Uttarakhand: మదర్సా ఘటనలో 4కి చేరిన మృతుల సంఖ్య.. 250 మందికిపైగా గాయాలు
ABN , Publish Date - Feb 09 , 2024 | 10:36 AM
ఉత్తరాఖండ్‌లోని(Uttarakhand) హల్ద్వానీలో అక్రమంగా నిర్మించిన మదర్సా, మసీదు కూల్చివేత(Masjid Demolition) ఘటనలో జరిగిన హింసలో నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 250కిపైగా గాయపడినట్లు వివరించారు.
హల్ద్వాని: ఉత్తరాఖండ్‌లోని(Uttarakhand) హల్ద్వానీలో అక్రమంగా నిర్మించిన మదర్సా, మసీదు కూల్చివేత(Masjid Demolition) ఘటనలో జరిగిన హింసలో నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 250కిపైగా గాయపడినట్లు వివరించారు. అల్లర్లకు వ్యతిరేకంగా షూట్ ఎట్ సైట్ ఆదేశాలు జారీ చేయడం, ఇంటర్నెట్‌ని నిలిపేయడంతో నగరంలో కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. ఈ ఘర్షణలో 50 మందికిపైగా పోలీసులు గాయపడినట్లు తెలుస్తోంది. అధికారులు, మున్సిపల్ కార్మికులు, జర్నలిస్టులు కూడా కాల్పుల్లో గాయపడ్డారు. పోలీస్ స్టేషన్ బయట నిలిపిన వాహనాలకు ఆకతాయిలు నిప్పు అంటించారు. జేసీబీలతో నిర్మాణాలను ధ్వంసం చేయడంతో ఆగ్రహించిన స్థానికులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. బారికేడ్లను బద్దలు కొట్టి పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.
పోలీసులు, మున్సిపల్ కార్మికులు, జర్నలిస్టులపై రాళ్లు విసిరారు. ఫలితంగా చాలా మంది గాయపడ్డారు. 20కి పైగా ద్విచక్రవాహనాలు, బస్సులు, వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ప్రభావిత ప్రాంతాల్లో దుకాణాలు, పాఠశాలలు మూసేశారు. మదర్సా, మసీదు కూల్చివేతను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. అయితే కోర్టు నుంచి ఉపశమనం లభించకపోవడంతో కూల్చివేత కొనసాగింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 14న జరగనుంది.
జరిగిందిదే..
హల్ద్వానీలో బంబుల్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాలిక్ గార్డెన్ లో అక్రమంగా నిర్మిస్తున్న మసీదును మునిసిపల్ అధికారులు జేసీబీతో కూల్చివేశారు. ఈ క్రమంలో చెలరేగిన హింసను అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసు బలగాలు మోహరించాయి. అల్లర్లను ఆపేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
ఘటనపై డీజీపీ అభినవ్‌కుమార్ స్పందించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అక్రమ మదర్సాలు, నమాజ్ స్థలాలు పూర్తిగా చట్టవిరుద్ధమని అన్నారు. ఈ స్థలానికి సమీపంలో మున్సిపల్ కార్పొరేషన్ గతంలో మూడెకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. అయితే మదర్సా, నమాజ్ స్థలాన్ని సీజ్ చేసింది. సీజ్ చేసిన స్థలంలో నిర్మాణాలు కొనసాగుతుండగా ఈ ఘటన జరిగింది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి