పెంపుడు సింహానికి ఖైదీలే ఆహారం
ABN , Publish Date - Dec 15 , 2024 | 04:34 AM
దేశం విడిచి పారిపోయిన సిరియా అధ్యక్షుడు బషర్ అల్- అసద్ పాలనలో కొనసాగిన అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
ఒక్కొక్కటిగా బయటకు అసద్ పాలనలోని అకృత్యాలు
అసద్ టైగర్ ఫోర్స్ కీలక అధికారికి బహిరంగ ఉరి
డమాస్కస్, డిసెంబరు 14: దేశం విడిచి పారిపోయిన సిరియా అధ్యక్షుడు బషర్ అల్- అసద్ పాలనలో కొనసాగిన అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అసద్ ఇంటిలిజెన్స్ విభాగం ‘టైగర్ ఫోర్స్’లో కీలక అధికారి అయిన తలాక్ దక్కాక్.. ఖైదీలను తీసుకెళ్లి తన పెంపుడు సింహాలకు ఆహారంగా వేసేవాడనే విషయం బయటకు వచ్చింది. తాజాగా తిరుగుబాటుదారులు అతడిని పట్టుకుని సిరియా పశ్చిమ ప్రాంతంలోని హమా పట్టణంలో బహిరంగంగా ఉరితీసినట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారికి ప్రకటన వెలువడలేదు. ట్యాక్సీ డ్రైవర్ అయిన తలాక్ దక్కాక్ అసద్ ప్రభుత్వంలో చేరి కీలక నేతగా ఎదిగాడు. తన ఆధీనంలో పనిచేసే దాదాపు 1500 మందిని అడ్డుపెట్టుకుని అసద్ అండదండలతో సొంతంగా నేర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. తన అధికారాన్ని ఉపయోగించుకుని 2005లో జూ నుంచి ఓ సింహాన్ని తీసుకొచ్చాడు. తనకు ఎదురుతిరిగిన వాళ్లను ఆ సింహానికి ఆహారంగా వేసేవాడట.