US President Elections Result 2024: డొనాల్డ్ ట్రంప్‌కు వెల్లువెత్తిన అభినందనలు
ABN , Publish Date - Nov 06 , 2024 | 02:47 PM
అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. దీంతో ఆయనకు వివిధ దేశాధ్యక్షుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. 47వ దేశాధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. జనవరిలో దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
వాషింగ్టన్, నవంబర్ 06: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రపంచ దేశాల నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆ క్రమంలో యూఎస్ దేశాధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు చేపట్టనున్నడొనాల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమన్ నెతన్యాహూ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. డొనాల్డ్ ట్రంప్‌తోపాటు మెలానియా ట్రంప్‌కు ఆయన అభినందనలు చెప్పారు. వైట్‌హౌస్‌లోకి మీ పునరాగమనం చారిత్రాత్మకం. ఇది అమెరికా కొత్త శకాన్ని అందిస్తుందని ఆకాంక్షించారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు మరింత నిబద్దతతో కలిసి పని చేస్తాయని పేర్కన్నారు. ఇది గొప్ప విజయమని బెంజిమన్ నెతన్యాహూ స్పష్టం చేశారు.
అలాగే ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రొన్ సైతం డొనాల్డ్ ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మీతో కలిసి నాలుగేళ్లు పని చేసేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు ఫ్రెంచ్ అధ్యక్షుడు చెప్పారు. గౌరవం, ఆశయంతోపాటు శాంతి, శ్రేయస్సు కోసం అంటూ ఆయన పేర్కొన్నారు. ఇక ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ సైతం డొనాల్డ్ ట్రంప్ ఘన విజయంపై స్పందించారు. అందరినీ ఆకట్టుకునేలా ఆయన ఘన విజయం సాధించారన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ట్రంప్‌తో తాను సమావేశమయ్యానని ఈ సందర్భంగా జెలెన్‌స్కీ గుర్తు చేసుకున్నారు. ఈ భేటీలో యూఎస్, ఉక్రెయిన్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, ఈ ఎన్నికల్లో విజయం సాధించడంతోపాటు ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు ముగింపు పలికే అంశాలపై చర్చింమని చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు.
అమెరికా దేశాధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5వ తేదీన జరిగాయి. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ మధ్య ప్రదాన పోటీ నెలకొంది. ఆ క్రమంలో వీరిద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటా పోటీ ఏర్పడింది. అయితే పలు పోలింగ్ సర్వేలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి.
ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశ ఓటర్లు పట్టం కట్టారు. మరోవైపు ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్‌పై పలు మార్లు హత్యాయత్నాలు జరిగాయి. వాటి నుంచి ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ గెలుపొందిన విషయం విధితమే.
For International News And Telugu News