కాంగ్రెస్‌ది విద్వేష రాజకీయం: మోదీ
ABN , Publish Date - Oct 10 , 2024 | 06:05 AM
కాంగ్రెస్ విద్వేష రాజకీయం చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. కులాల పేరిట హిందువులను విభజించాలని చూస్తోందని, ఇందుకోసం విషం చిమ్ముతోందన్నారు. ముస్లింలను
నాగపూర్, అక్టోబరు 9: కాంగ్రెస్ విద్వేష రాజకీయం చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. కులాల పేరిట హిందువులను విభజించాలని చూస్తోందని, ఇందుకోసం విషం చిమ్ముతోందన్నారు. ముస్లింలను కేవలం ఓటుబ్యాంకుగా పరిగణిస్తోందని విమర్శించారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఆ పార్టీ పన్నిన ఎత్తులన్నిటినీ ఆ రాష్ట్ర ప్రజలు చిత్తుచేశారని తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు కూడా ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం ఆయన ఢిల్లీ నుంచి మహారాష్ట్రలో రూ.7,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాగపూర్‌లో హాజరైన ప్రజలు, ప్రముఖులనుద్దేశించి ప్రసంగించారు. ఓబీసీలు, దళితులు బీజేపీతోనే ఉన్నారని.. హరియాణాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయానికి అద్దం పడుతోందని తెలిపారు. ‘కాంగ్రెస్ తమ రిజర్వేషన్‌ను లాక్కుని తన ఓటుబ్యాంకుకు ఇస్తుందని దళితులు గ్రహించారు. 34 పంటలకు మద్దతు ధర ప్రకటించిన బీజేపీతో రైతులు సంతోషంగా ఉన్నారు’’ అన్నారు. ‘‘మనమంతా జాగరూకులమై ఉండాలి. మహారాష్ట్రలోని మహాయుతి (బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్‌సీపీ) ప్రభుతానికి ఈ దఫా మరింత మెజారిటీ ఇవ్వాలి’ అని ప్రజలను కోరారు. నవంబరులోపు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.