ఉంటుందా ? అనే సందేహాలను తీర్చుకోవాలంటే ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే.
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మేజిక్ ఫిగర్ 270 ఎలక్టోరల్ ఓట్ల దిశగా దూసుకెళ్తున్నారు. పోటాపోటీ ఖాయమని అనుకున్నప్పటికీ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ అనూహ్యంగా వెనుకబడ్డారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు గెలుస్తారు సరే... మరి అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నికైన వారి జీతం ఎంత ఉంటుంది?. ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు? వంటి సందేహాలు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వ్యక్తమవుతున్నాయి.
అగ్రరాజ్యాన్ని పరిపాలించే వ్యక్తి జీతం ఎంత ఉంటుందనే సందేహం మీకు కూడా ఉందా?. అయితే ఆసక్తికరమైన ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. అమెరికా అధ్యక్షుడి వార్షిక వేతనం 400,000 డాలర్లుగా ఉంటుంది. భారతీయ కరెన్సీలో ఈ విలువ సుమారు రూ.3.36 కోట్లుగా ఉంటుంది. జీతంతో పాటు అధికారిక విధుల నిర్వహణకు అవసరమైన ఖర్చుల నిమిత్తం ఏడాదికి మరో 50,000 డాలర్లు (దాదాపు రూ.42 లక్షలు) అందిస్తారు. వినోదం, ఆతిథ్యాల కోసం ఈ అదనపు నిధులనే ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇతర అధికారిక బాధ్యతల నిర్వహణకు అవసరమైన డబ్బును కూడా ఇందులోనే ఉపయోగించుకోవాలి. గత 20 ఏళ్లుగా అమెరికా ప్రెసిడెంట్‌కు ఇదే జీతం కొనసాగుతోంది.
కాగా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు, వైట్‌హైస్‌లోకి అడుగుపెట్టేటప్పుడు, తన ఆఫీస్‌ను పునర్నిర్మాణం వంటి ఆరంభ ఖర్చుల కోసం 1,00,000 డాలర్లు (సుమారు రూ.84 లక్షలు) నూతన అధ్యక్షుడికి అందిస్తారు. వైట్‌హౌస్‌ను తన కార్యాలయంగా మార్చుకోవడానికి అవసరమైన పనుల కోసం ఈ మొత్తాన్ని కేటాయిస్తారు.
అమెరికా అధ్యక్షుల జీతం హిస్టరీ ఇదే..
అమెరికా మొట్టమొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ ఏడాదికి కేవలం 2,000 డాలర్లు జీతంగా పొందారు. అయితే 18వ శతాబ్దంలో ఈ జీతం ఎక్కువ విలువైనదిగానే పరిగణిస్తారు. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ సంపదలో వృద్ధి, అధ్యక్షుల ఖర్చులు పెరిగిపోవడంతో జీతం కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది.
ఎప్పుడు ఎంత జీతం?
1789లో 25,000 డాలర్లు
1873లో 50,000 డాలర్లు
1909లో 75,000 డాలర్లు
1949లో 100,000 డాలర్లు
1969లో 200,000 డాలర్లు
2001లో 400,000 డాలర్లు.
బుష్ హయాంలో చివరిపెంపు..
చివరిగా జార్జ్ బుష్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జీతాలు పెరిగాయి. ఆ తర్వాత గత 23 ఏళ్లలో ఒక్కసారి కూడా జీతం పెరగలేదు. అయితే ప్రెసిడెంట్‌గా సౌకర్యాలు, ప్రోత్సాహకాలు పొందుతున్నారు. విలాసవంతమైన నివాసం, ప్రయాణ అధికారాలు, ప్రపంచ స్థాయి భద్రతను కల్పిస్తున్నారు. వైట్‌హౌస్ నివాసంతో పాటు విశ్రాంతి కోసం ప్రత్యేక ఆతిథ్యాలు కల్పిస్తుంటారు. ప్రెసిడెంట్ వినోదం కోసం ఏడాదికి 19,000 డాలర్ల ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తారు. ఇందులో ప్రముఖులకు ఆతిథ్యం ఇవ్వడం, ఈవెంట్‌లు నిర్వహించడం, ప్రత్యేక వంటలు వంటి వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తుంటారు. ఇక ప్రెసిడెంట్ ఆరోగ్యం, వైద్య సంరక్షణ కోసం ప్రత్యేకంగా వైద్యులను కూడా కేటాయిస్తారు.
ఇవి కూడా చదవండి
అమెరికా ఎన్నికల ఫలితాల ట్రెండ్ ఇదే.. డెమొక్రాట్లకు బైడెన్ అభినందనలు
అమెరికా ఎన్నికల వేళ విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికాలో ఎన్నికల కౌంటింగ్ మొదలు.. లీడ్‌లో ఎవరు ఉన్నారంటే
దేశీయ మార్కెట్లపై అమెరికా ఎన్నికల ఫలితాల ప్రభావం
ఐపీఎల్ వేలంలో పేర్లు నమోదు చేసుకున్న ఆటగాళ్ల లిస్ట్ ఇదే
For more International News and Telugu News