Donald Trump: అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్.. భారత్-యూఎస్ బంధాలు ఎలా ఉంటాయి
ABN , Publish Date - Nov 06 , 2024 | 01:54 PM
తొలి దఫా అధ్యక్షుడిగా పనిచేసిన నాటి నుంచి తాజా ఎన్నికల వరకు ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతో డొనాల్డ్ ట్రంప్ పనిచేశారు. అమెరికా విదేశాంగ విధానాన్ని ధృఢంగా పునరుద్ధరించుతానంటూ ప్రచార సమయంలోనే గట్టిగానే చెప్పారు. మరి ట్రంప్ 2.0 ప్రభుత్వం భారత్-అమెరికా బంధాలను ఏవిధంగా ప్రభావితం చేస్తుందో చూడాలి.
ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూసిన అమెరికా ఎన్నికలు-2024 ఫలితాలు వచ్చేశాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారు. మరి ట్రంప్ రెండవ దఫా పరిపాలనలో భారత్-అమెరికా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి?, ప్రతికూలతలు ఏంటి, అవరోధాలు ఏమిటి? ఏయే అంశాలు ప్రభావితం కాబోతున్నాయి? అనే చర్చలు, విశ్లేషణలు ఊపందుకున్నాయి.
తొలి దఫా అధ్యక్షుడిగా పనిచేసిన నాటి నుంచి తాజా ఎన్నికల వరకు ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతో డొనాల్డ్ ట్రంప్ పనిచేశారు. అమెరికా విదేశాంగ విధానాన్ని ధృఢంగా పునరుద్ధరించుతానంటూ ప్రచార సమయంలోనే గట్టిగానే చెప్పారు. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ మధ్య స్నేహబంధం ఉంది. ‘హౌడీ, మోడీ!’, ‘నమోస్తే మోదీ’ వంటి ఈవెంట్‌లలో మోదీతో పాటు ట్రంప్ కూడా స్వయంగా పాల్గొన్నారు. ట్రంప్ గత పాలనలో భారత్-అమెరికా సంబంధాలు బలంగానే ఉన్నాయని వీటిని బట్టి చెప్పవచ్చు. మరి ట్రంప్ 2.0 పాలనలో అవకాశాలతో పాటు సవాళ్లు కూడా ఎదురుకావచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అమెరికాకు ప్రధాన వ్యూహాత్మక భాగస్వామి అయిన ఇండియాకు వాణిజ్యం, ఇమ్మిగ్రేషన్, సైనిక సహకారం, దౌత్యం వంటి అంశాల్లో ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి.
భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు
అమెరికా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ తన విదేశాంగ విధానం ఉంటుందని ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పారు. మొదటి దఫా పాలనలో పలు కీలకమైన అంతర్జాతీయ ఒప్పందాల నుంచి వైదొలగారు. ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతో పనిచేసిన ఆయన.. పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికాను నిష్క్రమింపజేశారు. ఇరాన్ అణు ఒప్పందంతో పాటు కీలక అంతర్జాతీయ ఒప్పందాలకు కూడా విలువ ఇవ్వలేదు. మరికొన్ని ముఖ్యమైన ఒప్పందాలను సవరించారు. దీంతో రెండవ ట్రంప్ దఫా పాలనలో విదేశాంగ విధానాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.
ఒప్పందాలు, పొత్తుల విషయంలో ట్రంప్ ప్రతికూల నిర్ణాయలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని టాక్ వినిపిస్తోంది. భారత్ విషయానికి వస్తే అమెరికాతో వాణిజ్యం బంధం చాలా ముఖ్యమైనది. విదేశీ ఉత్పత్తులపై భారత్ అత్యధిక సుంకాలను విధిస్తోందంటూ గత పాలనలో ట్రంప్ ఆరోపించారు. పరస్పర పన్నును ప్రవేశపెట్టాలని కూడా ఆయన అన్నారు. తిరిగి అధికారంలోకి రావడంతో ఇప్పుడెలా వ్యవహరిస్తారో చూడాలి. ట్యాక్స్‌లు ఏమైనా ప్రవేశపెడతారా అనేది వేచిచూడాలి. ఇక భారత ఐటీ, ఫార్మాస్యూటికల్, టెక్స్‌టైల్స్ రంగాలు ఎక్కువగా అమెరికాపై ఆధారపడుతుంటాయి. వీటి విషయంలో ట్రంప్ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందో చూడాలి.
ఇమ్మిగ్రేషన్ ఎలా ఉంటుందో?
అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానం భారతీయులకు చాలా కీలకమైనది. ముఖ్యంగా హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌పై ఆధారపడి అక్కడ పనిచేస్తున్న ఐటీ నిపుణులపై ఇమ్మిగ్రేషన్ విధానం చాలా ప్రభావం చూపుతుంది. ట్రంప్ తన మొదటి దఫా పాలనలో విదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే వేతన పరిమితులు పెంచాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ పరిణామం భారతీయ ఐటీ నిపుణులు, టెక్ కంపెనీలకు సవాలుగా మారింది. డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధికారంలోకి రావడంతో ఈ నిబంధనలను ప్రవేశపెడితే అమెరికాలోని భారతీయ టెకీలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. నైపుణ్యం కలిగిన భారతీయ నిపుణులపై ఆధారపడే ఐటీ కంపెనీలు కూడా ప్రభావితం అవుతాయి.
సైనిక సంబంధాలు, రక్షణ సహకారం
భారత్-అమెరికా సంబంధాలలో రక్షణ, సైనిక సహకారం అంశాలు గత కొన్నేళ్లుగా మూలస్తంభాలుగా ఉన్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ (iCET), జెట్ ఇంజిన్‌ల తయారీకి జీఈ-హెచ్ఏఎల్ (GE-HAL) వంటి కీలకమైన రక్షణ ఒప్పందాలు ఇరు దేశాల మధ్య జరిగాయి. ఇక ట్రంప్ తదుపరి పాలన విషయానికి వస్తే.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కొనే విషయంలో భారత్-అమెరికా సైనిక సహకారాన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.
ఇక అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా సభ్య దేశాలుగా ఉన్న ‘క్వాడ్’ను ట్రంప్ హయాంలో మరింత బలోపేతం చేసే అవకాశాలున్నాయి. చైనాకు కౌంటర్‌గా క్వాడ్ బలోపేతం జరుగుతోంది. సభ్య దేశాల మధ్య ఆయుధ విక్రయాలు, సాంకేతికత బదిలీలు, ఉమ్మడి సైనిక విన్యాసాలు వంటి మరింత రక్షణ సహకారాన్ని ట్రంప్ 2.0 హయాంలో ఆశింవచ్చు. ఇక ఉగ్రవాద నిరోధం విషయంలో కూడా భారత లక్ష్యాలకు అనుకూలంగా ట్రంప్ ప్రభుత్వం పనిచేసే అవకాశాలు ఉన్నాయి.