Delhi: ఊబకాయ భారత్.. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే..
ABN , Publish Date - Mar 01 , 2024 | 03:37 PM
భారత్‌లో ఊబకాయం(Obesity) బాధితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని ది లాన్సెట్ జర్నల్(The Lancet journal) ప్రచురించింది. దేశంలో ఊబకాయ బాధితుల్లో అత్యధికంగా చిన్నారులే ఉండటం ఆందోళనకర పరిణామమని నివేదిక వెల్లడించింది. 1990 నాటితో పోల్చితే 20వ దశాబ్దంలో ఊబకాయుల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందింది.
ఢిల్లీ: భారత్‌లో ఊబకాయం(Obesity) బాధితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని ది లాన్సెట్ జర్నల్(The Lancet journal) ప్రచురించింది. దేశంలో ఊబకాయ బాధితుల్లో అత్యధికంగా చిన్నారులే ఉండటం ఆందోళనకర పరిణామమని నివేదిక వెల్లడించింది. 1990 నాటితో పోల్చితే 20వ దశాబ్దంలో ఊబకాయుల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందింది. 1990లో భారత్‌లో 0.4మిలియన్ల మంది ఒబేసిటీతో బాధపడుతూ ఉండగా.. 2022 నాటికి ఆ సంఖ్య12.5 మిలియన్లకు చేరింది. ఊబకాయ బాధితుల్లో అత్యధికంగా 5 నుంచి 19 సంవత్సరాల వయస్సుగల వారే ఉండటం ఆందోళనకర పరిణామం. 12.5 మిలియన్లలో.. 7.3 మిలియన్ల మంది బాలురు, 5.2 మిలియన్ల బాలికలు ఉన్నారు. ఊబకాయంతో బాధపడుతున్న పిల్లలు, కౌమారదశలో ఉన్నవారు,పెద్దల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ దాటింది.
ఊబకాయం, తక్కువ బరువు రెండూ పోషకాహార లోపంతోనే వస్తాయని డాక్టర్లు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, యుక్త వయస్కులవారిలో ఊబకాయం 2022లో నాలుగు రెట్లు పెరిగింది. 1990లలో పెద్దవారిలో కనిపించిన ఊబకాయం ఇప్పుడు కౌమారదశలో కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోందని UKలోని ఇంపీరియల్ కాలేజ్ లండన్ సీనియర్ రచయిత ప్రొఫెసర్ మజిద్ ఎజాటి అన్నారు. అదే సమయంలో మిలియన్ల మంది ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారని.. పోషకాహార లోపాన్ని అధిగమించడం ప్రభుత్వాల ముందున్న పెద్ద టాస్క్ అని చెప్పారు.
పెద్దవారిలో ఊబకాయం రేటు మహిళల్లో రెండింతలు, పురుషులలో దాదాపు మూడు రెట్లు పెరిగింది. మొత్తంగా, 2022లో 159 మిలియన్ల మంది పిల్లలు, యుక్తవయస్కులు, 879 మిలియన్ల మంది పెద్దలు ఊబకాయంతో బాధపడుతున్నారని అధ్యయనం తెలిపింది. భారత్‌లో వయోజన ఊబకాయం రేటు 1990లో 1.2 శాతం నుండి 2022 నాటికి 9.8 శాతానికి చేరుకుంది. పురుషులలో 0.5 శాతం నుండి 5.4 శాతానికి పెరిగింది.
2022లో దాదాపు 44 మిలియన్ల మహిళలు, 26 మిలియన్ల పురుషులు ఒబేసిటీతో బాధపడుతున్నారు. వాతావరణంలో మార్పు, కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన ఆకలి పరిస్థితులు, ఉక్రెయిన్ - రష్యా తదితర యుద్ధాలు పేదరికాన్ని పెంచాయని.. తద్వారా ఆహార ధరలు భారీగా పెరిగి.. పోషకాహారానికి చాలా మంది దూరమైనట్లు నివేదిక వెల్లడించింది.
ఊబకాయానికి ప్రధాన కారణాలు
స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్‌లో అధిక కేలరీలు ఉంటాయి. ఈ ఆహారాల వల్ల ఊబకాయం వస్తుంది. ఇది కాకుండా మిఠాయి, స్వీట్లు, కూల్ డ్రింక్స్ కారణంగా పిల్లలు బరువు పెరుగుతున్నారు. క్రీడలపై తక్కువ ఆసక్తి ఉన్న పిల్లలు, వ్యాయామం చేయని పిల్లల్లో కెలరీలు కరగట్లేదు. దీంతో ఊబకాయం బారిన పడుతున్నారు. మొబైల్ వినియోగం, టీవీ చూడటం, బద్ధకం ఊబకాయం సమస్యను పెంచుతోంది.
పిల్లల తల్లిదండ్రులు లేదా కుటుంబంలోని వ్యక్తులకు ఊబకాయం సమస్య ఉంటే పుట్టే పిల్లలు కూడా అధిక బరువుతో జన్మిస్తారు. కొంతమంది పిల్లలు బరువు పెరగడం వెనుక ఒత్తిడి తదితర కారణాలు కూడా ఉంటాయి. ఒత్తిడి ఉంటే అతిగా తినేస్తారు. దీంతో బరువు పెరుగుతారు. శరీరంలో హార్మోన్ల మార్పులు కూడా బరువు పెరగడానికి కారణం కావచ్చు. ఇలా ఏ కారణంతోనైనా బరువు పెరిగితే డాక్టర్లను సంప్రదించి బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. శరీరానికి తగినంత వ్యాయామం చేస్తూ.. మంచి ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి