President : మీడియా దిగ్గజాన్ని కోల్పోయాం
ABN , Publish Date - Jun 09 , 2024 | 03:15 AM
రామోజీరావు మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. ‘‘రామోజీ మరణంతో మీడియా, వినోద రంగం ఓ దిగ్గజాన్ని కోల్పోయింది.
న్యూఢిల్లీ, జూన్ 8(ఆంధ్రజ్యోతి):రామోజీరావు మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. ‘‘రామోజీ మరణంతో మీడియా, వినోద రంగం ఓ దిగ్గజాన్ని కోల్పోయింది. ఆయన కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. రామోజీరావు వ ురణం బాధాకరమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ విచారం వ్యక్తం చేశారు. రామోజీ మరణం పట్ల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం తెలియజేశారు. రామోజీరావు జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. మీడియా, సినిమా రంగాలకు రామోజీరావు అందించిన సేవలు చిరస్మరణీయమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ రామోజీ కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు.
టీడీపీ ప్రధాన కార్యాలయంలో...
టీడీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, నక్కా ఆనంద్‌బాబు, బొండా ఉమామహేశ్వరరావు తదితరులు రామోజీరావుకు ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన చేసిన సేవలను కీర్తించారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు పరచూరి అశోక్‌బాబు, దువ్వారపు రామారావు, శాసనసభ్యులు కొండ్రు మురళి, దాట్ల సుబ్బరాజు, ఎంఎస్ రాజు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, లింగారెడ్డి, ఏవీ రమణ, దారూనాయక్, దారపనేని నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవరావు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ తదితరులు విడివిడి ప్రకటనల్లో తమ సంతాపాన్ని తెలిపారు.