Air New Zealand: విమానంలో మహిళలకు చేదు అనుభవం.. లావుగా ఉన్నారనే నెపంతో..
ABN , Publish Date - Mar 19 , 2024 | 06:07 PM
ఏ ఎయిర్‌లైన్స్ అయినా తన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకే ప్రయత్నిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడమే లక్ష్యంగా పని చేస్తుంది. కానీ.. ఎయిర్ న్యూజిలాండ్ (Air New Zealand) సిబ్బంది మాత్రం ఇద్దరు మహిళల పట్ల అందుకు భిన్నంగా ప్రవర్తించింది. కేవలం లావుగా ఉన్నారన్న నెపంతో వారిని అన్యాయంగా కిందకు దించేసింది.
ఏ ఎయిర్‌లైన్స్ అయినా తన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకే ప్రయత్నిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడమే లక్ష్యంగా పని చేస్తుంది. కానీ.. ఎయిర్ న్యూజిలాండ్ (Air New Zealand) సిబ్బంది మాత్రం ఇద్దరు మహిళల పట్ల అందుకు భిన్నంగా ప్రవర్తించింది. కేవలం లావుగా ఉన్నారన్న నెపంతో వారిని అన్యాయంగా కిందకు దించేసింది. మార్చి 8వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. బాధితులు ఫిర్యాదు చేయడంతో ఆ విమానయాన సంస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఏంజెల్ హార్డింగ్ అనే మహిళ తన స్నేహితురాలితో కలిసి మార్చి 8వ తేదీన ఎయిర్ న్యూజిలాండ్‌కు చెందిన విమానంలో నేపియర్ నుంచి ఆక్లాండ్‌కు బయలుదేరారు. విమానం రన్‌వేపైకి చేరుకున్నప్పుడు.. ఒక ఫ్లైట్ అటెంటెండ్ నేరుగా ఏంజెల్ వద్దకు వచ్చి, సీట్ ఆర్మ్‌రెస్ట్‌ను కిందకు దించేందుకు ప్రయత్నించింది. ఎందుకని ఆమె ప్రశ్నించగా.. సరైన స్థితిలో కూర్చునేంత వరకు విమానం టేకాఫ్ చేయబోనని పైలట్ చెప్పాడని బదులిచ్చింది. ఈ క్రమంలో.. ఆ ఫ్లైట్ అటెండెంట్ తమ పట్ల అమర్యాదకరంగానూ, దురుసుగానూ వ్యవహరించిందని ఏంజెల్ పేర్కొంది. ఆ సమయంలో విమానం కదులుతోంది కాబట్టి, తమకు కేటాయించిన సీట్లలో కూర్చోబెట్టాలమని తాము కోరామని.. అప్పుడు ‘‘మిమ్మల్ని కిందకు దించేస్తాం’’ అని సిబ్బంది బెదిరించిందని.. దీంతో తాము షాక్‌కు గురయ్యామని బాధిత మహిళ తెలిపింది.
ఈ వివాదం కారణంగా విమానం తిరిగి బోర్డింగ్ ప్రదేశానికి తిరిగొచ్చిందని.. ‘అసౌకర్యం’ కారణంగా ప్రయాణికులు కిందకు దిగిపోవాలని విమాన సిబ్బంది కోరిందని ఏంజెల్ గుర్తు చేసుకుంది. అయితే.. తామిద్దరిని మాత్రం తిరిగి ఎక్కించుకోవడానికి విమాన సిబ్బంది అనుమతించలేదని ఆమె తెలిపింది. ఎందుకని ప్రశ్నిస్తే.. ‘‘ఒక్కొక్కరికి రెండు చొప్పున మీరిద్దరు నాలుగు సీట్లు బుక్ చేసుకోవాలి’’ అని ఫ్లైట్ అటెంటెండ్ బదులిచ్చిందని చెప్పింది. దాంతో.. తమ శరీర ఆకృతి, అధిక బరువు కారణంగానే తమను దించేశారని అర్థమైందని ఏంజెల్ వాపోయింది. తమకు ఎదురైన ఈ అవమానంపై బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో.. ఎయిర్ న్యూజిలాండ్ వారి టికెట్ డబ్బులు తిరిగిచ్చేసింది. అదే రోజు బస కల్పించడంతో పాటు వారికి క్షమాపణలు కూడా చెప్పింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి