Share News

WHO : ఎంపాక్స్‌కు తొలి టీకా

ABN , Publish Date - Sep 14 , 2024 | 05:57 AM

ఆఫ్రికా ఖండంలో ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తున్న ఎంపాక్స్‌ వ్యాధి నియంత్రణ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) మొట్టమొదటిసారిగా ఓ టీకాకు అనుమతినిచ్చింది.

WHO : ఎంపాక్స్‌కు తొలి టీకా

  • తయారు చేసిన బేవేరియన్‌ నార్డిక్‌ సంస్థ

  • 18 ఏళ్లు నిండిన వారికి ఇచ్చేందుకు డబ్ల్యూహెచ్‌వో తాజాగా అనుమతి

జెనీవా, సెప్టెంబరు 13: ఆఫ్రికా ఖండంలో ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తున్న ఎంపాక్స్‌ వ్యాధి నియంత్రణ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) మొట్టమొదటిసారిగా ఓ టీకాకు అనుమతినిచ్చింది. ఎంపాక్స్‌పై పోరులో ఇది కీలక ఘట్టంగా డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ అభివర్ణించారు. ఎంపాక్స్‌ టీకాను డెన్మార్క్‌కు చెందిన బేవేరియన్‌ నార్డిక్‌ అనే సంస్థ తయారు చేసింది. ఇది రెండు డోసుల వ్యాక్సిన్‌ అయితే, దీన్ని 18ఏళ్లు నిండినవారికే వేయాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. యునిసె్‌ఫలాంటి అంతర్జాతీయ సంస్థలు ఈ టీకాను కొని, పంపిణీ చేయవచ్చని తెలిపింది. కానీ, ప్రస్తుతం టీకాను ఒకే సంస్థ ఉత్పత్తి చేస్తున్నందున సరఫరా చాలా తక్కువగా ఉంది. మరోవైపు, ఎంపాక్స్‌ వ్యాధి పిల్లల్లోనే ఎక్కువగా విస్తరిస్తోంది. కాంగోలో గతవారం నమోదైన ఎంపాక్స్‌ కేసుల్లో 70%మంది 18ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఆఫ్రికా ఖండంలో గడిచిన వారంలో 3,160 ఎంపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. 107 మంది ఈ వైరస్‌ కారణంగా చనిపోయారు.

Updated Date - Sep 14 , 2024 | 05:57 AM