రష్యాపై 9/11 తరహా దాడులు
ABN , Publish Date - Dec 22 , 2024 | 02:39 AM
రష్యాపై ఉక్రెయిన్ మరోసారి డ్రోన్లతో విరుచుకుపడింది. కజాన్ నగరంలోని నివాస భవనాలే లక్ష్యంగా దాడులు జరిపింది.
8 డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్
కజాన్, డిసెంబరు 21: రష్యాపై ఉక్రెయిన్ మరోసారి డ్రోన్లతో విరుచుకుపడింది. కజాన్ నగరంలోని నివాస భవనాలే లక్ష్యంగా దాడులు జరిపింది. ఎత్తైన నివాస సముదాయాలపై 8 డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసినట్లు గుర్తించామని అంతర్జాతీయ మీడియా సంస్థలు శనివారం తెలిపాయి. ఈ దాడులను 2001లో న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లను విమానాలు ఢీకొట్టిన 9/11 దాడులతో పోల్చాయి. శనివారం ఉదయం కజాన్ నగరంలోని నివాస సముదాయాల్లోకి 2 డ్రోన్లు దూసుకెళ్లి పేలిపోవడంతో మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. అలాగే ఉక్రెయిన్ ప్రయోగించిన మరో 6 డ్రోన్లను రష్యా గగనతల రక్షణ వ్యవస్థలు అత్యంత సమర్థంగా అడ్డుకున్నట్లు తెలిపింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.