Uttarakhand: నిరసనల్లో విధ్వంసానికి పాల్పడుతున్నారా.. అయితే మీ ఆస్తులన్నీ పోయినట్లే
ABN , Publish Date - Feb 25 , 2024 | 06:18 PM
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తి ధ్వంసం కేసుల్లో జరిగిన ఆస్తి నష్టాన్ని ఎవరు భరిస్తారనేదానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. అలాంటి కేసుల్లో ఆస్తి నష్టం పూర్తి భారాన్ని నిందితులపై పెట్టాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది.
డెహ్రాడూన్: సాధారణంగా ఒక సమూహం నిరసనలకు పాల్పడిన కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతుంటుంది. అలా చేసిన వారికి పలు సెక్షన్ల కింద కేసు పెట్టి.. జైలు శిక్ష విధించడం తరువాత వారు బయట తిరగడం సాధారమైపోయింది. ఇలాంటి కేసుల్లో జరిగిన ఆస్తి నష్టాన్ని ఎవరు భరిస్తారనేదానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. అలాంటి కేసుల్లో ఆస్తి నష్టం పూర్తి భారాన్ని నిందితులపై పెట్టాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగా ఫిబ్రవరి 26న ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 'ఉత్తరాఖండ్ పబ్లిక్, ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ బిల్లు'ను ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం.. నిరసనల సమయంలో వ్యక్తులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తే అధికారులు వారిపై కఠినంగా వ్యవహరించనున్నారు. బిల్లు అమల్లోకి వస్తే ఇకపై ఉత్తరాఖండ్‌లో నిరసనల్లో విధ్వంసానికి పాల్పడిన వారి నుంచి నష్ట పరిహారాన్ని వసూలు చేస్తారు.
రిటైర్డ్ జిల్లా జడ్జి అధ్యక్షతన ట్రైబ్యునల్‌ని ఏర్పాటు చేస్తారు. ఉత్తరప్రదేశ్ సర్కార్ 2020లోనే ఇలాంటి బిల్లును ఆమోదించింది. కొన్ని రోజుల క్రితం యూనిఫాం సివిల్ కోడ్(UCC)ని ప్రవేశ పెట్టిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ఒకే విధమైన పౌర చట్టాలు వర్తిస్తాయని ఈ ముసాయిదా స్పష్టం చేస్తోంది. ఈ చట్టం వల్ల సమాజంలోని ప్రతి వర్గానికి ప్రయోజనం చేకూరుతుందని, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చిందని సీఎం పుష్కర్ సింగ్ ధామి చెప్పారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి