Share News

Tomatoes Price: మండుతున్న టమాటా ధరలు.. కిలో రూ.100?

ABN , Publish Date - Jun 17 , 2024 | 12:19 PM

వర్షాకాలం ప్రారంభమై పక్షం రోజులు గడుస్తున్నా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో టమాటా దిగుబడులు భారీగా తగ్గాయి. మార్కెట్లో సరిపడినంత స్టాక్ లేకపోవడంతో దేశవ్యాప్తంగా పలు చోట్ల టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.

Tomatoes Price: మండుతున్న టమాటా ధరలు.. కిలో రూ.100?

ఢిల్లీ: వర్షాకాలం ప్రారంభమై పక్షం రోజులు గడుస్తున్నా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో టమాటా దిగుబడులు భారీగా తగ్గాయి. మార్కెట్లో సరిపడినంత స్టాక్ లేకపోవడంతో దేశవ్యాప్తంగా పలు చోట్ల టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.

తీవ్రమైన వేడిగాలుల కారణంగా గడిచిన 20 రోజుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో టమాటా ధరలు(Tomatoes Price) రెండింతలు పెరిగి కిలోకు రూ.50కి వద్ద స్థిరపడ్డాయి. తెలంగాణలో కిలో టమాటా ధర రూ.80కిపైగా పలుకుతోంది. ఉత్తర భారతదేశంలో ధరలు స్థిరంగా ఉన్నాయి. సరఫరా కొరతతో జులైలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారవచ్చు.


కొన్ని ప్రాంతాల్లో కిలో రూ.60కిపైనే పడుతోంది. గత రెండు, మూడు వారాలలో గతేడాది కంటే ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి అని Agmarket డేటా చూపిస్తోంది. బెంగళూరులోని రిటైల్‌ మార్కెట్‌లో కిలో టమాటలు రూ.80 పలుకుతోంది. "ఈ ఏడాది చాలా రోజులపాటు 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది ఫలదీకరణ దశలో పంటను దెబ్బతీసింది. ఫలితంగా ఉత్పత్తి తగ్గింది. సరఫరా ఎక్కువగా లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి" అని మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని పింపాల్‌గావ్ APMC (వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ) అధికారి సచిన్ పాటిల్ చెప్పారు.


హైదరాబాద్‌లో...

హైదరాబాద్‌లో సైతం ఇలాంటి పరిస్థితే ఉంది. ఇక్కడ నాణ్య‌మైన మొద‌టి ర‌కం ట‌మాటా కిలో రూ. 80 నుంచి రూ. 90 ప‌లుకుతోంది. సెకండ్ క్వాలిటీ ట‌మాటా కిలో ధ‌ర రూ. 60 నుంచి 70 ఉంది. హోల్ సేల్ మార్కెట్ల‌లో రూ. 120కి మూడు కిలోల ట‌మాట విక్ర‌యిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో ధరలు ఇంకా అదుపులోనే ఉన్నాయి. జులై నుంచి అక్టోబర్ వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. కిలో టమాట రూ.100కూడా దాటే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. దీంతో టమాటలను సబ్సిడీపై అందించాలని ప్రజలు ప్రభుత్వాలను కోరుతున్నారు.

Updated Date - Jun 17 , 2024 | 01:30 PM