Share News

ISIS: ఐఐటీ విద్యార్థి ఉగ్రవాద గ్రూపులో.. దేశవ్యాప్తంగా భారీ విధ్వంసానికి కుట్ర!

ABN , Publish Date - Mar 24 , 2024 | 06:42 PM

ఐఐటీలో(IIT) చదువుతున్న ఓ విద్యార్థి ఐసిస్ ఉగ్రవాద గ్రూపులో చేరి దేశ వ్యాప్తంగా భారీ విధ్వంసానికి కుట్ర పన్నాడనే విషయం సంచలనం సృష్టిస్తోంది. ఎట్టకేలకు అతన్ని పట్టుకుని పోలీసులు విచారిస్తున్నారు.

ISIS: ఐఐటీ విద్యార్థి ఉగ్రవాద గ్రూపులో.. దేశవ్యాప్తంగా భారీ విధ్వంసానికి కుట్ర!

గౌహతి: ఐఐటీలో(IIT) చదువుతున్న ఓ విద్యార్థి ఐసిస్ ఉగ్రవాద గ్రూపులో చేరి దేశ వ్యాప్తంగా భారీ విధ్వంసానికి కుట్ర పన్నాడనే విషయం సంచలనం సృష్టిస్తోంది. ఎట్టకేలకు అతన్ని పట్టుకుని పోలీసులు విచారిస్తున్నారు. అసోంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐఐటీ గౌహతికి చెందిన విద్యార్థి బయోటెక్నాలజీలో చదువుతున్నాడు.

ఇటీవల అతను అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. అంతకుముందు సోషల్ మీడియా అకౌంట్లలో తాను ఉగ్రవాద సంస్థలో చేరాలనుకుంటున్నట్లు పోస్ట్ చేశాడు. అయితే అదృశ్యమైన విద్యార్థిని హజోలో పట్టుకుని విచారిస్తున్నారు. విద్యార్థి తన ఈమెయిల్‌లో ఐసిస్‌లో చేరాలనుకుంటున్నట్లు పోస్ట్ చేశాడని పోలీసులు తెలిపారు. అతన్ని పట్టుకుని ఎస్టీఎఫ్ కార్యాలయానికి తీసుకువచ్చారు. అతని నుంచి కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు.


అంతకుముందు మార్చి 20న ఐసిస్ ఇండియా హెడ్ హరీస్ ఫరూఖీ అలియాస్ హరీష్ అజ్మల్ ఫరూఖీ అతని సహచరులలో ఒకరైన అనురాగ్ సింగ్ అలియాస్ రెహాన్‌ను అస్సాంలోని ధుబ్రిలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఐఐటీ విద్యార్థి అదే ప్రాంతంలో దొరకడం అనుమానాలకు తావిస్తోంది.

విద్యార్థి హాస్టల్ గదిలో ఐసిస్ మాదిరిగానే నల్లజెండా ఒకటి లభ్యమైందని పోలీసులు వివరించారు. అతను టెర్రరిస్టులతో కలిసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐఈడీ బాంబులతో విధ్వంసానికి ప్రణాళికలు రచించినట్లు పోలీసులు చెప్పారు. ఐసిస్ అనేది అమెరికా, యూకే, ఈయూ, భారత్ తదితర దేశాలు నిషేధించిన ఉగ్రవాద సంస్థ.

Updated Date - Mar 24 , 2024 | 06:44 PM