Share News

US Exit Polls: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ప్రజాస్వామ్యానికి ముప్పు పైనే అమెరికా పౌరుల ఆందోళన..

ABN , Publish Date - Nov 06 , 2024 | 07:18 AM

డెమోక్రాట్ కమలా హ్యారిస్, రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ ఎన్నికల్లో అమెరికా పౌరులకు ప్రజాస్వామ్య పరిరక్షణ, ఆర్థిక అభివృద్ధి మొదలైనవి అతి ముఖ్యమైన అంశాలుగా నిలిచాయి. ఈ మేరకు ప్రాథమిక ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడించాయి.

US Exit Polls: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ప్రజాస్వామ్యానికి ముప్పు పైనే అమెరికా పౌరుల ఆందోళన..
US Elections Exit Polls

అమెరికా అధ్యక్ష ఎన్నికలను (US Elections) ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తికరంగా గమనిస్తోంది. డెమోక్రాట్ కమలా హ్యారిస్ (Kamala Harris), రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ ఎన్నికల్లో అమెరికా పౌరులకు ప్రజాస్వామ్య పరిరక్షణ, ఆర్థిక అభివృద్ధి మొదలైనవి అతి ముఖ్యమైన అంశాలుగా నిలిచాయి. ఈ మేరకు ప్రాథమిక ఎగ్జిట్ పోల్స్‌ (US Exit Polls) వెల్లడించాయి. పది మందిలో దాదాపు ఆరుగురు ప్రజాస్వామ్యమే తమ మొదటి ప్రాధాన్య అంశమని వెల్లడించినట్టు ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రాధాన్య అంశాల్లో ఆర్థిక వ్యవస్థ, అబార్షన్ వంటివి తదుపరి ప్రాధాన్యాలుగా ఉన్నాయి.


ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. 73 శాతం ఓటర్లు ప్రజాస్వామ్య పరిస్థితి పట్ల ఆందోళన వెలిబుచ్చారు. కేవలం 25 శాతం మంది మాత్రమే అమెరికాలో ప్రజాస్వామ్యం భద్రంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఆమోదం బాగా పడిపోయింది. 10 మందిలో నలుగురు మాత్రమే బైడెన్ పనితీరును ఆమోదించారు. ఈ ఎన్నికల్లో కమల హ్యారిస్, ట్రంప్ హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. హ్యారిస్ ప్రచారంలో ప్రజాస్వామ్యం, అబార్షన్లు, ఆర్థిక వ్యవస్థ ముఖ్యమైన అంశాలుగా నిలిచాయి. ట్రంప్ మద్ధతుదారులకు ఆర్థిక వ్యవస్థ, వలసలు, ప్రజాస్వామ్యం కీలకాంశాలుగా నిలిచాయి.


ఎన్‌బీసీ న్యూస్ ప్రకారం.. మొత్తం సర్వేలో 35 శాతం మంది ఓటర్లు ప్రజాస్వామ్య స్థితిని ప్రధాన సమస్యగా పరిగణిస్తున్నారు. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థను 31 శాతం మంది, అబార్షన్లను 14 శాతం మంది, వలసలను 11 శాతం మంది, విదేశీ విధానాన్ని 4 శాతం మంది పరిగణనలోకి తీసుకున్నారు. ఇక, 10 మందిలో ఆరుగురు అమెరికా భవిష్యత్తు పట్ల ఆశాజనకంగా ఉన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 06 , 2024 | 07:18 AM