Share News

PM Modi : లౌకిక పౌరస్మృతి

ABN , Publish Date - Aug 16 , 2024 | 05:31 AM

దేశానికి లౌకిక పౌరస్మృతి అవసరమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. ఇప్పుడున్న సివిల్‌ కోడ్‌ మతపరమైనదీ, విపక్షాపూరితమైందని ఆక్షేపించారు. దీనిపై విస్తృతస్థాయిలో చర్చ జరగాలని మోదీ అభిప్రాయపడ్డారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం దేశ రాజధానిలోని

PM Modi : లౌకిక పౌరస్మృతి
Prime Minister Narendra Modi

రాజ్యాంగ కర్తల నుంచి సుప్రీంకోర్టు వరకు 78ఏళ్లుగా కోరుతున్నదిదే

ఇప్పటి మతపర సివిల్‌ కోడ్‌ను మార్చాలి

‘ఒక దేశం-ఒకే ఎన్నికలు’ నేటి అవసరం

78వ స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ, ఆగస్టు 15 : దేశానికి లౌకిక పౌరస్మృతి అవసరమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. ఇప్పుడున్న సివిల్‌ కోడ్‌ మతపరమైనదీ, విపక్షాపూరితమైందని ఆక్షేపించారు. దీనిపై విస్తృతస్థాయిలో చర్చ జరగాలని మోదీ అభిప్రాయపడ్డారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం దేశ రాజధానిలోని ఎర్రకోట బురుజుపై జాతీయ జెండాను ఎగురవేసి, ప్రధాని ప్రసంగించారు. కాషాయం, ఆకుపచ్చ, పసుపు కలగలిసిన రాజస్థానీ (లెహెరియా) తలపాగా, తెల్ల కుర్తా, చుడీదార్‌తో మోదీ కనిపించారు. తన ప్రసంగంలో ఆయన వికసిత భారత్‌ భావనను మరింత ప్రస్ఫుటంగా ఆవిష్కరించారు. బంగ్లాదేశ్‌లో హిందువుల రక్షణ, దేశంలో మహిళలపై పెరిగిన అఘాయిత్యాల నుంచి ఒక దేశం- ఒకే ఎన్నికలు, సెబీ చైర్మన్‌- అదానీ వివాదంలో విపక్షాల తీరు, ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను నిలపడం వరకు అనేక అంశాలను తన ప్రసంగంలో ఆయన ప్రస్తావించారు. ప్రధానిగా ఎర్రకోట బురుజు నుంచి ఆయన ప్రసంగించడం ఇది 11వ సారి. 98 నిమిషాలపాటు సుదీర్ఘంగా ప్రసంగించి.. రికార్డు సృష్టించారు. స్వాతంత్ర్యానంతర భారతదేశంలో 2016లో అత్యధిక సమయం ప్రసంగించిన తన రికార్డును (94 నిమిషాలు) తానే బద్దలుకొట్టడం విశేషం. దాదాపు ఆరువేలమంది పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఈసారి ఒలింపిక్‌ పతక విజేతలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారికి కేటాయించిన సీట్ల వరుసలో, వారితోపాటు ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కూర్చున్నారు. ఆ తర్వాతి వరుసలను కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలకు కేటాయించారు.

మహిళల రక్షణకు ప్రభుత్వాలు కదలాలి

ప్రధానమంత్రి తన ప్రసంగంలో సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన సివిల్‌ కోడ్‌ అంశాన్ని ప్రస్తావించారు. ‘‘మన సమాజంలోని ఒక పెద్ద సమూహం ఇప్పటి సివిల్‌ కోడ్‌ మతపరంగా ఉన్నదని నమ్ముతోంది. అది నిజం కూడా. ఈ కోడ్‌ వివక్షాపూరితమైంది. అది మత ప్రాతిపదికన దేశాన్ని ముక్కలు చేసి, అసమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు మనమంతా సెక్యులర్‌ సివిల్‌ కోడ్‌కు మారాలి. ఇది ఇప్పటి అవసరం. రాజ్యాంగ స్ఫూర్తి కూడా ఇదే. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలుమార్లు నొక్కిచెప్పింది. ఈ విషయంలో రాజ్యాంగ నిర్మాతల స్వప్నాన్ని సాకారం చేసి తీరాలి’’ అని ప్రధాని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనారిటీల రక్షణ విషయంలో 140 కోట్లమంది భారతీయులు కలత చెందుతున్నారని అన్నారు. పొరుగుదేశంలో పరిస్థితులు త్వరలోనే కుదురుకుంటాయన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. కోల్‌కోతాలో మహి ళా వైద్యురాలిపై హత్యాచారం ఘటనను ప్రధాని పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘ప్రతిరంగంలో మహిళలు దూ సుకుపోతున్నారు. కానీ, వారిపై జరుగుతున్న దాడుల ఘటనలు బాధిస్తున్నాయి. మహిళలకు భరోసా ఇచ్చే చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలి. వేగంగా దర్యాప్తు జరిపించడం వల్ల ప్రజల్లో నమ్మకం కలిగించగలుగుతాం’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

modi-speech.jpg

యువతే రాజకీయాలను మార్చాలి

2047 నాటికి ‘వికసిత్‌ భారత్‌ను ఆవిష్కరిస్తామని, ప్రపంచ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి తీరుతామని మోదీ పునరుద్ఘాటించారు. రాజకీయాల నుంచి కులతత్వం, బంధుప్రీతిని పారదోలాలని, యు వతే రాజకీయాలను మార్చాలని అన్నారు. దీనికోసం రాజకీయ కుటుంబాలకు చెందని కనీసం లక్ష మంది యువత ప్రజాజీవితంలోకి రావడానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. వైద్యవిద్య కోసం రూ.లక్షలు, రూ.కోట్లు ఖర్చుపెట్టి విదేశాలకు విద్యార్థులు ఏటా వెళుతుండటాన్ని మోదీ ప్రస్తావిస్తూ... ఎక్కడికో వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితిని తప్పించడానికి వచ్చే ఐదేళ్లలో కొత్తగా 75 వేల మెడికల్‌ సీట్లను అందుబాటులోకి తేనున్నామని ఆయన తెలిపారు.


నెహ్రూ నుంచి మోదీ దాకా..

భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 1954లో ఎర్రకోట బురుజు నుంచి తన స్వాతంత్య్ర దినోత్సవ సందేశాన్ని 14 నిమిషాల్లో ముగించారు. ఆయన కుమార్తె, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1966లో అంతే సమయం ప్రసంగించారు. గత ప్రధానుల్లో వీరిద్దరివే పొట్టి ప్రసంగాలు.. ఇక వాజ్‌పేయి 2002లో 25 నిమిషాలు, 2003లో 30 నిమిషాల్లో ప్రసంగం ముగించేయగా, ఆ మరుసటి ఏడాదే ప్రధాని అయి పదేళ్లు ఆ పదవిలో ఉన్న మన్మోహన్‌ సింగ్‌ 2012, 2013లో వరుసగా 32, 35 నిమిషాలు ప్రసంగించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ ఇప్పటికి 11సార్లు స్వాతంత్య్ర దినోత్సవ సందేశం ఇవ్వగా, అవన్నీ పెద్ద ప్రసంగాలే. అందులో 2017లో ఆయన అతి తక్కువగా 56 నిమిషాలు ప్రసంగించారు. ఇక ఐకే గుజ్రాల్‌ 1997లో 71 నిమిషాలు ప్రసంగించారు.

భారత్‌పై జరిగే కుట్రల్లో భాగం కావద్దు

బీజేపీ మేనిఫెస్టోలో యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌తోపాటు ‘ఒక దేశం- ఒకే ఎన్నికలు’ అనేదీ ముఖ్యమైనదే. ఈ ప్రతిపాదన సాధ్యాసాధ్యాల పరిశీలనకు గత ఏడాది లా కమిషన్‌ ఏర్పడింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఈ కమిటీ రాజకీయ పార్టీలను సంప్రదించి తయారుచేసిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ప్రతిపాదనను ఎక్కువ పార్టీలు వ్యతిరేకించడాన్ని మోదీ ప్రస్తావిస్తూ.. అభివృద్ధిని చూసి ఓర్వలేని వారిని, దేశ సంక్షేమం పట్టనివారని ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి వారిని అనుమతిస్తే ప్రతిదాన్నీ ధ్వంసం చేసేస్తారని వ్యాఖ్యానిం చారు. సెబీ చైర్‌పర్సన్‌-అదానీ వ్యవహారంపై హిండెన్‌బర్గ్‌ నివేదికను పరోక్షంగా మోదీ ప్రస్తావి స్తూ.. భారత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రల్లో విదేశీ శక్తులు భాగస్వాములు కావొద్దని హితవు పలికారు.

Updated Date - Aug 16 , 2024 | 05:31 AM