Delhi: జైళ్లలో తగ్గుతున్న అత్యాచారం కేసులు.. అత్యధికంగా ఎక్కడంటే
ABN , Publish Date - Feb 25 , 2024 | 04:05 PM
జైళ్లలో(Prisons) అత్యాచారాల సంఖ్య క్రమంగా తగ్గుతోందని ఎన్సీఆర్బీ(NCRB) నివేదికలో వెల్లడైంది. 2017-22 మధ్య ఎన్సీఆర్బీ చేసిన స్టడీలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. 2017-22 మధ్య దేశంలోని అన్ని జైళ్లలో 270కిపైగా కస్టడీ అత్యాచార కేసులు నమోదైనట్లు తేలింది.
ఢిల్లీ: జైళ్లలో(Prisons) అత్యాచారాల సంఖ్య క్రమంగా తగ్గుతోందని ఎన్సీఆర్బీ(NCRB) నివేదికలో వెల్లడైంది. 2017-22 మధ్య ఎన్సీఆర్బీ చేసిన స్టడీలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. 2017-22 మధ్య దేశంలోని అన్ని జైళ్లలో 270కిపైగా కస్టడీ అత్యాచార కేసులు నమోదైనట్లు తేలింది. మహిళల భద్రత విషయంలో నిర్లక్ష్యం, జవాబుదారీతనం లేకపోవడం ఈ ఘటనలకు కారణంగా స్టడీ పేర్కొంది.
నేరస్థులలో పోలీసు సిబ్బంది, పబ్లిక్ సర్వెంట్లు, సాయుధ దళాల సభ్యులు, రిమాండ్ ఖైదీలు, ఆసుపత్రుల సిబ్బంది తదితరులు ఉన్నారు. అయితే కొన్నేళ్లుగా ఈ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. 2022లో 24 కేసులు, 2021లో 26, 2020లో 29, 2019లో 47, 2018లో 60, 2017లో 89 అత్యాచార కేసులు నమోదయ్యాయి. 2017 నుంచి నమోదైన 275 కస్టోడియల్ రేప్ కేసుల్లో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 92, మధ్యప్రదేశ్‌లో 43 కేసులు నమోదయ్యాయి.
ఓ పోలీస్ అధికారి మహిళను చట్టబద్ధంగా అదుపులోకి తీసుకున్న తరువాత.. ఎవరైనా అత్యాచారానికి పాల్పడితే ప్రస్తుతం ఉన్న ఐపీసీ సెక్షన్ 376(2) కింద కేసు నమోదు చేస్తారు. కస్టడీల్లో ఉండే మహిళలకు రక్షణ లేకుండా పోతోందని.. కొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడి అత్యాచారాలకు ఒడిగడుతున్నారని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనమ్ ముత్రెజా అన్నారు.
కస్టోడియల్ రేప్‌లు జరగకుండా అడ్డుకునేందుకు పటిష్ట చట్టాలు, సంస్కరణలు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. బాధితులపై సమాజం నుంచి వేధింపులు, అధికారుల్లో జవాబుదారీతనం లేకపోవడం, అధికార దుర్వినియోగం వంటివి అత్యాచారాలు జరగడానికి ప్రధాన కారణాలని అన్నారు. వీటిని ఆపడానికి ప్రభుత్వం బహుముఖ విధానాన్ని అవలంబించాలని, దాన్ని సాధించేందుకు బలమైన యంత్రాంగాలు ఉండాలని సూచించారు. ఎన్జీవోలు, పౌర సమాజం, కమ్యూనిటీ సమూహాలను ఇందులో భాగస్వామ్యం చేయాలన్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి