పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. భారత్‌పై తీవ్ర ప్రభావం!
ABN , Publish Date - Oct 03 , 2024 | 05:27 AM
ఇరాన్ నుంచి క్షిపణులు ఇజ్రాయెల్‌పైకి దూసుకెళ్తున్నాయి.. ఇజ్రాయెల్ దళాలు లెబనాన్‌లో దాడులు జరుపుతున్నాయి.. మనకు కొన్ని వేల కి.మీ.ల దూరంలో ఈ పరిణామాలు జరుగుతున్నా.. మన మీద ఇవి తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. పశ్చిమాసియాతో భారత్‌కు సన్నిహిత సంబంధాలు ఉండటమే దీనికి కారణం. చమురు దిగుమతులు, పలు
చమురు దిగుమతుల్లో 80% గల్ఫ్ నుంచే..
పశ్చిమాసియాతో సన్నిహిత వాణిజ్య సంబంధాలు
అక్కడ ఉద్యోగాల్లో 90 లక్షల మంది భారతీయులు
దేశానికి భారీ ఎత్తున విదేశీ మారక ద్రవ్యం
ఘర్షణలతో విదేశాంగ విధానంపైనా ప్రభావం
న్యూఢిల్లీ, అక్టోబరు 2: ఇరాన్ నుంచి క్షిపణులు ఇజ్రాయెల్‌పైకి దూసుకెళ్తున్నాయి.. ఇజ్రాయెల్ దళాలు లెబనాన్‌లో దాడులు జరుపుతున్నాయి.. మనకు కొన్ని వేల కి.మీ.ల దూరంలో ఈ పరిణామాలు జరుగుతున్నా.. మన మీద ఇవి తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. పశ్చిమాసియాతో భారత్‌కు సన్నిహిత సంబంధాలు ఉండటమే దీనికి కారణం. చమురు దిగుమతులు, పలు రకాల ఉత్పత్తుల ఎగుమతులు, గల్ఫ్ దేశాల్లో కొన్ని లక్షల మంది భారతీయులు పని చేస్తుండటం.. వీటన్నింటిపైనా ప్రభావం కనిపించే అవకాశం ఉంది.
చమురు: పెట్రోల్, డీజిల్ తదితర చమురు అవసరాలకు మనం పశ్చిమాసియా మీదే అత్యధికంగా (దిగుమతుల్లో దాదాపు 80ు) ఆధారపడి ఉన్నాం. అక్కడి నుంచి వచ్చే చమురు సరఫరాలో ఏ కొంచెం ఇబ్బందులు తలెత్తినా మన మీద తక్షణం ప్రభావం పడుతుంది. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ ధరలకు అనుగుణంగానే దేశంలో పెట్రో ధరలను సవరిస్తున్న సంగతి తెలిసిందే. చమురు ధరలు పెరిగితే రవాణాఛార్జీలు పెరిగి నిత్యావసరాల ధరలు పెరిగిపోతాయి.
వాణిజ్యం: పశ్చిమాసియాతో భారత్‌కు వాణిజ్యపరంగా సన్నిహిత సంబంధాలున్నాయి. మన దేశం నుంచి అక్కడికి యంత్రాలు, ఔషధాల తదితర పలు రకాల ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి. అక్కడి నుంచి మనకు చమురు, సహజ వాయువు, ఎరువులు దిగుమతి అవుతాయి. ప్రస్తుతం ద్వైపాక్షిక వాణిజ్యం 1,95,000కోట్ల డాలర్లుగా (రూ.16,36,949 కోట్లు) ఉంది. దీంతోపాటు గల్ఫ్ దేశాల నుంచి భారత్‌లోకి గణనీయమైన స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. భారత్‌లోని మౌలిక సదుపాయాల (ఇన్‌ఫ్రా) కంపెనీలు, టెక్ స్టార్ట్‌పలు తదితర రంగాల్లో గల్ఫ్ పెట్టుబడులు ఉన్నాయి. పలు గల్ఫ్ దేశాలతో భారత్.. ‘ఫ్రీ ట్రేడ్ అగ్నిమెంట్’ల దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఒప్పందాలు కుదిరితే వాణిజ్యం, పెట్టుబడులు మరింత పెరుగుతాయి. కానీ, పశ్చిమాసియాలో అస్థిర పరిస్థితులు తలెత్తితే వీటన్నింటిపైనా తీవ్ర ప్రభావం చూపుతాయి.
ఉపాధి: గల్ఫ్ దేశాల్లో దాదాపు 90 లక్షల మంది భారతీయులు పని చేస్తున్నారు. వారి ద్వారా వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం భారత్‌కు లభిస్తోంది. ప్రస్తుత ఉద్రిక్తతలు కొనసాగితే ఇన్ని లక్షల మంది భారతీయుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమవుతుంది. వారు ఉద్యోగాలు కోల్పోయి భారత్‌కు తిరిగి వస్తే.. వారికి ఉపాధి ఏమిటన్న కొత్త సవాళ్లు ఎదురవుతాయి.
విదేశాంగ విధానం: ప్రస్తుతం భారత్‌కు అటు ఇరాన్‌తోనూ ఇటు ఇజ్రాయెల్‌తోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. 2010 నుంచి ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు తీవ్రతరం కావటానికి ముందు వరకూ.. ఆ దేశం నుంచి గణనీయమైన స్థాయిలో భారత్‌కు చమురు దిగుమతులు ఉండేవి. ఇక, ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ, మిలిటరీ సామగ్రి దిగుమతి అవుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగిపోతే.. తటస్థ వైఖరిని భారత్ కొనసాగించటం కత్తి మీద సాము అవుతుంది. ఇజ్రాయెల్‌కు బలమైన దన్నుగా ఉన్న అమెరికా, పశ్చిమ దేశాలు.. ఈ మేరకు భారత్‌పై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. మరోవైపు, ఇరాన్‌కు అనుకూలంగా రష్యా, చైనా రంగంలోకి దిగితే పరిస్థితి మరింత జఠిలంగా మారుతుంది.