Kim Jong Un: అమెరికా, దక్షిణ కొరియాలను సర్వనాశనం చేస్తాం.. కిమ్ జోంగ్ ఉన్ వార్నింగ్
ABN , Publish Date - Jan 01 , 2024 | 09:33 PM
అమెరికా, దక్షిణ కొరియాలపై నిత్యం నిప్పులు చెరిగే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. తాజాగా ఆ రెండు దేశాలకు ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఒకవేళ ఆ రెండు దేశాలు మిలిటరీ ఘర్షణను ప్రారంభిస్తే..
Kim Jong Un: అమెరికా, దక్షిణ కొరియాలపై నిత్యం నిప్పులు చెరిగే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. తాజాగా ఆ రెండు దేశాలకు ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఒకవేళ ఆ రెండు దేశాలు మిలిటరీ ఘర్షణను ప్రారంభిస్తే.. ఏమాత్రం సంకోచించకుండా ఆ దేశాల్ని సర్వనాశనం చేయాలని తన ఉన్నత సైనికాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏమాత్రం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా.. శత్రువులపై దాడులు చేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. న్యూ ఇయర్ సందర్భంగా ప్యోంగ్‌యాంగ్‌లో ఉత్తర కొరియా ప్రధాన కమాండింగ్ అధికారులతో జరిగిన సమావేశం సందర్భంగా.. ఈ మేరకు కిమ్ జోంగ్ ఉన్ వ్యాఖ్యలు చేసినట్లు ఆ దేశ జాతీయ మీడియా ‘కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ’ (కేసీఎన్ఏ) నివేదించింది.
‘‘ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. దక్షిణ కొరియాతో మనకున్న సంబంధాలపై స్పష్టత ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఒకవేళ అమెరికా, దక్షిణ కొరియా సైనిక ఘర్షణకు ప్రయత్నించినా, కనీసం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా.. మా వద్ద ఉన్న అణ్వాయుధాలు వాడేందుకు కూడా వెనుకాడబోం. శత్రువుల్ని పూర్తిగా అణచివేయడానికి మా సైన్యం అన్ని మార్గాల్లోనూ ప్రయత్నం చేస్తుంది. మా దేశాన్ని ప్రధాన శత్రువుగా ప్రకటించి.. మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు అవకాశం కోసం చూస్తున్న ప్రజలతో మేము ఎలాంటి సంబంధాలను కొనసాగించం’’ అని కిమ్ జోంగ్ ఉన్ స్పష్టం చేశారు. మరి.. ఈ హెచ్చరికలపై ఆ రెండు దేశాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తిగా మారింది. అంతకుముందు ‘ఇయర్-ఎండ్’ పార్టీ సమావేశంలోనూ.. కొరియా ద్వీపకల్పంలో ఎప్పుడైనా యుద్ధం జరగొచ్చని, అందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అమెరికా వివిధ రకాల సైనిక ముప్పుని కూడా కలిగిస్తోందని ఆయన ఆరోపించారు.
ఇదిలావుండగా.. 1953 నుంచి విడిచిపోయిన ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఇక కిమ్ జోంగ్ ఉన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్రిక్త వాతావరణం తారాస్థాయికి చేరింది. ఇప్పుడు కిమ్ చేసిన తాజా ప్రకటనలతో.. ఈ రెండు దేశాల మధ్య సంధి కుదరడం దాదాపు అసాధ్యమని తేలిపోయింది. ఒకవేళ దక్షిన కొరియా పాలకులు భవిష్యత్తులో శాంతి ప్రతిపాదనలు చేసినా.. ఉత్తర కొరియా వాటిని తిరస్కరించడం ఖాయంలా కనిపిస్తోంది.