Share News

Chaliyar river : శవాల నది

ABN , Publish Date - Jul 31 , 2024 | 05:51 AM

తీరం పొడవునా ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో.. చల్లటి నీటితో అలరారే చలియార్‌ నది వయనాడ్‌ విలయం నేపథ్యంలో కన్నీటి కాసారంగా మారింది! ఈ ఉత్పాతంలో ముండక్కై ప్రాంతంలో చనిపోయిన 31 మంది మృతదేహాలు.. చలియార్‌ నదిలో 25 కిలోమీటర్ల మేర

Chaliyar river : శవాల నది

25 కిలోమీటర్ల మేర చలియార్‌ నదిలో కొట్టుకుపోయిన 31 మృతదేహాలు

ప్రవాహం ధాటికి తెగిపడ్డ అవయవాలు

మలప్పురం: తీరం పొడవునా ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో.. చల్లటి నీటితో అలరారే చలియార్‌ నది వయనాడ్‌ విలయం నేపథ్యంలో కన్నీటి కాసారంగా మారింది! ఈ ఉత్పాతంలో ముండక్కై ప్రాంతంలో చనిపోయిన 31 మంది మృతదేహాలు.. చలియార్‌ నదిలో 25 కిలోమీటర్ల మేర కొట్టుకుపోయి మలప్పురం జిల్లా నీలంబూర్‌కు సమీపంలోని పోతుకల్లు వద్దకు చేరుకున్నాయి. అక్కడ రెస్క్యూ టీములు ఆ మృతదేహాలను వెలికితీశాయి. అయితే.. ప్రవాహ ఉధృతికి మృతదేహాల శరీరభాగాలు ముక్కలుముక్కలుగా ఊడిపోయాయి! వరదనీటి ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో.. మరిన్ని మృతదేహాలు చలియార్‌ నదిలో కొట్టుకొచ్చే ప్రమాదం ఉందని రెస్క్యూటీములు అంచనా వేస్తున్నాయి. నదిలో నీటిస్థాయులు క్రమక్రమంగా పెరుగుతుండడంతో.. స్థానిక ప్రజలు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో సోమవారం ఉదయం నుంచి నదిలో నీటిమట్టంపై ఒక కన్నువేసి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సోమవారం అర్ధరాత్రి దాటాక.. తెల్లవారుజామున రెండు గంటల సమయంలో వయనాడ్‌ వైపు నుంచి చలియార్‌ నదిలో గ్యాస్‌ సిలిండర్లు, చెక్కదుంగలు కొట్టుకురావడం గమనించారు. వెంటనే ఆ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. మంగళవారం ఉదయం నుంచి నదిలో గాలించడం మొదలుపెట్టగా 26 మృతదేహాలు, వాటితాలూకూ శరీర భాగాలు దొరికాయి.

Updated Date - Jul 31 , 2024 | 05:51 AM