Share News

Fact Check: బంకర్‌లోకి పరుగు తీసిన ఇజ్రాయెల్ ప్రధాని.. ఈ వీడియో నిజమేనా

ABN , Publish Date - Oct 02 , 2024 | 04:17 PM

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్‌లోకి పరిగెడుతున్నారంటూ ఆ వీడియో క్లిప్‌లకు క్యాప్షన్ ఇచ్చి ఉంది. నెతన్యాహు పరుగు తీయడం వీడియోలో కనిపించింది.

Fact Check: బంకర్‌లోకి పరుగు తీసిన ఇజ్రాయెల్ ప్రధాని.. ఈ వీడియో నిజమేనా
Benjamin Netanyahu

హమాస్ (Hamas) చీఫ్ ఇస్మాయిల్ హనియే, హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా మరణాలకు ప్రతీకారంగా మంగళవారం రాత్రి ఇజ్రాయెల్‌పై (Israel) ఇరాన్ (Iran) క్షిపణి దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. దాదాపు 200 వరకు క్షిపణులను ప్రయోగించింది. వాటిలో కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్ గగనతలంలోకి ప్రవేశించాయి. దీంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ సైరన్‌లు మోగించింది. బంకర్లలోకి వెళ్లాలంటూ పౌరులకు సూచించింది. కాగా ఇరాన్ దాడులకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్‌లోకి పరిగెడుతున్నారంటూ ఆ వీడియో క్లిప్‌లకు క్యాప్షన్ ఇచ్చి ఉంది. నెతన్యాహు పరుగు తీయడం వీడియోలో కనిపించింది.


ఇరాన్ అనుకూల సోషల్ మీడియా పేజీల్లో ఈ వీడియోకు సంబంధించిన పోస్టులు విపరీతంగా కనిపిస్తున్నాయి. ఇరాన్ ప్రతిస్పందనను చూసి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు బంకర్‌లోకి పారిపోతున్న క్షణాలు ఇవంటూ ఒక నెటిజన్ క్యాప్షన్ ఇచ్చాడు. ‘దయచేసి ఎవరైనా బెంజమిన్ నెతన్యాహు దాక్కోవడానికి చోటు ఇవ్వండి. పాపం కనీసం ఆయన పరిగెత్తలేకపోతున్నారు. ఏదేమైనా బంకర్‌లో దాక్కొని ఆయన ప్రాణాలు కాపాడుకున్నాడు. కానీ దేశ పౌరుల భద్రతను వారికే వదిలేశాడు’’ అని మరో వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు.


అయితే ఫ్యాక్ట్ చెక్‌లో ఈ వీడియోకు సంబంధించిన అసలు నిజం బయటపడింది. ఈ వీడియో కనీసం మూడు సంవత్సరాల క్రితం నాటిదని తేలింది. 2021లోనే ఆ వీడియో ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ అయినట్టు నిర్ధారణ జరిగింది. ఇక ఆ వీడియోలో బెంజమిన్ నెతన్యాహు పరిగెత్తుతున్న విషయానికి వస్తే.. ఇజ్రాయెల్ పార్లమెంట్ భవనం కారిడార్‌ గుండా ఆయన పరిగెత్తినట్టు తేలింది. అయితే ఆయన ఏ సందర్భంలో, ఎందుకు పరిగెత్తారనేది తెలియరాలేదు. కానీ ఆయన ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో పరిగెత్తలేదని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది.


ఇదిలావుంచితే.. ఇరాన్ క్షిపణి దాడిపై బెంజిమాన్ నెతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ అతిపెద్ద తప్పు చేసిందని ఆయన అభివర్ణించారు. ఈ దాడికి ఇరాన్ మూల్యం చెల్లించుకుంటుందని తీవ్రంగా హెచ్చరించారు. ‘‘ ఈ రాత్రి (మంగళవారం) ఇరాన్ పెద్ద తప్పు చేసింది. దానికి మూల్యం చెల్లించుకుంటుంది. మాపై ఎవరు దాడి చేసినా మేము వారిపై కచ్చితంగా దాడి చేస్తాం’’ అని అన్నారు. కాగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేయడం ఏడాది వ్యవధిలో ఇది రెండవసారి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒకసారి క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా సాయంతో ఆ క్షిపణులను ఇజ్రాయెల్ కూల్చివేసింది. ఆ సమయంలో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

Updated Date - Oct 02 , 2024 | 04:27 PM