Share News

AI : రచయితలకు ‘ఏఐ’యే శత్రువు

ABN , Publish Date - Aug 15 , 2024 | 04:42 AM

ఎంత సుసంపన్న గతం కలిగినా సరైన అనువాదం లేకపోతే ఏ భాషలోని సాహిత్యం కూడా తగినవిధంగా విస్తరించలేదు. 2,500 ఏళ్ల మహోన్నత చరిత్ర కలిగిన దక్షిణ భారతదేశ సాహిత్యం కూడా ఇప్పుడు ఇదే

AI : రచయితలకు ‘ఏఐ’యే శత్రువు

ఆ సాంకేతికతతో అనువదించిన రచనల్లో కొరవడుతున్న మానవ స్పర్శ

బెంగళూరు ‘బుక్‌ బ్రహ్మ’ సమ్మేళనంలో పలువురు రచయితల స్పష్టీకరణ

బెంగళూరు, ఆగస్టు 14 : ఎంత సుసంపన్న గతం కలిగినా సరైన అనువాదం లేకపోతే ఏ భాషలోని సాహిత్యం కూడా తగినవిధంగా విస్తరించలేదు. 2,500 ఏళ్ల మహోన్నత చరిత్ర కలిగిన దక్షిణ భారతదేశ సాహిత్యం కూడా ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. ఈనాటి పోటీ సాహిత్య ప్రపంచంలో తగిన గుర్తింపు దగ్గర నుంచి వేరే భాషల్లోకి అనువాద సమస్యలు, సమాన ప్రతిపత్తి వరకు ఎన్నో సవాళ్లను ఈ సాహిత్యం ఎదుర్కొంటోంది. అయితే, కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను వాడి చేస్తున్న అనువాదాలతో ఈ సమస్యలు మరింత పెరిగాయని దక్షిణ భారతీయ రచయితలు వాపోతున్నారు. 2024లో తమ శత్రువు ఏఐయేనని తేల్చేస్తున్నారు. బెంగళూరులో ఇటీవల మూడు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ‘బుక్‌ బ్రహ్మ’ సాహిత్య సమ్మేళనంలో భాగంగా.. ‘ఏజ్‌ ఆఫ్‌ ఏఐ- ద ఎండ్‌ ఆఫ్‌ ద క్లాసిక్‌’ అనే సెషన్‌లో ఈ మేరకు వారంతా తమ ఆందోళనను వ్యక్తం చేశారు. భిన్న భాషల ప్రజల మధ్య వారధి అనువాదమేనని, ఇంత ముఖ్యమైన ప్రక్రియకు ‘ఏఐ’ వల్ల తక్షణ ముప్పు పొంచి ఉన్నదని వారంతా తేల్చిచెప్పారు. ఏఐ మాధ్యమంలో చేసిన అనువాదాలకు క్రమం, విధానం ఉండటం లేదని రచయితలు ఆక్షేపించారు. పక్షపాతాలకు, దురాభిప్రాయాలకు ఆ అనువాదాలు తావు ఇస్తున్నాయని విమర్శించారు. ఈ చర్చలో కన్నడ సాహిత్యవేత్తలు కృష్ణమూర్తి హనూర్‌, పూర్ణిమ మలగిమణి తదితరులు పాల్గొన్నారు. కవికి, అతని చుట్టూ ఉండే ప్రజలకు మధ్య ఉండే అనుబంధాన్ని కృత్రిమ మేధ పునఃసృష్టించలేదన్నారు. కన్నడ సాహిత్యవేత్త కువెంపు నవల ‘మలెగలల్లి మదుమగలు’లోని కొన్ని భాగాలను ఏఐ సాంకేతికతతో అనువదించి నాటకంగా మలిచేందుకు ప్రయత్నం చేయగా, దానిలో జీవసారం లేదన్నారు. భాషలోని సూక్ష్మ అంశాలను ‘ఏఐ’ పట్టుకోలేదని, అవి లేకపోతే రచన అందాన్ని కోల్పోతుందని తేల్చేశారు. రచనకు ప్రాణమైన మానవ స్పర్శ ‘ఏఐ’ అనువాదాలతో కొరవడుతుందనే భయాలు చర్చలో పాల్గొన్న రచయితల్లో వ్యక్తం అయింది. కాగా, దక్షిణ భారతంలోని తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషలకు చెందిన దాదాపు 300 మంది రచయితలు, ప్రచురణకర్తలు, పుస్తక సంపాదకులు ‘బుక్‌ బ్రహ్మ’ సమ్మేళనంలో పాల్గొన్నారు. ప్రసిద్ధ రచయితలు పెరుమాళ్‌ మురుగన్‌, జయంత్‌ కైకిని, బి. జయమోహన్‌, హెచ్‌ఎస్‌ శివప్రకాశ్‌ తదితరులు పలు సెషన్లలో ప్రసంగించారు.

Updated Date - Aug 15 , 2024 | 07:00 AM