Jerusalem : ఇజ్రాయెల్-హమాస్ చర్చలు విఫలం
ABN , Publish Date - Aug 27 , 2024 | 05:21 AM
ఇజ్రాయెల్-హమా్‌సల మధ్య గత పది నెలలుగా సాగుతున్న భీకర యుద్ధానికి ముగింపు పలికేలా ఇరు దేశాల మధ్య చర్చలకు శ్రీకారం చుట్టినా ఏమాత్రం ఫలించలేదు.
కాల్పుల విరమణ, బందీల విడుదలపై కైరోలో చర్చలు
ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగింపు.. ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తప్పదన్న ఇరాన్
జెరుసలేం, ఆగస్టు 26: ఇజ్రాయెల్-హమా్‌సల మధ్య గత పది నెలలుగా సాగుతున్న భీకర యుద్ధానికి ముగింపు పలికేలా ఇరు దేశాల మధ్య చర్చలకు శ్రీకారం చుట్టినా ఏమాత్రం ఫలించలేదు. కాల్పుల విరమణ, బందీల విడుదల వంటి కీలక అంశాలు సహా ఇతర అంశాలపై ఈజిప్టు రాజధాని కైరోలో చేపట్టిన చర్యలు విఫలమయ్యాయి.
ఆదివారం ఇరు పక్షాలు ఎలాంటి తుది ఒప్పందం చేసుకోకుండానే చర్చలు ముగించాయి. ఈ చర్చలు వారాంతాల్లో కొనసాగుతాయని, ఇజ్రాయెల్, హమా్‌సలకు మధ్యవర్తులుగా ఉన్న అమెరికా, ఖతార్, ఈజిప్ట్ బృందాలతో ద్వితీయ శ్రేణి బృందం కైరోలోనే చర్చలు జరుపుతుందని అమెరికాకు చెందిన ఓ అధికారి తెలిపారు. గత గురువారం ప్రారంభమైన చర్చలు ఆదివారం వరకు సాగాయని, ఈ చర్చలు నిర్మాణాత్మకంగా ఉండడంతోపాటు తుది ఆచరణయోగ్యమైన ఒప్పందాలను చేరుకునే దిశగా సాగాయని వివరించారు.
అయితే ఈ చర్చలు అర్ధంతరంగా ముగియడానికి ఆదివారం ఇజ్రాయెల్, లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బొల్లా మధ్య యుద్ధం మరింత భీకరంగా మారడేమనని అమెరికా అధికారి తెలిపారు. ఇదిలావుంటే..
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాత్రం.. యుద్ధం ముగిసిపోలేదని నొక్కి చెప్పారు. కాగా ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుని తీరతామని ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘి పేర్కొన్నారు. టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారం కచ్చితంగా ఉంటుందన్నారు.
ఎర్ర సముద్రంలో ట్యాంకర్‌కు నిప్పు
ఎర్ర సముద్రంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. గ్రీక్ జాతీయ పతాకంతో ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్‌పై యెమన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు నిప్పుపెట్టారు.
ఈ దాడిలో 1.5 లక్షల టన్నుల క్రూడ్ ఆయిల్ ఉన్న చమురు ట్యాంకర్ కాలిపోయింది. అయితే ట్యాంకర్ నుంచి భారీ ఎత్తున చమురు లీక్ కాలేదని, గత కొన్ని వారాల్లో ఇదే అతిపెద్ద దాడి అని యూరోపియన్ యూనియన్‌కు చెందిన నౌకా కమాండ్ సోమవారం తెలిపింది. చమురు ట్యాంకర్ ధ్వంసంతో రూ.లక్ష కోట్ల వ్యాపారం దెబ్బతిందని పేర్కొంది.