Share News

NEET : నీట్‌లో రెండుచోట్ల అవకతవకలు

ABN , Publish Date - Jun 17 , 2024 | 06:02 AM

నీట్‌ నిర్వహణలో అక్రమాలు నిజమేనని కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా ఒప్పుకొంది. రెండుచోట్ల అవకతవకలు జరిగినట్టు వెలుగులోకి వచ్చింది.. ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణిస్తోందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆదివారం పేర్కొన్నారు.

 NEET : నీట్‌లో రెండుచోట్ల అవకతవకలు

మొదటిసారి ఒప్పుకొన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌.. ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణిస్తోందని స్పష్టీకరణ

ఎన్‌టీఏ అధికారుల తప్పున్నట్టు తేలితే వదిలిపెట్టం.. వారు కఠిన శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరిక

‘నీట్‌’పై మోదీ మౌనం మంచిది కాదు

‘సుప్రీం’ కమిటీతో దర్యాప్తు జరిపించాలి

వైద్యవిద్యలో ప్రవేశాలపై అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలి: కపిల్‌ సిబల్‌

న్యూఢిల్లీ, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): నీట్‌ నిర్వహణలో అక్రమాలు నిజమేనని కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా ఒప్పుకొంది. రెండుచోట్ల అవకతవకలు జరిగినట్టు వెలుగులోకి వచ్చింది.. ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణిస్తోందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆదివారం పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఎన్‌టీఏ అధికారులు.. వారు ఎంత ఉన్నతస్థాయిలో ఉన్నవారైనాగానీ.. దోషులుగా తేలితే వారిని వదిలిపెట్టబోమని, వారు కఠిన శిక్షను అనుభవించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. మరోవైపు.. నీట్‌ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, పేపర్‌ లీక్‌పై ప్రధాని మోదీ మౌనంగా ఉండడం మంచిది కాదని కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ అన్నారు. నీట్‌ అక్రమాలపై సుప్రీంకోర్టు నియమించిన నిపుణులతో దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపితే అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం కాపాడుతుందని.. కాబట్టి స్వతంత్ర సంస్థతోగానీ, సుప్రీంకోర్టు ఎంపిక చేసిన స్వతంత్ర అధికారులతో గానీ దర్యాప్తు జరిపించాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం (మోదీ సర్కారు) అన్నింటినీ కేంద్రీకృతం చేస్తోందని.. ఈ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయమూ ఢిల్లీలోని అధికారుల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఉంటోందని ధ్వజమెత్తారు. మనది 140 కోట్ల మంది జనాభా.. సంక్లిష్టమైన సామాజిక వ్యవస్థ ఉన్న దేశం కాబట్టి భవిష్యత్తులో వైద్యవిద్యలో ప్రవేశాలకు సంబంధించి కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఏకాభిప్రాయానికి రావాలని ఆయన సూచించారు. అలాగే.. ఇది దేశ యువత భవిష్యత్తుపై ప్రభావం చూపే అంశం కాబట్టి, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని బలంగా లేవనెత్తాలని అన్ని రాజకీయ పార్టీలకూ ఆయన సలహా ఇచ్చారు. అవకాశం లభిస్తే తానే ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తానని.. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిబల్‌ తెలిపారు. అయితే.. ఇది న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉందనే సాకుతో కేంద్రం ఈ సమస్యను పార్లమెంటులో ప్రస్తావించేందుకు అంగీకరించకపోవచ్చని సందేహం వ్యక్తం చేశారు. జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) దుర్వినియోగమైందని ఆందోళన వెలిబుచ్చిన ఆయన.. నీట్‌ పరీక్ష నిర్వహణకు సంబంధించి గుజరాత్‌లో జరిగిన కొన్ని సంఘనలు తనను కలవరపాటుకు గురిచేశాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి చాలా సీరియస్‌ ప్రశ్నలకు ఎన్‌టీఏ సమాధానం చెప్పితీరాలని స్పష్టం చేశారు. ఇలా పరీక్షల్లో అక్రమాలకు పాల్పడి వైద్యులైనవారితో చికిత్స చేయించుకోవడం పేషెంట్లకు చాలా ప్రమాదమని ఆందోళన వెలిబుచ్చారు. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.


2dharmendra-pradhaa.jpgఅన్నీ యూపీఏపైనే..

ప్రస్తుత (మోదీ) సర్కారు హయాంలో ఇలాంటి వ్యవహారాలు బయటపడినప్పుడల్లా.. మూఢభక్తులు ముందుకొచ్చి ఈ పాపాలన్నింటికీ యూపీఏనే కారణమంటూ ఆరోపించడం మొదలుపెడతారని.. ఇది తనను చాలా ఆశ్చర్యానికి, తీవ్ర నిరాశకు గురిచేస్తుందని వాపోయారు. నీట్‌ను 2010లో భారత వైద్య మండలి (ఎంసీఐ) బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ప్రవేశపెట్టారని.. ఎంసీఐ కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలో ఉంటుంది తప్ప విద్యాశాఖ పరిధిలో కాదని ఆయన గుర్తుచేశారు. 2016 ఆగస్టు 4న బీజేపీ సర్కారు ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ చట్టంలో సెక్షన్‌ 10డిని చేర్చిందని... అప్పటిదాకా అమల్లో ఉన్న ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ యాక్ట్‌ 1956 స్థానంలో 2019 ఆగస్టు 8న నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ యాక్ట్‌ను తెచ్చిందని వివరించారు. ఆ చట్టంలోని సెక్షన్‌ 14లో నీట్‌ పరీక్ష ప్రస్తావన ఉందని తెలిపారు. కాబట్టి ఈ చట్టానికి, యూపీఏకి ఎలాంటి సంబంధమూ లేదని ఆయన స్పష్టం చేశారు. నీట్‌ నిర్వహణలో ఎలాంటి అక్రమాలూ జరగలేదంటూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ పదేపదే చెబుతుండడంపై సిబల్‌ ధ్వజమెత్తారు. ‘‘ఒక్కసారి ఆయన్ను సోషల్‌ మీడియాలో చూడమనండి. గుజరాత్‌లోనే ఈ వ్యవహారం ఎలా జరుగుతోందో తెలుస్తుంది. దేశంలోని పురోగామి రాష్ట్రాల్లో గుజరాత్‌ ఒకటి. బహుశా అవినీతిలో కూడా ఆ రాష్ట్రం ప్రగతిశీలంగా ఉన్నట్టు కనిపిస్తోంది’’ అని ఎద్దేవా చేశారు. ఆ ఒక్క రాష్ట్రంలోనే కాక.. దేశవ్యాప్తంగా కూడా ఈ పరీక్ష నిర్వహణలో అవినీతి జరిగిందని సిబల్‌ ఆరోపించారు. ‘‘67 మందికి అత్యధిక మార్కులు వచ్చి.. వారిలో కొందరు ఒకే సెంటర్‌లో పరీక్ష రాసినవారని తెలితే విద్యా శాఖ మంత్రి దాని గురించి ఆందోళన చెందాలి తప్ప అసలేమీ జరగలేదని చెప్పకూడదు.’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు జరిగినప్పుడు ఆ విషయాన్ని ఒప్పుకొనే మంత్రి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంలో లేరని దుయ్యబట్టారు.

Updated Date - Jun 17 , 2024 | 06:02 AM