Live-in Relationship: సహజీవనాన్ని డిక్లేర్ చేయాలి.. లేకపోతే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా
ABN , Publish Date - Feb 06 , 2024 | 05:32 PM
ఎవరైతే లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారో, అలాగే ఎవరైతే సహజీవనం చేయాలని ప్లాన్ చేస్తున్నారో వాళ్లు తమ రిలేషన్‌ని జిల్లా అధికారుల వద్ద తప్పకుండా రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సహజీవనం చేయాలనుకునే వారి వయసు 21 ఏళ్ల కంటే తక్కువగా ఉంటే.. వారి బంధానికి తల్లిదండ్రుల సమ్మతి కచ్ఛితంగా అవసరం అవుతుంది.
ప్రస్తుతం మన దేశంలో పాశ్చాత్త సంస్కృతి విస్తృతంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దుస్తుల దగ్గర నుంచి జీవనవిధానం వరకు.. చాలా మార్పులొచ్చాయి. యువతీ యువకులైతే.. పెళ్లిళ్లపై పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. సహజీవనం చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ బంధంలో తమకు ఇష్టం వచ్చిన వ్యక్తితో నచ్చినట్టుగా జీవించొచ్చు కాబట్టి.. తల్లిదండ్రుల అభిప్రాయాల్ని సైతం లెక్క చేయకుండా లివ్-ఇన్ రిలేషన్‌షిప్ ట్రెండ్‌ని అనుసరిస్తున్నారు. దీంతో మన భారత సంస్కృతి దెబ్బతింటోందన్న ఉద్దేశంతో, యువతలో మార్పు తీసుకురావడం కోసం సహజీవనంపై ఉత్తరాఖండ్ కొన్ని కీలక నిబంధనల్ని తీసుకొచ్చింది. మంగళవారం యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పుష్కర్ సింగ్ ధామ్ సర్కార్.. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌పై ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ బిల్లు ప్రకారం.. ఎవరైతే లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారో, అలాగే ఎవరైతే సహజీవనం చేయాలని ప్లాన్ చేస్తున్నారో వాళ్లు తమ రిలేషన్‌ని జిల్లా అధికారుల వద్ద తప్పకుండా రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సహజీవనం చేయాలనుకునే వారి వయసు 21 ఏళ్ల కంటే తక్కువగా ఉంటే.. వారి బంధానికి తల్లిదండ్రుల సమ్మతి కచ్ఛితంగా అవసరం అవుతుంది. ఈ నిబంధనల్ని తప్పకుండా పాటించాల్సిందేనని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఈ బిల్లు హెచ్చరించింది. ఎవరైతే నిబంధనల్ని పాటించరో వాళ్లు ఆరు నెలల జైలు శిక్షను ఎదుర్కోవాలి, లేదా రూ.25 వేలు జరిమానా కట్టాలి. కొన్ని సందర్భాల్లో ఈ రెండు శిక్షలు కూడా అమలవ్వొచ్చని ఈ బిల్లు చెప్తోంది.
అంతేకాదు.. తమ బంధాన్ని రిజిష్టర్ చేసుకోకుండా ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం సహజీవనం చేసిన వాళ్లకు కూడా శిక్ష తప్పదు. మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ. రూ. 10,000 జరిమానా లేదా రెండూ విధించబడతాయి. ఒకవేళ తప్పుడు స్టేట్‌మెంట్ ఇస్తే.. మూడు నెలల జైలు లేదా రూ.25 వేలు జరిమానా లేదా రెండూ శిక్షలూ ఎదుర్కోవాల్సి వస్తుందని యూసీసీ బిల్లులో పొందుపరిచారు. ఒకవేళ సహజీవనంలో మనస్పర్థలు ఏర్పడి తన పార్ట్నర్ నుంచి విడిపోయినా, తనకు అన్యాయం జరిగిందని భావించినా.. సదరు మహిళలు కోర్టును ఆశ్రయించవచ్చు. మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడానికి అర్హత కూడా పొందుతారు. లివ్-ఇన్ రిలేషన్‌షిప్ ఉన్నప్పుడు ఆ జంటకు బిడ్డ పుడితే.. అప్పుడు ఆ బిడ్డను ఆ జట చత్తబద్ధమైన బిడ్డగా ప్రకటిస్తారు.
అయితే.. ఈ యూసీసీలో సహజీవనం రిజిస్ట్రేషన్‌కు కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. భాగస్వాములు నిషేధిత సంబంధంలో ఉంటే.. వారి మధ్య లైవ్-ఇన్ బంధం నమోదు చేయబడదు. భాగస్వామ్యుల్లో ఒక మైనర్ అయితే.. వారి బంధం చల్లదు. వ్యక్తుల్లో ఒకరు పెళ్లి చేసుకున్నా.. ఇతర వ్యక్తులతో లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్నా.. ఆ బంధం రిజిష్టర్ చేయబడదు. ఒక భాగస్వామి సమ్మతి లేకుండా సహజీవనం కోసం బలవంతం చేసినా.. ఆ బంధం కూడా తిరస్కరించబడుతుంది. ఒకవేళ లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌ను ముగించాలని అనుకుంటే.. అప్పుడు రద్దు ప్రకటన కాపీని ఇవ్వాల్సి వస్తుంది. మొత్తంగా చెప్పాలంటే.. సహజీవనాన్ని కూడా పెళ్లి తరహాలోనే చట్టబద్ధం చేయాలన్నదే ఈ బిల్లు ఉద్దేశమని తెలుస్తోంది.