భారత్ వరం ఇరాన్ శాపం
ABN , Publish Date - Sep 29 , 2024 | 03:53 AM
హమాస్‌తో యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రసంగించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఐరాస సమావేశంలో నెతన్యాహు
సెప్టెంబరు 28 : హమాస్‌తో యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రసంగించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సర్వసభ్య సమావేశంలో ప్రసంగం సందర్భంగా... ఆయన రెండు చేతుల్లో రెండు మ్యాపులను ప్రదర్శించారు. కుడి చేతిలో ‘శాపం’ అని రాసి ఉన్న మ్యాప్‌లో ఇరాన్, ఇరాక్, సిరియా, యెమెన్ దేశాలుండగా అవి నలుపు రంగులో ఉన్నాయి. అలాగే ఎడమ చేతిలో ‘వరం’ అని రాసి ఉన్న మ్యాప్‌లో ఆకుపచ్చ రంగులో భారత్‌తో పాటు ఈజిప్టు, సుడాన్, సౌదీ అరేబియా దేశాలున్నాయి.
ఇవి ఇజ్రాయెల్‌తో సన్నిహిత సంబంధాలున్న దేశాలు కావడం విశేషం. అయితే రెండు మ్యాపుల్లోనూ పాలస్తీనా ఆనవాళ్లు కూడా లేకపోవడం గమనార్హం. కాగా, ప్రస్తుత ఘర్షణలకు ఇరాన్, దాని మిత్రదేశాలే కారణమని నెతన్యాహు పేర్కొన్నారు. పశ్చిమాసియాను అస్థిరపరిచేందుకు హమాస్, హిజ్బొల్లా, హౌతీలకు టెహ్రాన్ ఆర్థికంగా సహకరిస్తోందని ఆరోపించారు. ‘‘మీరు దాడి చేస్తే తిరిగి మేము ప్రతిదాడి చేస్తామ’’ని ఇరాన్‌ను హెచ్చరించారు. భారత్‌తో ఇజ్రాయెల్‌కు ఉన్న సత్సంబంధాలకు సూచికగానే నెతన్యాహు వరం అనే మ్యాపులో దాన్ని చూపినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య సాంకేతిక, రక్షణ రంగాల్లో వాణిజ్య సంబంధాలు బలపడ్డాయి.