Share News

Hemant Soren: ఇదంతా బీజేపీ అల్లిన తప్పుడు కథ.. ఆ ఊహాగానాలపై హేమంత్ సోరెన్ క్లారిటీ

ABN , Publish Date - Jan 02 , 2024 | 10:40 PM

తన సతీమణి కల్పనా సోరెన్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగిస్తారనే ఊహాగానాల్ని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తోసిపుచ్చారు. ఇదంతా బీజేపీ అల్లిన కట్టుకథ అని ఆయన మండిపడ్డారు. సీఎం పదవికి తాను రాజీనామా చేయడం..

Hemant Soren: ఇదంతా బీజేపీ అల్లిన తప్పుడు కథ.. ఆ ఊహాగానాలపై హేమంత్ సోరెన్ క్లారిటీ

Hemant Soren: తన సతీమణి కల్పనా సోరెన్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగిస్తారనే ఊహాగానాల్ని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తోసిపుచ్చారు. ఇదంతా బీజేపీ అల్లిన కట్టుకథ అని ఆయన మండిపడ్డారు. సీఎం పదవికి తాను రాజీనామా చేయడం లేదని క్లారిటీ ఇచ్చిన ఆయన.. జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్‌ అహ్మద్‌ రాజీనామా చేసిన గాండేయ్‌ నియోజకవర్గం నుంచి తన భార్య పోటీ చేస్తారనే వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఇది కూడా బీజేపీ ఊహాగానమేనని స్పష్టం చేశారు.


అసలు ఈ వ్యవహారం ఎక్కడ మొదలైందంటే.. మనీలాండరింగ్ కేసుతో సంబంధం ఉందని ఆరోపణలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీఎం హేమంత్ సోరెన్‌కు కొన్నిసార్లు సమన్లు ​​జారీ చేసింది. ఆ సమన్లను వ్యతిరేకిస్తూ.. ఆయన ఇటీవల సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. సుప్రీం దానిని తిరస్కరిస్తూ, జార్ఖండ్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఇంతలోనే ఈడీ మరోసారి సోరెన్‌కు సమన్లు పంపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని, అరెస్ట్ చేసినా చేయొచ్చని ఆరోపణలు వచ్చాయి. ఇదే సమయంలో.. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఒక ట్వీట్ చేశారు. తన సీఎం పదవికి సోరెన్ రాజీనామా చేసి, ఆ బాధ్యతల్ని సతీమణి కల్పనకు అప్పగిస్తారని.. ఈ నేపథ్యంలోనే గండేయ్‌ స్థానం నుంచి ఆమెకు అవకాశం కల్పించేలా అహ్మద్‌తో రాజీనామా చేయించారని పేర్కొన్నారు.

ఈ వ్యవహారం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. సోరెన్ తన భార్యకు నిజంగానే సీఎం పగ్గాలు అప్పగిస్తారేమోనన్న స్థాయిలో అనుమానాలు రేకెత్తాయి. అయితే.. ఇవన్నీ కేవలం కట్టుకథలు మాత్రమేనని, ఇదంతా బీజేపీ అల్లుతోందని సోరెన్ బదులిచ్చారు. అంతేకాదు.. తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలను ఉపయోగించుకుంటోందని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కూడా!

Updated Date - Jan 02 , 2024 | 10:40 PM