Share News

Ajahn Siripanyo: రూ. 40 వేల కోట్ల సామ్రాజ్యాన్ని వదిలి.. వీధుల్లో భిక్షమెత్తుకుంటున్న బిలియనీర్ కొడుకు

ABN , Publish Date - Nov 26 , 2024 | 08:41 PM

అతడికి 18 ఏళ్లున్నప్పుడు సరదా కోసం చేసిన పని మొత్తం జీవితాన్నే మలుపు తిప్పింది. వేల కోట్లకు వారసుడైనా.. రోజూ భిక్షాటన చేస్తూ పొట్ట నింపుకుంటున్నాడు. ఇతడిలా మారడం వెనుక ఓ ఆసక్తికర కథనం ఉంది..

Ajahn Siripanyo: రూ. 40 వేల కోట్ల సామ్రాజ్యాన్ని వదిలి.. వీధుల్లో భిక్షమెత్తుకుంటున్న బిలియనీర్ కొడుకు
Ajahn Siripanyo

మలేషియాకు చెందిన బిలియనీర్ ఆనంద్ కృష్ణ ఏకైక కుమారుడు వెన్ అజాన్ సిరిపన్యో. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి అతడి సొంతం. చిటికేస్తే వచ్చి వాలే నౌకర్లు. లెక్కలేనన్ని వ్యాపారాలు. నిత్యం విందులు వినోదాలతో తులతూగే కుటుంబం. ఈ విలాసాలన్నీ త్యాగం చేసి నిత్యం జోలె పట్టుకుని భిక్షాటన చేస్తున్నాడు.


సరదా కోసం సన్యాసిగా..

18 ఏళ్ల వయసులో రాజవంశీకురాలైన తన తల్లి కుటుంబానికి నివాళులర్పించేందుకు అజాన్ థాయిలాండ్ వెళ్లాడు. అదే అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడి బౌద్ధ భిక్షువులను చూసి సరదా కోసం సన్యాసిగా మారాలనుకున్నాడు. కానీ, నిజంగానే సన్యాసం వైపు ఆకర్షితుడై ఏకంగా రూ. 40 వేల కోట్ల సామ్రాజ్యాన్ని వదులుకున్నాడు. తన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఇవన్నీ అడ్డుగా భావించిన అజాన్ ఇంటి నుంచి దూరంగా వచ్చేశాడు. ప్రాపంచిక ఆస్తుల నుంచి విడిపోయి బౌద్ధమతాన్ని స్వీకరించి ధార్మిక కార్యక్రమాల్లో మునిగితేలుతున్నాడు. ప్రస్తతుం పీఠాధిపతిగా థాయ్ ల్యాండ్- మయున్మార్ సరిహద్దుల్లో ప్రాంతంలో నివసిస్తున్నాడు.


సన్యాసే కానీ..

అజాన్ తన ఇద్దరు సోదరిమణులతో లండన్ లో పెరిగాడు. యూకేలో చదువు పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లిష్ తో సహా మొత్తం ఎనిమిది భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. సన్యాసిగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడూ తన తండ్రిని కలిసేందుకు ప్రైవేట్ జెట్ లో వెళ్తుంటాడని పలువురు చెప్తుంటారు.


అజాన్ తండ్రి ఎవరో కాదు..

అజాన్ తండ్రి కృష్ణన్.. మలేషియాలోనే మూడో అత్యంత ధనవంతుడిగా ఇతడకి పేరు. తమిళనాడుకు చెందిన ఈ వ్యాపారవేత్త గతంలో ఎయిర్ సెల్ పేరుతో టెలికం రంగంలో ప్రఖ్యాతిగాంచాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. శాటిలైట్, మీడియా, రియల్ ఎస్టేట్, చమురు, గ్యాస్ వంటి సంస్థలను రన్ చేస్తూ బిజినెస్ టైకూన్ గా ఎదిగాడు. ఇంత సంపద ఉన్నా తన కొడుకును పోషించలేని అసమర్థుడినంటూ ఆయన ఓ సందర్భంలో అన్నారట.

Updated Date - Nov 26 , 2024 | 08:41 PM