Share News

గెలిపిస్తే కరెంటు చార్జీలు సగానికి తగ్గిస్తా!

ABN , Publish Date - Oct 12 , 2024 | 06:14 AM

ఎన్నికల్లో గెలిపిస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ఓటర్లపై అభ్యర్థులు, పార్టీలు వరాల వర్షం కురిపిస్తుంటాయి. ఈ హామీల ప్రచారం ఇప్పుడు అమెరికాకూ విస్తరించింది. తనకు మరోసారి అధికారం అప్పగిస్తే ఇంధనం (సహజవాయువు, బొగ్గు, అణుశక్తి, సౌరశక్తి) చార్జీలను, కరెంటు

గెలిపిస్తే కరెంటు చార్జీలు సగానికి తగ్గిస్తా!

ఏడాదిలోపే అమలు చేస్తా: ట్రంప్‌

మోదీ గొప్ప నాయకుడు.. నాకు మిత్రుడు

ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, అక్టోబరు 11: ఎన్నికల్లో గెలిపిస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ఓటర్లపై అభ్యర్థులు, పార్టీలు వరాల వర్షం కురిపిస్తుంటాయి. ఈ హామీల ప్రచారం ఇప్పుడు అమెరికాకూ విస్తరించింది. తనకు మరోసారి అధికారం అప్పగిస్తే ఇంధనం (సహజవాయువు, బొగ్గు, అణుశక్తి, సౌరశక్తి) చార్జీలను, కరెంటు చార్జీలను ఏడాదిలోపు సగానికి తగ్గిస్తానని అమెరికన్లకు ట్రంప్‌ హామీ ఇచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీ పడుతున్న ట్రంప్‌.. డెట్రాయిట్‌ ఎకనమిక్‌ క్లబ్‌లో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. తమ పార్టీ ఆర్థిక విధానాల గురించి ట్రంప్‌ వివరించారు. పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగిరపరిచి విద్యుదుత్పాదక సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తామన్నారు. దిగుమతులపై వివిధ దేశాలు విధిస్తున్న సుంకాలను ట్రంప్‌ ప్రస్తావించారు. ‘అన్నింటికన్నా ఎక్కువగా భారత్‌ దిగుమతి సుంకాలు విధిస్తోంది. కానీ, చిరునవ్వుతో చాలా మృదువుగా భారత్‌ ఆ పని చేస్తుంది’ అని వివరించారు. ప్రధాని మోదీని ట్రంప్‌ మరోసారి ప్రశంసించారు. ‘భారత్‌తో ముఖ్యంగా ఆ దేశ నాయకుడు మోదీతో నాకు మంచి అనుబంధం ఉంది. మోదీ గొప్ప నాయకుడు, ఇరుదేశాలను ఆయన సన్నిహితం చేశారు. ఆయన చేసిన పని చాలా గొప్పది’ అని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఓ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కూడా ట్రంప్‌.. మోదీపై పొగడ్తల వర్షం కురిపించారు. ‘మోదీ ప్రధాని కాకముందు భారత్‌లో తీవ్రమైన అస్థిర పరిస్థితులు నెలకొని ఉండేవి. ఏడాదికొకరు (ప్రధాని) మారుతూ ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మోదీ చాలా మంచి మనిషి. చూడటానికి మీ నాన్నలా ఉంటారు. కానీ, గొప్ప కార్యసాధకుడు (టోటల్‌ కిల్లర్‌) ’ అని తెలిపారు. భారత్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్న శక్తులను నిలువరించటానికి తాను సహాయం చేస్తానని గతంలో ఓసారి మోదీకి చెప్పగా.. ‘నేనే ఆ శక్తుల పని పడతా. అందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటా. గత వందలేళ్లుగా వారిని మేం ఓడిస్తూనే ఉన్నాం’ అని మోదీ చెప్పారని.. సరిగ్గా అదే జరిగిందని ట్రంప్‌ వెల్లడించారు. అయితే, ఆ శక్తులేమిటో తెలియజేయలేదు.

Updated Date - Oct 12 , 2024 | 06:14 AM