Share News

Delhi : ఢిల్లీలో 52.9 డిగ్రీలు?

ABN , Publish Date - May 30 , 2024 | 06:12 AM

రాజధాని ఢిల్లీలో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో.. 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిజానికి బుధవారం ఢిల్లీలో 45.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ అంచనాను మించి..

Delhi : ఢిల్లీలో 52.9 డిగ్రీలు?

దేశంలోనే అత్యధికం.. ప్రపంచవ్యాప్త గరిష్ఠాల్లో ఐదో స్థానం

మధ్యాహ్నం మండుటెండ.. సాయంత్రం వానతో ఊరట

ఎండ దెబ్బకు.. ఢిల్లీలో జీవితకాల గరిష్ఠానికి విద్యుత్తు డిమాండ్‌

52.9 డిగ్రీలు.. సెన్సర్‌ తప్పిదం కావొచ్చని ఐఎండీ ప్రెస్‌నోట్‌

నీటి వృథాపై 2000 జరిమానా.. నిఘాకు 200 బృందాలు

ఢిల్లీ జలమండలికి ఆ రాష్ట్ర జలవనరుల మంత్రి ఆతిషీ ఆదేశాలు

నేడే కేరళకు నైరుతి.. రేపు తెలంగాణలో కొన్నిజిల్లాల్లో వర్షాలు

న్యూఢిల్లీ, మే 29: రాజధాని ఢిల్లీలో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో.. 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిజానికి బుధవారం ఢిల్లీలో 45.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ అంచనాను మించి.. ముంగే్‌షపుర్‌ వాతావరణ కేంద్రంలో పాదరసమట్టం 52 డిగ్రీలను దాటడంతో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మండుటెండ నుంచి కార్మికులకు ఉపశమనం కలిగించేందుకు.. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల దాకా వారికి వేతనంతో కూడిన విరామం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సక్సేనా అధికారులను ఆదేశించారు. దేశమంతటా ఢిల్లీ ఉష్ణోగ్రత గురించి చర్చించుకున్నారు. కానీ.. రాత్రి 8 గంటల తర్వాత సీన్‌ మారింది. ఈ అంశంపై వాతావరణ శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ నగరంలోని ఐదు అబ్జర్వేటరీలు, 15 ఆటోమేటిక్‌ వాతావరణ కేంద్రాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. ఒక్క ముంగే్‌షపుర్‌ వాతావరణ కేంద్రంలో మాత్రమే 52.9 డిగ్రీలు నమోదైందని.. మిగతా చోట్ల 45.2 నుంచి 49.1 డిగ్రీల దాకా మాత్రమే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని.. ముంగే్‌షపుర్‌లో సెన్సర్‌ ఎర్రర్‌ వల్లే అలా నమోదై ఉండొచ్చని, దీనిపై పరిశీలన జరుపుతున్నామని ఆ ప్రెస్‌నోట్‌లో వివరించింది. కాగా.. పగలంతా ఉడికించిన వేడి నుంచి ఉపశమనాన్నిచ్చేలా బుధవారం సాయంత్రం కురిసిన చిరుజల్లుతో ఢిల్లీ ప్రజానీకం కాసింత ఊరట పొందారు. రాజస్థాన్‌ నుంచి వీస్తున్న వేడిగాలులే ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రతలకు కారణమని వాతావరణ శాఖ ప్రాంతీయ విభాగం అధిపతి కుల్‌దీప్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. మరోవైపు.. ఉగ్రభానుడి ప్రతాపాన్ని తట్టుకునేందుకు ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తుండడంతో ఢిల్లీలో విద్యుత్తు డిమాండు బుధవారం జీవిత కాల గరిష్ఠానికి (8,302 మెగావాట్లకు) చేరింది.

2016లో రాజస్థాన్‌లో..

ఢిల్లీలో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నిజమేనని ఐఎండీ పరిశీలనలో తేలితే.. దేశంలో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రత అదే అవుతుంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం.. 2016 మే 19న రాజస్థాన్‌లోని ఫలోడీలో 51 డిగ్రీలే ఆల్‌ టైమ్‌ హై ఉష్ణోగ్రతగా ఉంది. అలాగే రాజస్థాన్‌లోని చురులో 2019 జూన్‌ 1న 50.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మళ్లీ మంగళవారం అక్కడ 50.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. హరియాణాలోని సిర్సాలో 50.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. 1956లో అల్వార్‌లో నమోదైన 50.6 డిగ్రీలు కూడా కొన్నాళ్లు రికార్డు ఉష్ణోగ్రతగా ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే క్యాలిఫోర్నియా(అమెరికా)లోని డెత్‌వ్యాలీలో 1913, జూలై 10న మధ్యాహ్నం పూట.. పాదరసమట్టాలు 56.7 డిగ్రీల సెల్సియ్‌సకు చేరుకున్నాయి. ఇప్పటిదాకా ప్రపంచంలో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రత అదే. ఆ తర్వాత ప్రపంచ వాతావరణ సంస్థ గణాంకాల ప్రకారం.. 1931లో టునీషియాలోని కెబిలిలో 55 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. మూడో అత్యధికం 53.9 డిగ్రీలు కువైత్‌లోని మిత్రిబా్‌హలో 2016లో నమోదు కాగా.. పాకిస్థాన్‌లోని తుర్బత్‌లో 2017లో 53.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.


కారణాలేంటి?

వేసవిలో కాల్చేసే మండుటెండలు మన దేశానికి కొత్త కాదుగానీ.. పర్యావరణ మార్పు ప్రభావంతో ఏటికేడాదీ ఎండల ధాటి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర, మధ్య భారతంలోని పలు ప్రాంతాలు గత కొద్దిరోజులుగా.. 48 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో నిప్పుల కుంపట్లలా మారాయి. మంగళవారంనాడు ఢిల్లీలోని మూడు వాతావరణ కేంద్రాల్లో పాదరసమట్టాలు 49.9, 49.8 డిగ్రీలకు చేరాయు. మే రెండోవారం తర్వాత వెస్ట్రన్‌ డిస్ట్రబెన్సెస్‌ రాకపోవడమే ఈ పరిస్థితికి కారణమని.. గురువారం నుంచి మళ్లీ వాటి రాకతో వర్షాలు పడి, శుక్రవారం నుంచి వాతావరణం ఒకింత చల్లబడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మొహాపాత్ర అభిప్రాయపడ్డారు. ఇటు బంగాళాఖాతం నుంచి వీచే తేమగాలుల వల్ల ఉత్తరప్రదేశ్‌లో కూడా గురువారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని చెప్పారు.

ఢిల్లీలో నీళ్లు వృథా చేస్తే రూ.2000 ఫైన్‌

అసలే ఎండలు మాడ్చేస్తున్నాయ్‌! ఆ దెబ్బకు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ నేపథ్యంలో.. నీటిని వృథా చేసేవారిపై రూ.2000 జరిమానా విధించాలని ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి ఆతిషీ.. ఢిల్లీ వాటర్‌బోర్డ్‌ సీఈవోకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో నీటిని వృథా చేసేవారిపై నిఘా పెట్టేందుకు 200 బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. నీటి వృథా అంటే.. పైపులు పెట్టి కార్లను కడగడం, వాటర్‌ ట్యాంకులు నిండిపోయినా కూడా మోటార్లు కట్టేయకుండా అలాగే వదిలేయడం, గృహావసరాలకు వినియోగించడానికి ఉద్దేశించిన నీటిని నిర్మాణపనులకు, వాణిజ్య అవసరాలకు వినియోగించడంగా పేర్కొన్నారు. అలాగే.. అక్రమ నల్లా కనెక్షన్లను గుర్తించి వాటిని తొలగించే బాధ్యతను కూడా ఆ బృందాలకు అప్పజెప్పారు.

Updated Date - May 30 , 2024 | 06:12 AM