National Film Awards 2024: జాతీయ చలనచిత్ర అవార్డుల్లో.. దుమ్మురేపిన సౌత్ సినిమా
ABN , Publish Date - Aug 17 , 2024 | 11:09 AM
జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం శుక్రవారం ప్రకటించింది. ఉత్తమ చిత్రం అవార్డు మలయాళ సినిమా ‘ఆట్టమ్’ను వరించగా, ఉత్తమ నటుడి పురస్కారం ‘కాంతార’ సినిమాకు గాను రిషబ్ శెట్టికి దక్కింది. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా సైతం ‘కాంతార’ నిలిచింది. ఉత్తమ నటి పురస్కారానికి నిత్య మేనన్(తిరుచిట్రంబళం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్ ప్రెస్)ను జ్యూరీ సంయుక్తంగా..
న్యూఢిల్లీ, ఆగష్టు 17: జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం శుక్రవారం ప్రకటించింది. ఉత్తమ చిత్రం అవార్డు మలయాళ సినిమా ‘ఆట్టమ్’ను వరించగా, ఉత్తమ నటుడి పురస్కారం ‘కాంతార’ సినిమాకు గాను రిషబ్ శెట్టికి దక్కింది. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా సైతం ‘కాంతార’ నిలిచింది. ఉత్తమ నటి పురస్కారానికి నిత్య మేనన్(తిరుచిట్రంబళం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్ ప్రెస్)ను జ్యూరీ సంయుక్తంగా ఎంపిక చేసింది. ప్రాంతీయ చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కార్తికేయ 2’ నిలిచింది. ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్-2 అవార్డు దక్కించుకుంది. ఉత్తమ హిందీ చిత్రంగా ‘గులెహర్’ నిలిచింది. ‘పొన్నియిన్ సెల్వన్-1’ చిత్రానికి నాలుగు పురస్కారాలు దక్కాయి. మలయాళ, తమిళ చిత్రాలకు ఐదు చొప్పున అవార్డులు ప్రకటించగా, కన్నడ సినిమాకు మూడు పురస్కారాలు వచ్చాయి. తెలుగుకు దక్కింది ఉత్తమ ప్రాంతీయ చిత్రం ఒక్కటే! 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకుగాను ఈ అవార్డులను కేంద్రం ప్రకటించింది. 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి అందిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించింది.
శ్రీకృష్ణుడే అవార్డుని తెచ్చాడు..
కార్తికేయ 2 చిత్రానికి జాతీయ పురస్కారం దక్కడం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకు గొప్ప విజయం అని ఆ చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పారు. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా పురస్కారం గెలుచుకున్న సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించింది. టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ ‘కార్తికేయ 2’ మొదలుపెట్టినప్పుడే పెద్ద సినిమా అనుకున్నాం. ఇంత సక్సె్‌సను ఊహించలేదు. జాతీయ పురస్కారం దక్కడం మా సంస్థకు చాలా గొప్ప విషయం’ అన్నారు. ఈ అవార్డునే శ్రీకృష్ణుడే తీసుకొచ్చాడని భావిస్తున్నాను అని అభిషేక్ అగర్వాల్ చెప్పారు. నేషనల్ అవార్డ్ మాపై బాధ్యతను మరింత పెంచింది అని చందు మొండేటి తెలిపారు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తను తీస్తున్న ‘తండేల్’ పూర్తయ్యాక ‘కార్తికేయ 3’ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. తను హీరోగా నటించిన ‘కార్తికేయ 2’ జాతీయ స్థాయిలో సత్తా చాటడం ఆనందంగా ఉందని హీరో నిఖిల్ చెప్పారు.
నాలుగోసారి దక్షిణాది హీరోలదే హవా..
తాజాగా రిషబ్ శెట్టిని జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం వరించడంతో దక్షిణాది చిత్రపరిశ్రమ అరుదైన ఘనతను సాధించినట్లైంది. వరుసగా నాలుగుసార్లు దక్షిణాది హీరోలు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని దక్కించుకున్నారు. 2019లో ధను్‌షకు మనోజ్ బాజ్‌పాయ్‌తో కలసి ఉత్తమ నటుడి పురస్కారం దక్కింది. ‘అసురన్’ చిత్రానికి గాను ధనుష్ ఉత్తమ నటుడి పురస్కారానికి ఎంపికయ్యారు. 2020లోనూ సూర్య, అజయ్ దేవ్‌గణ్ ఉత్తమ నటుడి పురస్కారానికి ఎంపికయ్యారు. ‘సూరారై పొట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’) చిత్రానికి గాను సూర్య ఉత్తమ నటుడి పురస్కారానికి ఎంపికయ్యారు. 2021లో ‘పుష్ప’ చిత్రానికి గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఇప్పుడు 2022కి గాను రిషభ్శెట్టిని ఈ పురస్కారం వరించింది. అంతకు ముందు 2010లో కూడా ‘ఆడుకాలం’ చిత్రానికి గాను ధనుష్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఈసారి కూడా ఉత్తమ నటుడి పురస్కారానికి దక్షిణాది నుంచి మమ్ముట్టి, రిషబ్ శెట్టి, బాలీవుడ్ నుంచి విక్రాంత్ మాసే (ట్వల్త్ ఫెయిల్) పోటీ పడగా అదృష్టం రిషబ్‌ను వరించింది. మమ్ముట్టి ‘నాన్పకల్ నేరట్టు మయక్కం, రోషాక్’ రెండు చిత్రాలతో బరిలో నిలిచినా ఫలితం నిరాశపరిచింది.
విజేతలకు ప్రముఖుల అభినందనలు..
జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రాల విభాగంలో తెలుగు నుంచి కార్తికేయ - 2 అవార్డు పొందటం సంతోషకరం. ఉత్తమ నటి నిత్యమీనన్, ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి, ఉత్తమ నృత్య దర్శకుడిగా ఎంపికైన జానీ మాస్టర్‌కు హృదయపూర్వక అభినందనలు.
- పవన్ కల్యాణ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి
70వ జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు. ఉత్తమ నటుడు రిషబ్‌శెట్టి, ఉత్తమ నటి నిత్యామేనన్.. ఉత్తమ చిత్రం ‘ఆట్టమ్’ , కార్తికేయ 2’ మేకర్స్‌కు అలాగే ఇతర పురస్కార గ్రహీతలందరికీ అభినందనలు
- చిరంజీవి
రిషబ్శెట్టికి అభినందనలు. ‘కాంతార’ చిత్రానికి ఉత్తమ నటుడి పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉంది. అందుకు అవసరమైన అన్ని అర్హతలు ఉన్నవ్యక్తివి. ‘కాంతార’ చిత్రంలో నీ అభినయం గుర్తుకు వస్తే ఇప్పటికీ నాకు గూస్బంప్స్ వస్తున్నాయి.
- ఎన్టీఆర్