NEET paper : 30 లక్షలకు నీట్ పేపర్!
ABN , Publish Date - Jun 16 , 2024 | 05:04 AM
నీట్ ప్రశ్నపత్రాన్ని లీక్ చేసినందుకు ఒక్కో అభ్యర్థి వద్దా రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షల దాకా వసూలు చేశారు. ఆ ప్రశ్నలకు జవాబులు బట్టీపట్టించేందుకు వారిని రహస్య ప్రదేశాలకు తరలించారు. పేపర్ లీకయిన విషయం బయటపడకుండా ఉండేందుకు వారిని
ఒక్కొక్క అభ్యర్థి నుంచి వసూలు చేసిన బిహార్ ముఠా..
వారందరినీ రహస్య ప్రదేశాల్లో ఉంచి జవాబుల బట్టీ
అక్కడి నుంచి నేరుగా పరీక్షా కేంద్రాలకు
మే 4వ తేదీనే ముఠా చేతికి ప్రశ్నపత్రం
నిందితుల నేరాంగీకార
వాంగ్మూలాల్లో సంచలన విషయాలు
పట్నా, న్యూఢిల్లీ, జూన్ 15: నీట్ ప్రశ్నపత్రాన్ని లీక్ చేసినందుకు ఒక్కో అభ్యర్థి వద్దా రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షల దాకా వసూలు చేశారు. ఆ ప్రశ్నలకు జవాబులు బట్టీపట్టించేందుకు వారిని రహస్య ప్రదేశాలకు తరలించారు. పేపర్ లీకయిన విషయం బయటపడకుండా ఉండేందుకు వారిని పరీక్ష రోజు దాకా అక్కడే ఉంచి.. అక్కణ్నుంచీ నేరుగా పరీక్షా కేంద్రాలకు తరలించారు! నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి బిహార్‌లో జరుగుతున్న ప్రాథమిక దర్యాప్తులో తాజాగా వెల్లడైన వివరాలివి. ఈ కేసులో అక్కడ అరెస్టయిన 14 మంది నిందితులు.. ఈమేరకు బిహార్ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగానికి (ఈవోయూ) వాంగ్మూలం ఇచ్చారు. వారు వెల్లడించిన వివరాల ఆధారంగా 13 మంది అభ్యర్థులను గుర్తించిన ఈవోయూ అధికారులు నలుగురిని ఇప్పటికే అరెస్టు చేశారు. శనివారం మరో 9 మంది నీట్ అభ్యర్థులకు నోటీసులు జారీ చేశారు. నీట్ పేపర్ లీక్ చేసిన సాల్వర్ గ్యాంగులతో వారికి ఉన్న సంబంధాల గురించి ప్రశ్నించేందుకు.. పట్నాలోని తమ కార్యాలయానికి సోమ, మంగళవారాల్లో రావాల్సిందిగా ఆదేశించారు. అరెస్టయిన నిందితులు ఈవోయుకు ఇచ్చిన నేరాంగీకార వాంగ్మూలాలను సంపాదించిన ‘ఇండియాటుడే’ వార్తాసంస్థ ఆ వివరాలను బయటపెట్టింది. వారిలో సికిందర్ కుమార్ యాదవేందు (56) అనే ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నారు. నితీశ్, అమిత్ ఆనంద్ అనే ఇద్దరు వ్యక్తులు ఒక ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీని నడుపుతున్నారని.. మే 5న పరీక్ష జరగ్గా, మే 4వ తేదీనే పేపర్ వారి చేతికి వచ్చిందని సికిందర్ వెల్లడించారు. వెంటనే వారు.. ఆ పేపర్ కోసం డబ్బు చెల్లించిన అభ్యర్థులను పట్నాలోని రామకృష్ణానగర్‌లో ఒక రహస్య గృహానికి రప్పించి, వారిని అక్కడే ఉంచారని వివరించారు. సికిందర్ ఇచ్చిన వాంగ్మూలాన్ని నితీశ్, అమిత్ ఇద్దరూ ధ్రువీకరించారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ కావడంలో తమ పాత్ర ఉందని ఒప్పుకొన్నారు. ఆ ప్రశ్నపత్రాలు ఇవ్వడానికి ఒక్కో అభ్యర్థి నుంచి రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షల దాకా వసూలు చేసినట్టు చెప్పారు.
ఏమిటీ సాల్వర్ గ్యాంగులు?
యూపీ, బిహార్, ఝార్ఖండ్ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పోటీ పరీక్షల్లో విదార్థులు ఉత్తీర్ణత సాధించేందుకు ఈ సాల్వర్ గ్యాంగ్‌లు పనిచేస్తుంటాయి. వీరికి విస్తృతమైన నెట్‌వర్క్ ఉంటుంది. నీట్ పరీక్షనే ఉదాహరణగా తీసుకుంటే.. వీరు నీట్ పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లకు భారీగా డబ్బు ఆశచూపి వలలో వేసుకుంటారు. ఆయా సూపరింటెండెంట్లు.. ప్రశ్నపత్రాలు తమవద్దకు రాగానే వాటిని సాల్వర్ గ్యాంగ్‌లకు చేరవేస్తారు. ఆ గ్యాంగుల్లోని సబ్జెక్టు నిపుణులైన సభ్యులు వాటిని 15-20 నిమిషాల్లో పరిష్కరించి.. ఆ సమాధానాలను అభ్యర్థులతో బట్టీ కొట్టిస్తారు. తర్వాత వారు నేరుగా పరీక్షా కేంద్రాల వద్దకు వెళ్లి పరీక్ష రాస్తారు. ఇంకొన్ని పరీక్షలకైతే.. సాల్వర్ గ్యాంగ్ సభ్యులే పరీక్ష రాసి ర్యాంకు వచ్చేలా చేస్తారు. ‘బిహార్‌్ టీచర్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్’లో ఇలాగే మోసం చేస్తూ దొరికిపోయిన నితీశ్‌కుమార్ అనే వ్యక్తిని పట్టుకుని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నిస్తే.. నీట్ గుట్టు బయటపడడం గమనార్హం.
రద్దు చేయండి..
నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్తగా పరీక్ష నిర్వహించాలంటూ ఎన్‌టీఏకి ఆదేశాలు ఇవ్వాలని, ఈ అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ 20 మంది విద్యార్థులు సుప్రీంకోర్టునే ఆశ్రయించారు. అంతేకాదు.. ఈ పరీక్షల్లో 620కి మించి స్కోరు సాధించిన వారి విద్యా నేపథ్యాన్ని పరిశీలించేందుకు కోర్టు అప్పాయింటెడ్ కమిటీ లేదా స్వతంత్ర సంస్థతో ‘పోస్ట్ ఎగ్జామ్ ఎనాలిసిస్’ జరిపించాలని వారు అందులో విజ్ఞప్తి చేశారు. కాగా.. నీట్ అక్రమాలకు నిరసనగా జూన్ 19, 20 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎ్‌సఏ) పిలుపునిచ్చింది. నీట్ పరీక్షను రద్దు చేయాలని, రాష్ట్రాలు తమ తమ సొంత ప్రవేశపరీక్షలను నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ డిమాండ్ చేశారు.