అసోం శరణార్థులకు పౌరసత్వం సరైనదే!
ABN , Publish Date - Oct 18 , 2024 | 06:01 AM
అస్సాంకు శరణార్థులుగా తరలి వచ్చిన వారికి భారత పౌరసత్వాన్ని కల్పించేందుకు పౌరసత్వ చట్టంలో చేర్చిన 6ఏ నిబంధన రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అస్సాంలో అక్రమ వలసల సమస్యకు ‘అస్సాం ఒప్పందం’ ద్వారానే రాజకీయ పరిష్కారానికి కృషి జరిగిందని పేర్కొంది.
సెక్షన్ 6ఏ రాజ్యాంగబద్ధమే స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
4:1 మెజారిటీతో తీర్పు
ఆ సెక్షన్ దుర్వినియోగమవుతోందని విడిగా జస్టిస్ పార్థివాలా తీర్పు
సుప్రీం తీర్పుపై ‘ఆసు’ హర్షం
న్యూఢిల్లీ, అక్టోబరు 17: అస్సాంకు శరణార్థులుగా తరలి వచ్చిన వారికి భారత పౌరసత్వాన్ని కల్పించేందుకు పౌరసత్వ చట్టంలో చేర్చిన 6ఏ నిబంధన రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అస్సాంలో అక్రమ వలసల సమస్యకు ‘అస్సాం ఒప్పందం’ ద్వారానే రాజకీయ పరిష్కారానికి కృషి జరిగిందని పేర్కొంది. సదరు ఒప్పందంలో భాగంగానే పౌరసత్వ చట్టంలో 6ఏ నిబంధన చేర్చారని గుర్తు చేసింది. సెక్షన్ 6ఏ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. 1966 జనవరి 1-1971 మార్చి 25 మధ్య కాలంలో అసోంకు వలస వచ్చిన వారికి భారత పౌరసత్వాన్ని కల్పించేందుకు అనుమతించే సెక్షన్ 6ఏ సరైనదేనని, దీనిని తీసుకొచ్చే అధికారం పార్లమెంటుకు ఉందని ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు పిటిషన్లను కొట్టివేస్తూ 4:1 మెజారిటీతో తీర్పును వెలువరించింది. ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్ జేబీ పార్థివాలా.. పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6ఏ రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంటూ విడిగా తీర్పును వెలువరించారు. నకిలీ పత్రాలు, సాక్ష్యాధారాలు సమర్పించి భారత పౌరసత్వం పొందటానికి ఈ సెక్షన్ అవకాశం కల్పిస్తుందన్నారు. కాగా, సీజేఐ చంద్రచూడ్ తీర్పును వినిపిస్తూ.. దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే అస్సాంలో అక్రమ వలసలు ఎక్కువన్నారు. దీనికి కారణం, ఆ రాష్ట్రం భౌగోళికంగా చిన్నది కావటంతోపాటు, అక్రమ వలసదారుల్ని గుర్తించటం అక్కడ కష్టతరంగా మారటమేనని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును చరిత్రాత్మకమైనదిగా ‘ఆల్ ఆస్సాం స్టూడెంట్స్ యూనియన్’ (ఆసు) అభివర్ణించింది. సహేతుక కారణాలతో అస్సాం ఉద్యమం జరిగిందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పినట్లయ్యిందని పేర్కొంది. అయితే, సెక్షన్ 6ఏను వ్యతిరేకిస్తూ తొలిసారిగా పిటిషన్ దాఖలు చేసిన ఆసు మాజీ నేత మతియుర్ రెహమాన్.. సుప్రీంకోర్టు తీర్పు వల్ల స్థానిక మూలవాసుల ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందన్నారు. అక్రమ వలసదారుల కేంద్రంగా అస్సాం మారటం దురదృష్టకరమని చెప్పారు. 1985లో రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రప్రభుత్వానికి, ఆసుకు మధ్య ఒప్పందం కుదిరింది. దీంట్లో భాగంగానే, పౌరసత్వ చట్టాన్ని సవరిస్తూ సెక్షన్ 6ఏను ప్రవేశపెట్టారు. ప్రధానంగా బంగ్లాదేశ్ నుంచి అస్సాంకు అక్రమంగా వలస వచ్చిన వారికి ఈ చట్టం ప్రకారం పౌరసత్వం కల్పిస్తున్నారు.